మాజీ మంత్రి ఖలీల్‌బాషా మృతి

ABN , First Publish Date - 2020-08-12T11:12:43+05:30 IST

మాజీ మంత్రి డాక్టర్‌ ఎస్‌ఏ ఖలీల్‌బాషా (73) మృతి చెందారు. ఆయన వారం రోజులుగా అనారోగ్యంతో హైదరాబాదులోని అపోలో ఆస్ప

మాజీ మంత్రి ఖలీల్‌బాషా మృతి

 వైద్య వృత్తి ద్వారా ప్రజలతో మమేకం


కడప (సిటి), ఆగస్టు 11 : మాజీ మంత్రి డాక్టర్‌ ఎస్‌ఏ ఖలీల్‌బాషా (73) మృతి చెందారు. ఆయన వారం రోజులుగా అనారోగ్యంతో హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఆయనకు భార్య హస్మితా తారాబేగం, కుమారులు డాక్టర్‌ సొహైల్‌, సుజాత్‌ అహ్మద్‌, తౌహిబ్‌ అహ్మద్‌ ఉన్నారు.  ఖలీల్‌బాషా కడప నగరంలో పేదలకు అందుబాటులో ఉండే డాక్టరుగా పేరు పొందారు. ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకున్న ఎన్టీ రామారావు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కడప అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు.


అనంతరం 1999లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన కడప నుంచి టీడీపీ అభ్యర్థిగా రెండోసారి విజయం సాధించి చంద్రబాబు క్యాబినెట్‌లో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా 2004 ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్‌ దక్కలేదు. కాగా 2009లో ప్రజారాజ్యంలో చేరి ఆ పార్టీ తరపున కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమి చెందారు. కొద్దికాలానికి టీడీపీకి దగ్గరై 2014లో టికెట్‌ ఆశించినా పొత్తులో భాగంగా కడప అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతున్నారు. 


ఖలీల్‌బాషా మృతి తీరని లోటు

మాజీ మంత్రి ఖలీల్‌బాషా మృతి జిల్లాకు తీరని లోటు అని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, బి.హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. ఆయన వైద్యవృత్తి ద్వారా పేదలకు ఎంతో సేవ చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. అందరితో కలిసి మెలిసి ఉండే ఆయన అకాల మృతి చెందడం బాధాకరమన్నారు. 

Updated Date - 2020-08-12T11:12:43+05:30 IST