మిర్చిని మింగిన తామర పురుగు

ABN , First Publish Date - 2022-01-21T04:18:37+05:30 IST

నిన్న మొన్నటి దాకా కొత్త చిగుళ్లు తొడిగిన మిర్చి పంటను తామర పురుగు గుల్లచేసింది. కళ్లముందే నాశమైన పంటను చూసిన ఆ రైతు గుండె చెదిరింది.

మిర్చిని మింగిన తామర పురుగు
బాలాజీ మృతదేహం

పంట చేతికిరాక.. కూతురి పెళ్లి చేయలేక

అప్పులు తీర్చే దారి లేక..  రైతు ఆత్మహత్య

భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో విషాదం

గుండాల, జనవరి 20: నిన్న మొన్నటి దాకా కొత్త చిగుళ్లు తొడిగిన మిర్చి పంటను తామర పురుగు గుల్లచేసింది. కళ్లముందే నాశమైన పంటను చూసిన ఆ రైతు గుండె చెదిరింది. పంట దిగుబడి రాకపోతే తాను పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి? కూతురు పెళ్లి ఎలా చేయాలోనని బెంగ పెట్టుకున్నాడు. మనోధైర్యం కోల్పోయి పొలం వద్దే పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన గుండాల మండలంం నర్సాపురం తండాలో జరిగింది. నర్సాపురం తండాకు చెందిన భూక్య బాలాజీ (40)కి వారసత్వంగా ఐదెకరాల భూమి సంక్రమించింది. 15 సంవత్సరాల క్రితం నర్సాపురం కొత్తచెరువు మత్తడి ఎత్తు పెంచడంతో నాలుగు ఎకరాల భూమి అందులో మునిగిపోయింది. దీంతో ఇతర రైతుల దగ్గర కూలి పనులు చేసుకుంటూ మిగిలిన ఎకరం భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ ఎకరంలో ఈ ఏడాది మిర్చి వేయగా.. దానికి తొలుత తామరపురుగు, ఆతర్వాత ఇటీవల పడిన వర్షాలకు కుళ్లుతెగులు ఆశించడంతో పంట మొత్తం దెబ్బతిన్నది. చివరకు పంటపై రూపాయి కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటికే పంటకు పెట్టుబడి కోసం సుమారు రూ.70వేలు వెచ్చించాడు. అయితే గతంలో రూ.3 లక్షలు అప్పులు ఉం డటంతో కొత్తగా అప్పు పుట్టలేదు. ఇదే సమయంలో గత నెలలో తన కూతురికి వివాహం చేసేందుకు దగ్గర బంధువులతో సంబంధం కుదుర్చుకునేందుకు ప్ర యత్నించగా.. వారు అడిగిన కట్న కానుకలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. వీటితో తీవ్ర మనోవేదనలో ఉంటున్న బాలాజీ ఈ నెల 15న మిర్చితోట వద్దకు వెళ్లి అక్కడి గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఇంటి నుంచి వెళ్లిన భర్త సాయంత్రానికి కూడా తిరిగి రాకపోవడంతో వెంటనే అనుమానం వచ్చి తోట వద్దకు వెళ్లి చూడగా బాలాజీ అపస్మారక స్థితిలో పడిఉండటంతో కుటుంబ సభ్యులు గుండాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ములుగు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో గ్రామస్థులు చందాలు వేసుకొని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయిస్తుండగా.. గురువారం ఉదయం మృతి చెందాడు. భూమి కోల్పోయి ఎకరంతో జీవన పోరాటం చేసిన ఆ నిరుపేద కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. బాలాజీకి భార్య బుల్లి, కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే ఉన్న ఎకరం భూమి భార్య బుల్లి పేరిట ఉండటంతో రైతు బీమా అందే పరిస్థితి కన్పించడం లేదు. ప్రభుత్వమే రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరు తున్నారు. ఈ ఘటనపై గుండాల ఎస్‌ఐ ధారం సురేష్‌ కేసు నమోదు చేసుకున్నారు.  

Updated Date - 2022-01-21T04:18:37+05:30 IST