పూర్వ వైభవం తెస్తా

ABN , First Publish Date - 2021-06-15T07:54:39+05:30 IST

మాన్సాస్‌ ట్రస్టుకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆ ట్రస్టు పూర్వ చైర్మన్‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు చెప్పారు. మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు

పూర్వ వైభవం తెస్తా

ప్రజల కోసమే మాన్సాస్‌ ట్రస్టు.. ఏడాదిగా ఏం జరిగిందో పరిశీలిస్తా

నష్ట నివారణకు చర్యలు చేపడతా.. పూర్వ చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు

హైకోర్టు తీర్పుపై హర్షం


విజయనగరం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): మాన్సాస్‌ ట్రస్టుకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆ ట్రస్టు పూర్వ చైర్మన్‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు చెప్పారు. మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసి, ట్రస్టుకు చైర్మన్‌గా తిరిగి అశోక్‌ గజపతిరాజునే నియమించాలని ఆదేశించిన నేపథ్యంలో ఆయన సోమవారం తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. మాన్సాస్‌ ట్రస్టుతోపాటు సింహాచలం దేవస్థానానికి చైర్మన్‌గా తనను పునర్నియమించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఈ తీర్పుతో రాజ్యాంగం, చట్టాలపై మరింత నమ్మకం కలిగినట్టయిందని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించడం వల్లే కోర్టుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని చెప్పారు. మాన్సాస్‌ ప్రజల సంస్థ అని, పూర్వీకులు మంచి ఆశయాలతో ఏర్పాటు చేశారని తెలిపారు. వంశపారంపర్యంగా.. నిబంధనలకు అనుగుణంగా ట్రస్టును, దాని పరిధిలోని 105 దేవాలయాలను పరిరక్షించుకుంటూ వస్తున్నామన్నామని చెప్పారు. ట్రస్టు చైర్మన్‌ పదవి నుంచి 2020లో ప్రభుత్వం తనను డిస్మిస్‌ చేసిందని, దశలవారీగా ఆలయాల బాధ్యతల నుంచి తప్పించారని, ఈ విధంగా ఎందుకు చేశారో తనకు తెలియదన్నారు. 


తనను తప్పించిన తరువాత.. సోషల్‌ మీడియాలో తండ్రులను మార్చిన సంచయితను తీసుకొచ్చి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఖండించాల్సిన రాష్ట్ర మంత్రి బొత్స ఇది కుటుంబ వ్యవహారమని ప్రకటించారని, ట్రస్టు గురించి స్థానిక ఎమ్మెల్యేకు, మంత్రి బొత్స సత్యనారాయణకు తెలియదా? అని ప్రశ్నించారు. సంచయిత బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన కొన్ని సంఘటనలు తనను బాధించాయన్నారు. సింహాచల దేవస్థానంలోని గోశాలలో గోవులు ఆకలితో అలమటించి చనిపోయాయని, మాన్సాస్‌ ట్రస్టు ఇక్కడ పుడితే, విజయనగరంలోని ట్రస్టు కార్యాలయాన్ని పొరుగున ఉన్న విశాఖ జిల్లా పద్మనాభానికి తరలించారని, ఇలా కోటపై కుట్రలు చేశారని, రామతీర్థంలో రాములోరి విగ్రహం ధ్వంసమైన సమయంలో కొత్త విగ్రహాల తయారీకి తాను లక్షా వేయి నూట పదహారు రూపాయలతో చెక్కును దేవస్థానం అధికారులకు పంపితే తిరిగి తిప్పి పంపేశారన్నారు. ఏడాది కాలంలో సింహాచలంతో పాటు మాన్సాస్‌ ట్రస్టులో ఏమి జరిగిందో? సమగ్రంగా తెలుసుకుంటానన్నారు. నష్ట నివారణ చర్యలు చేపడతానని, ఇందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తనకు సహకరించాలని కోరారు. దేవాలయాల ఆదాయం నుంచి 17 శాతం దేవదాయశాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు వెళ్తోందని, ఆ మొత్తంలో ప్రభుత్వం దేవాలయాలను అభివృద్ధి చేయాల్సి ఉందని అశోక్‌గజపతిరాజు చెప్పారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాలయాలు అభివృద్ధి చెందాలన్నారు. రాజకీయాలకు తావులేకుండా వాటిని అభివృద్ధి చేయాలన్నారు.

Updated Date - 2021-06-15T07:54:39+05:30 IST