భార్య మరణాన్ని జీర్ణించుకోలేని ఆర్మీ మాజీ అధికారి.. నలుగురు పిల్లలతో కలిసి దారుణానికి ఒడిగట్టిన వైనం

ABN , First Publish Date - 2021-10-26T06:30:54+05:30 IST

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల మృతదేహాలు శనివారం పోలీసులకు లభించాయి. కర్ణాటకలోని హక్కేరి తాలూకాలోని బోరాగల్ గ్రామంలో..

భార్య మరణాన్ని జీర్ణించుకోలేని ఆర్మీ మాజీ అధికారి.. నలుగురు పిల్లలతో కలిసి దారుణానికి ఒడిగట్టిన వైనం

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల మృతదేహాలు శనివారం పోలీసులకు లభించాయి. కర్ణాటకలోని హక్కేరి తాలూకాలోని బోరాగల్ గ్రామంలో జరిగిందీ ఈ ఘటన. 46 ఏళ్ల మాజీ ఆర్మీ అధికారి గోపాల్ హాదిమణి, తన నలుగురు పిల్లల ప్రాణాలు తీసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గోపాల్ భార్య జయ అనారోగ్య కారణంతో మరణించడంతో ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.


చనిపోయిన పిల్లల్లో పెద్ద కుమార్తె సౌమ్య వయసు 19 సంవత్సరాలు. రెండో కుమార్తెకి 16 ఏళ్లు, మూడో కుమార్తె సాక్షి 11 సంవత్సరాలు, చివరి్లో కుమారుడు శ్రుజన్ వయసు 8 సంవత్సరాలు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న శంకేశ్వర పోలీసులు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్నారు. 


పక్కింటి వాళ్లు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఓ సూసైడ్ నోట్ కూడా పోలీసులకు లభించింది. అందులో తమ అంతిమయాత్ర ఎలా నిర్వహించాలో రాసి ఉంచారు. దానితో పాటు అందుకు అవసరమైన రూ.20వేల నగదును కూడా అక్కడే ఉంచారు. అలాగే తమ చావుకు ఎవరూ కారణం కాదని అందులో పేర్కొన్నారు. వీరి మరణంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకొన్నాయి. సోమవారం ప్రారంభం పాఠశాలలు మొదలు కాబోతున్నాయని, తాము స్కూళ్లకు వెళతామని పిల్లలు ఆనందంతో చెప్పారని, కానీ ఇంతలో ఈ దారుణం జరిగిందని చుట్టుపక్కల వారు గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.


గోపాల్ భార్య జయ ఈ మధ్యనే కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్‌తో పాటు బ్లాక్ ఫంగస్ కూడా సోకడంతో జూలై 6న మరణించారు. ఆమె మరణం గోపాల్‌ను తీవ్రంగా కలచివేసింది. ఆ బాధ నుంచి అతడు బయటపడలేకపోయాడు. 22వ తేదీ శుక్రవారం ఆమె పుట్టినరోజును కూడా గోపాల్ జరుపుకొన్నాడు. ఆ తర్వాతే పిల్లలందరికీ విషం ఇచ్చి తాను కూడా తీసుకున్నాడు. 

Updated Date - 2021-10-26T06:30:54+05:30 IST