గుండెపోటుతో మరణించిన యువ క్రికెటర్

ABN , First Publish Date - 2021-10-16T23:43:18+05:30 IST

టీమిండియా అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ అవి బరోత్ మృతి చెందాడు. హర్యానా, గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించిన 29

గుండెపోటుతో మరణించిన యువ క్రికెటర్

న్యూఢిల్లీ: టీమిండియా అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ అవి బరోత్ మృతి చెందాడు. హర్యానా, గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించిన 29 ఏళ్ల బరోత్ నిన్న గుండెపోటుతో మృతి చెందినట్టు సౌరాష్ట్ర  క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సీఏ) వెల్లడించింది. అతడి మృతి వార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బరోత్ మృతి ఎస్‌సీఏకు తీరని లోటని విచారం వ్యక్తం చేసింది. 2019-20 సీజన్‌లో సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీని గెలుచుకున్న జట్టులో బరోత్ సభ్యుడు.   


 కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్, ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన అవి బరోత్ 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 38 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 20 దేశవాళీ మ్యాచ్‌లు ఆడాడు. వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ అయిన అవి ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 1,547 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ మ్యాచ్‌లలో 1030, టీ20లలో 717 పరుగులు చేశాడు. సౌరాష్ట్ర తరపున 21 రంజీ ట్రోఫీలు, 17 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 11 దేశవాళీ టీ20 గేమ్స్ ఆడాడు. 2011లో ఇండియా అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 122 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 


Updated Date - 2021-10-16T23:43:18+05:30 IST