Abn logo
Jul 14 2021 @ 03:05AM

యశ్‌పాల్‌ ఇక లేడు

1983 ప్రపంచకప్‌ హీరో

1983 వరల్డ్‌కప్‌తో యశ్‌పాల్‌ (మధ్య)


న్యూఢిల్లీ: భారత జట్టు 1983 వరల్డ్‌కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ బ్యాట్స్‌మన్‌ యశ్‌పాల్‌ శర్మ మంగళవారం హఠాన్మరణం చెందాడు. తీవ్రస్థాయిలో గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశాడు. 66 ఏళ్ల యశ్‌పాల్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఉదయం రోజూలాగే వాకింగ్‌కు వెళ్లి వచ్చిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలినట్టు సమాచారం. ఆయన మృతిపై అప్పటి సహచర ఆటగాళ్లు షాక్‌కు లోనయ్యారు. అలాగే సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. క్రికెట్‌ నుంచి వైదొలిగాక అంపైర్‌గానే కాకుండా సెలెక్షన్‌ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఎంఎస్‌ ధోనీని భారత జట్టుకు ఎంపిక చేసిన కమిటీలో యశ్‌పాల్‌ కూడా ఉన్నాడు.

మిడిలార్డర్‌లో అండ..:

80వ దశకంలో మిడిలార్డర్‌లో నమ్మదగ్గ ఆటగాడిగా యశ్‌పాల్‌ పేరు తెచ్చుకున్నాడు. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా ఆ తర్వాత చెలరేగేవాడు. ఆయా సందర్భాల్లో క్రీజుకు అతుక్కుపోయి వికెట్‌ను కాపాడుకుంటూ జట్టుకు అండగా నిలిచేవాడు. 1983 ప్రపంచక్‌పలో భారత జట్టు తొలి మ్యాచ్‌ను భీకరమైన విండీ్‌సతో తలపడింది. ఆ మ్యాచ్‌లో మైకేల్‌ హోల్డింగ్‌, మాల్కమ్‌ మార్షల్‌, ఆండీ రాబర్ట్స్‌, జోయల్‌ గార్నర్‌ల బౌలింగ్‌కు ఎదురొడ్డి యశ్‌పాల్‌ 89 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దీంతో వరల్డ్‌కప్‌ చరిత్రలో విండీస్‌ తొలి పరాజయాన్ని చవిచూసింది. అలాగే  ఇంగ్లండ్‌తో సెమీ్‌సలోనూ తన బ్యాట్‌ పవర్‌ చూపిస్తూ 61 రన్స్‌తో టాపర్‌గా నిలిచి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఆ మ్యాచ్‌లో ప్రఖ్యాత బాబ్‌ విల్లీస్‌ ఓవర్‌లో ఫ్లిక్‌ షాట్‌తో స్క్వేర్‌ లెగ్‌ వైపు బాదిన సిక్సర్‌ను అభిమానులు మర్చిపోలేరు. మొత్తంగా ఆ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 240 పరుగులతో భారత్‌ తరఫున రెండో అత్యధిక పరుగుల ఆటగాడిగా నిలిచాడు.

ఇదీ కెరీర్‌..:

1978లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన యశ్‌పాల్‌ 37 టెస్టుల్లో రెండు సెంచరీలతో 1606 పరుగులు.. 42 వన్డేల్లో 883 రన్స్‌ సాధించాడు. అలాగే రంజీ కెరీర్‌లో అతడు పంజాబ్‌, హరియాణా, రైల్వేస్‌ తరఫున 160 మ్యాచ్‌ల్లో 8,933 పరుగులు సాధించాడు. ఇందులో 21 శతకాలుండగా అత్యధిక స్కోరు 201 నాటౌట్‌.


నమ్మలేకున్నాం..:

1983 ప్రపంచకప్‌ ఆటగాళ్లలో యశ్‌పాల్‌ ఒక్కడే అందరికన్నా ఫిట్‌గా ఉంటాడట. అందుకే ఈ విషాద వార్తను నమ్మలేకపోతున్నామని మదన్‌లాల్‌ చెప్పాడు. ఇది నిజం కాదేమోనని అనుకున్నా, చివరికి యశ్‌ చిరకాల స్నేహితుడు కీర్తి ఆజాద్‌ విషయం చెప్పాకే అందరికీ నమ్మకం కుదిరిందన్నాడు. ఏం మాట్లాడాలో తెలీడం లేదని, యశ్‌ మృతిపై షాక్‌కు లోనయ్యానని కపిల్‌దేవ్‌ అన్నాడు. గవాస్కర్‌, వెంగ్‌సర్కార్‌, బల్వీందర్‌ సింగ్‌ సంధూ, గంగూలీ.. యశ్‌పాల్‌ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మాజీ క్రికెటర్‌ యశ్‌పాల్‌ శర్మ ఇక లేరనే వార్త విచారకరం. భారత జట్టు 1983 వరల్డ్‌కప్‌ విజయంలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, జట్టు సహచరులకు సానుభూతి.


- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌


భారత క్రికెట్‌లో మరచిపోలేని ఆటగాడు యశ్‌పాల్‌ శర్మ . జట్టు ఆటగాళ్లకే కాకుండా అభిమానులకు, వర్థమాన క్రికెటర్లకు ప్రేరణగా నిలిచాడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.     

- ప్రధాని నరేంద్ర మోదీ


యశ్‌పాల్‌ మరణ వార్త బాధాకరం. 1983 ప్రపంచకప్‌లో ఆయన బ్యాటింగ్‌ చూసిన జ్ఞాపకాలను మర్చిపోలేను. భారత క్రికెట్‌కు ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.   

  - సచిన్‌ టెండూల్కర్‌