2021 భారత ఐటీదే..

ABN , First Publish Date - 2021-01-18T05:35:51+05:30 IST

ఈ ఏడాది భారత ఐటీ కంపెనీలకు బాగానే కలిసొస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కొవిడ్‌ కష్టాలతో పాటు దేశీయ ఐటీ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలూ తెచ్చిందని ఇన్ఫోసిస్‌ మాజీ

2021 భారత ఐటీదే..

సవాళ్లకు సిద్ధంగా ఉండాలి

ఇన్ఫోసిస్‌ మాజీ సీఎ‌ఫ్‌ఓ బాలకృష్ణన్‌


బెంగళూరు: ఈ ఏడాది భారత ఐటీ కంపెనీలకు బాగానే కలిసొస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కొవిడ్‌ కష్టాలతో పాటు దేశీయ ఐటీ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలూ తెచ్చిందని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎ్‌ఫఓ వీ బాలకృష్ణన్‌ చెప్పారు. దీంతో ఐటీ కంపెనీల్లో ఎక్కువ భాగం ఈ ఏడాది సింగిల్‌ డిజిట్‌లోనే అయినా మంచి వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కంపెనీలన్నీ ఖర్చులు తగ్గించుకునేందుకు క్లౌడ్‌ టెక్నాలజీకి మారుతున్న విషయాన్ని బాలకృష్ణన్‌ గుర్తు చేశారు. ఇది భారత ఐటీ కంపెనీలకు పెద్ద వ్యాపార అవకాశం అవుతుందన్నారు.  


సవాళ్లున్నాయ్‌: కొవిడ్‌తో కొత్త వ్యాపార అవకాశాలు వచ్చినా భారత ఐటీ కంపెనీలకు కొన్ని సవాళ్లు తప్పవని బాలకృష్ణన్‌ చెప్పారు. ముఖ్యంగా ప్రతి 3-4 సంవత్సరాలకు ఏదో ఒక రూపం లో ఎదురవుతున్న అవాంతరాల్ని గుర్తు చేశారు. టెక్నాలజీ లేదా ఆర్థిక సంక్షోభాల రూపంలో ఈ సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ఊహించలేని ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐటీ కంపెనీలు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలన్నారు. ‘ఇంటి నుంచి పని’ విధానాన్ని ఈ సందర్భంగా గుర్తు  చేశారు. కొవిడ్‌ లాక్‌డౌన్ల నేపథ్యంలో ప్రారంభమైన ఈ విధానం ఐటీ కంపెనీల పనితీరుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసిందని బాలకృష్ణన్‌ అన్నారు.


స్టార్ట్‌ప్సతో కలిసి పని చేయాలి: మారిపోతున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకునేందుకు ఐటీ కంపెనీలు స్టార్టప్‌ కంపెనీలతో కలిసి పని చేయాలని బాలకృష్ణన్‌ సూచించారు. దీనికి తోడు అమ్మకాలు, మార్కెటింగ్‌పైనా దృష్టి పెట్టాలన్నారు. మారుతున్న మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టు ఉద్యోగుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచడం అత్యంత ముఖ్యమన్నారు. ఈ విషయాల్ని గుర్తుంచుకుంటే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా భారత ఐటీ కంపెనీల వృద్ధికి ఢోకా ఉండదన్నారు. 

Updated Date - 2021-01-18T05:35:51+05:30 IST