చెన్నైని తలైవా కూడా కాపాడలేడు.. సెహ్వాగ్‌ సెటైర్‌!

ABN , First Publish Date - 2020-10-25T03:01:04+05:30 IST

ఐపీఎల్‌ 2020లో చెన్నై ఓటముల పరంపర కొనసాగుతోంది. ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై ఇంత దారుణంగా ఏ సీజన్‌లోనూ ఆడింది లేదు. కానీ ఈ సీజన్‌లో మాత్రం ఘోర పరాజయాలతో...

చెన్నైని తలైవా కూడా కాపాడలేడు.. సెహ్వాగ్‌ సెటైర్‌!

ఐపీఎల్‌ 2020లో చెన్నై ఓటముల పరంపర కొనసాగుతోంది. ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై ఇంత దారుణంగా ఏ సీజన్‌లోనూ ఆడింది లేదు. కానీ ఈ సీజన్‌లో మాత్రం ఘోర పరాజయాలతో పాటు పరాభవాలనూ మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చెన్నై జట్టు ప్రదర్శన, ఐపీఎల్‌ ఆ జట్టు పరిస్థితిపై సెటైర్లు వేశాడు. సోషల్ మీడియా వేదికగా చెన్నైపై విమర్శనాస్త్రాలను సంధించాడు. ఐపీఎల్‌ 2020 సీజన్ ప్రారంభం నుంచి 'వీరు కి బైఠక్‌' అంటూ సోషల్‌ మీడియాలో సెహ్వాగ్‌ హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గెటప్‌లో కనువిందు చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు పూర్తిగా తేలిపోవడంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. ఈ సారి చెన్నై జట్టును సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా కాపాడలేరంటూ సెటైర్లు వేశాడు.


'నేను వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చేసరికి.. చెన్నై టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్ చేరింది. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా.  ఇంతకుముందు తమ ఆటగాళ్లు బంతిని బాదుతుంటే చెన్నై అభిమానులు కేరింతలు కొట్టేవాళ్లు.. కానీ శుక్రవారం మ్యాచ్‌లో మాత్రం బంతి వికెట్‌ను గిరాటేయకుంటే చాలని దేవుడిని మొక్కుకుని ఉంటారం'టూ ఎద్దేవా చేశాడు. అంతేకాకుండా ఇరు జట్లలో ఉన్న ఆటగాళ్లలో ఫిట్‌నెస్‌ లేని ఆటగాళ్లకు వీరూ చురకలు వేశాడు.


ఇదిలా ఉంటే షార్జా వేదికగా ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై దారుణమైన ఓటమి చవిచూసింది. తొలుత తొమ్మిది వికెట్ల నష్టానికి 114 పరుగుల అత్యల్ప స్కోరు మాత్రమే చేసింది.  దాంతో మ్యాచ్‌ ఏకపక్షమైపోయింది. ఇక స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అలవోకగా విజయం సాధించింది.

Updated Date - 2020-10-25T03:01:04+05:30 IST