హుజూరాబాద్‌లో కుట్రలు, కుతంత్రాలు

ABN , First Publish Date - 2021-10-27T08:09:25+05:30 IST

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు, కుతంత్రాలు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని గూడూరు, కమలాపూర్‌ గ్రామ దళితవాడల్లో మంగళవారం ..

హుజూరాబాద్‌లో కుట్రలు, కుతంత్రాలు

  • నాపై టీఆర్‌ఎస్‌ దాడి చేస్తుందని భయంగా ఉంది: ఈటల 
  • ఉద్యమ ద్రోహులకు అడ్డాగా టీఆర్‌ఎస్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 
  • తెలంగాణలో పాలన ఆలీబాబా చాలీస్‌ చోర్‌లా ఉంది: తరుణ్‌ ఛుగ్‌
  • తెలంగాణకు మొట్టమొదటి ద్రోహి కేసీఆర్‌: సంజయ్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు, కుతంత్రాలు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని గూడూరు, కమలాపూర్‌ గ్రామ దళితవాడల్లో మంగళవారం ఆయన ప్రచారం నిర్వహించారు. కమలాపూర్‌లోని పద్మశాలివాడలో ఈటల మాట్లాడారు. మద్యం సీసాలతో, నోట్ల కట్టలతో ఓటర్లను టీఆర్‌ఎస్‌ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని విమర్శించారు. అయినా, ఈనెల 30న బీజేపీకి ఓటువేసి, తనను గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారని ఈటల అన్నారు. ఓడిపోతామనే భయంతో టీఆర్‌ఎస్‌ నేతలు తన మీద దాడి చేస్తారనే భయం తనకు ఉందని ఈటల రాజేందర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పి ఆయన అహంకారాన్ని దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. ఉద్యమ ద్రోహులు, ఉద్యమ వ్యతిరేకులకు టీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డాగా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలో ఈటల తరఫున ప్రచారం నిర్వహించాడారు. కేసీఆర్‌ కక్ష కట్టి ఈటలను, ఆయన కుటుంబాన్ని జైలుకు పంపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పుకునే ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికలో ఈటల గెలుపు ఖాయమైందని, ఆయన గెలిస్తే తెలంగాణ ప్రభుత్వం బీజేపీకి హస్తగతమవుతుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్‌ పాలన ఆలీబాబా చాలీస్‌ చోర్‌లా ఉందని అన్నారు.


హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ద్వారా కేసీఆర్‌ సర్కార్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు మొట్ట మొదటి ద్రోహి కేసీఆర్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి కుటుంబం పాలన రాజ్యమేలుతోందని, మాట్లాడాల్సిన మేధావులు బయటకు రావాల్సిన సమయం అసన్నమైందన్నారు. కొంతమంది కలెక్టర్లు అహంకారంతో మాట్లాడుతున్నారని, ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు.  కాగా, కమలాపూర్‌లో మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల సతీమణి జమున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటువేసి ఈటలను గెలిపించాలని ఆమె కోరారు.

Updated Date - 2021-10-27T08:09:25+05:30 IST