ప్రతీ స్కీమ్‌లో ఓ స్కామ్‌

ABN , First Publish Date - 2020-07-06T09:43:56+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిస్కీమ్‌లో ఒక స్కామ్‌ ..

ప్రతీ స్కీమ్‌లో ఓ స్కామ్‌

మాజీ మంత్రి ఆనందబాబు


వినుకొండ, జూలై 5: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిస్కీమ్‌లో ఒక స్కామ్‌ ఉందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. పేదల ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు పట్టణ పరిధిలో ఇవ్వాలని కోరుతూ ఆదివారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆందజేయులు చేపట్టిన 12గంటల దీక్షకు ఆనందబాబు సంఘీభావం తెలిపారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్ల స్థలాలు, 108, 104 అంబులెన్స్‌లు, ఇసుక, మద్యం ఇలా ప్రతి ఒక్కదానిలో భారీ అవినీతి చోటు చేసుకుందన్నారు.


ఇళ్ల స్థలాల పేరు మీద ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్లు ఖర్చుపెడితే వీటిల్లో దాదాపు రూ.5 వేల కోట్లు వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. వినుకొండకి 7కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎమ్మెల్యేకు చెందిన భూమి రూ.4 నుంచి ఐదు లక్షల విలువ ఉంటే దానిని రూ.18 లక్షలకు ప్రభుత్వానికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అర్బన్‌ హౌసింగ్‌ రుణాలను మాఫీ చేస్తామని చెప్పి టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 16 లక్షల ఇళ్లను నిలిపివేశారన్నారు. ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బొల్లా ఇటీవల డీఆర్సీ సమావేశంలో మాట్లాడిన మాటలకు ఇక్కడ చేసే పనులకు సంబంధం లేదన్నారు.   


పట్టణ పరిధిలోనే స్థలాలు ఇవ్వాలి

వినుకొండ పట్టణ పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు పట్టణ పరిధిలోనే ఇవ్వాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. దీక్ష ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లా తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం వెంకుపాలెంలో నివాసయోగ్యం కాని భూమిని పేదల ఇళ్ల స్థలాల పేరిట వారి నెత్తిన రుద్దడం అన్యాయమన్నారు.


ఎమ్మెల్యే తన భూమిని ఎక్కువ రేటుకు అమ్ముకొని ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టడమే కాకుండా ప్రభుత్వ సొమ్ముతో మిగిలిన 200 ఎకరాల భూమిని ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి సరికొత్త రియల్‌ఎస్టేట్‌ వ్యాపారానికి శ్రీకారం చుట్టారన్నారు.  ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అమ్మినా ఘనుడు రాష్ట్రంలో ఈయన ఒక్కడే ఉన్నాడన్నారు. టీడీపీ హయాంలో 2 సెంట్ల ప్రభుత్వ భూమిని పేదలకు ఇచ్చామని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఒక సెంటు ఇవ్వడం, దానిలో అవినీతికి పాల్పడటం వీరికి పేదలపై ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవుతుందని తెలిపారు.  

Updated Date - 2020-07-06T09:43:56+05:30 IST