ఇందూరు ప్రభుత్వ ఆస్పత్రికి యువీ ఫౌండేషన్‌ అండ

ABN , First Publish Date - 2021-07-29T09:05:07+05:30 IST

‘యువీ కెన్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన 120 ఐసీయూ బెడ్ల వార్డును మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ వార్డు ఏర్పాటుకు ఆయన రూ.2.5 కోట్ల విరాళం ఇచ్చారు.

ఇందూరు ప్రభుత్వ ఆస్పత్రికి యువీ ఫౌండేషన్‌ అండ

2.5 కోట్లతో ఐసీయూ వార్డు 

ఆన్‌లైన్‌లో ప్రారంభించిన యువరాజ్‌ సింగ్‌

హోం మంత్రి మహమూద్‌ అలీ అభినందన


నిజామాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : ‘యువీ కెన్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన 120 ఐసీయూ బెడ్ల వార్డును మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ వార్డు ఏర్పాటుకు ఆయన రూ.2.5 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వెయ్యి పడకల ఏర్పాటే లక్ష్యంగా ఫౌండేషన్‌ పనిచేస్తోందని తెలిపారు. కొవిడ్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా మొదటిసారిగా నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి 120 బెడ్లను అందించామని పేర్కొన్నారు. ‘‘పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఫౌండేషన్‌ తరపున కృషి చేస్తున్నాం. కొవిడ్‌ సమయంలో నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించారు. మున్ముందు కూడా సేవా దృక్పథంతో పనిచేసి వీలైనంత ఎక్కువ మందికి వైద్య సేవలు అందించాలి. ఆస్పత్రికి అవసరమైతే ఫౌండేషన్‌ తరపున మరిన్ని వైద్య పరికరాలను అందజేస్తామం’’ అని యువరాజ్‌ పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో వార్డులను కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రారంభించారు. యువీ కెన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యువరాజ్‌ సింగ్‌ 120 బెడ్లను అందించినందుకు జిల్లా ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ బెడ్లు రావడానికి ఎమ్మెల్సీ కవిత ఎంతగానో కృషి చేశారని, ఫౌండేషన్‌ వారిని ఆమె ఒప్పించి రూ.రెండున్నర కోట్లకు పైనే వ్యయంతో కూడుకున్న బెడ్లను నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి వచ్చేలా చూశారని కలెక్టర్‌ తెలిపారు. యువీ కెన్‌ ఫౌండేషన్‌ తరఫున 120 ఐసీయూ పడకలను ఏర్పాటు చేసిన యువరాజ్‌ సింగ్‌ను రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ.. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అభినందించారు. యువరాజ్‌ సింగ్‌ పెద్ద మనసుతో రెండున్నర కోట్ల రూపాయలను నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి వెచ్చించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు, యువరాజ్‌ సింగ్‌ తల్లి షబ్నం సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని మెరుగైన సేవలు: 

యువీ కెన్‌ ఫౌండేషన్‌ ద్వారా 120 ఐసీయూ బెడ్ల ఏర్పాటు చేయడం వల్ల నిజామాబాద్‌ ప్రాంత వాసులకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయి. కరోనాతో పాటు క్రిటికల్‌ కేర్‌కూ ఈ బెడ్లు ఉపయోగపడతాయి. ఫౌండేషన్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన 18 వెంటిలేటర్లను పెద్దలతో పాటు పిల్లలకూ ఉపయోగిస్తాం.

- డాక్టర్‌ ప్రతిమారాజ్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Updated Date - 2021-07-29T09:05:07+05:30 IST