రెండో దశపై కేంద్రం నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-05-08T08:53:43+05:30 IST

కరోనా రెండో ప్రభంజనం వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసి, దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధం కాలేదని.. అందుకే పరిస్థితి ఇంత దారుణంగా మారిందని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కె.సుజాతారావు అన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రస్తుత విధానంలోనే కొనసాగితే..

రెండో దశపై కేంద్రం నిర్లక్ష్యం

ఇంత తీవ్రతను అంచనా వేస్తే కదా!

మౌలిక సదుపాయాలపై దృష్టి సారించలేదు

ఇప్పుడు ఆక్సిజన్‌, మందుల కొరతకు కారణమిదే

అందుకే దేశంలో ఇప్పుడు ఇంత దారుణ పరిస్థితి

అన్నిటినీ తెరిచారు.. జనం స్వేచ్ఛగా తిరిగేలా చేశారు

ఇది ఘోరమైన, తప్పుడు అంచనా 

జాతీయ టీకా విధానం రూపొందించి ఉండాల్సింది

రాత్రిపూట కర్ఫ్యూలతో ఉపయోగం లేదు

వైర్‌సకు హద్దుల్లేవు.. లాక్‌డౌన్‌ తప్పనిసరి

‘ఆంధ్రజ్యోతి’తో కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కె. సుజాతారావు


న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): కరోనా రెండో ప్రభంజనం వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసి, దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధం కాలేదని.. అందుకే పరిస్థితి ఇంత దారుణంగా మారిందని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కె.సుజాతారావు అన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రస్తుత విధానంలోనే కొనసాగితే.. దేశ ప్రజలందరికీ ఎప్పటికి టీకాలు అందుతాయో చెప్పలేమని ఆందోళన వెలిబుచ్చారు. వ్యాక్సిన్ల కోసం ముందే కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుని.. టీకా ఉత్పత్తికి చర్యలు తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉచిత వ్యాక్సినేషన్‌ చేస్తుంటే.. మన దగ్గర ఎందుకు చేయట్లేదని, టీకాల సేకరణ బాధ్యతను కేంద్రం రాష్ట్రాలకు ఎందుకు వదిలేసిందని ప్రశ్నించారు. పేద రాష్ట్రాలపై భారం వేయడం సమంజసమేనా అని నిలదీశారు. కేంద్రమే వ్యాక్సిన్‌ను ప్రజలకు ఉచితంగా అందించాలని ఆమె అభిప్రాయపడ్డారు.


దాదాపు రెండు దశాబ్దాలుగా ఆరోగ్య రంగంలో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో, కేంద్రంలో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా వ్యవహరించిన సుజాతారావు.. ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో సీనియర్‌ లీడర్‌ షిప్‌ ఫెలోగా ఉన్నారు. కేంద్ర నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, నదుల అనుసంధాన నిపుణుడు కె.ఎల్‌ రావు కుమార్తె అయిన సుజాతారావు.. దేశంలో కరోనా ప్రస్తుత పరిస్థితి, వ్యాక్సినేషన్‌ తీరుతెన్నుల గురించి ‘ఆంధ్రజ్యోతి’ ఢిల్లీ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. అందులో ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..


పట్టించుకోలేదు..

దేశంలో కరోనా రెండో ప్రభంజనం వీస్తుందని శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని సీరియ్‌సగా పట్టించుకున్నట్లు కనపడట్లేదు. ఈ సమాచారం సరైంది కాదని అధికారులు అనుకున్నారా లేక ప్రధానికి చెప్పేందుకు భయపడ్డారా అన్నది చెప్పలేము. ఎందుకంటే ఆ సమయంలో అందరూ రాష్ట్రాల ఎన్నికల్లో తలమునకలై ఉన్నారు. అధికారులు చెప్పినా ఇంతటి ఉధృతిని ఊహించలేకపోవడంతో యంత్రాంగం సంసిద్ధంగా లేదు. ఈ నిర్లక్ష్యం ప్రజల కష్టాలకు, దారుణ వేదనకు కారణమైందనడంలో సందేహం లేదు. 


తప్పుడు అంచనా..

దేశంలో రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చి అత్యవసర ఉత్పత్తికి అధికార ముద్ర వేశారు. తొలిదశలో భాగంగా జనవరిలోఆరోగ్య సంరక్షణ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. మలిదశల్లో ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు, ఇతర జబ్బులున్న 45ఏళ్లు పైబడిన వారికి టీకాఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కరోనా తొలి ప్రభంజనంలో 90 శాతం మరణాలు ఎక్కువగా ఈ వర్గాల్లోనే నమోదైనందున ఆ రకమైన ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. అలాంటివారు 30 కోట్ల మంది ఉన్నారు. కానీ ఆ సమయంలో భారత ప్రభుత్వం 20 కోట్ల డోసులకే ఆర్డర్లు ఇచ్చింది. అంటే కరోనా మహమ్మారి పోయిందని  విశ్వసించింది. అన్నిటినీ తె రిచి, జనం స్వేచ్చగా తిరిగేందుకు అనుమతించారు.


ఇది ఘోరమైన, తప్పుడు అంచనా. మనం యుద్ధ ప్రాతిపదికన డజనుసంస్థలనైనా ప్రోత్సహించి వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచి ఉండాల్సింది. ముందుగా కొనుగోలు ఒప్పందాలు ఏర్పర్చుకుని జాతీయ వ్యాక్సినేషన్‌ ప్రణాళికను రూపొందించి ఉండాల్సింది. దేశంలో ఉన్న అపారమైన డిమాండ్‌కు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి బదులు మనం కేవలం రెండు కంపెనీలపై దృష్టి సారించాం. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం మౌలికసదుపాయాలను పెద్ద ఎత్తున పెంచడం కానీ, ప్రజలను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం కానీ చేసి ఉండాల్సింది. దానికి బదులు తీవ్రమైన అలసత్వం, ఉదాసీనతతో వ్యవహరించింది. ఇక.. ప్రయోగాలు పూర్తికాకుండానే కంపెనీలకు అత్యవసర అనుమతి ఎందుకిచ్చారని నిపుణులు ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు. ప్రధానంగా భారత్‌ బయోటెక్‌ మూడోదశ ట్రయల్స్‌ చేయలేదని విమర్శించడంతో ప్రజల్లో టీకాపై సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు.. చైనాను అధిగమించేందుకు భారత ప్రభుత్వం టీకా దౌత్యాన్ని ప్రారంభించింది, 94 దేశాలకు 6.6 కోట్ల డోసులను మనం పంచిపెట్టాము. వీటన్నింటివల్ల టీకా కార్యక్రమం సరిగ్గా జరగలేదు. ఇక ఏప్రిల్‌ 20న కేంద్రం ఒక విచిత్రమైన విధానంతో ముందుకు వచ్చింది.


దీని ప్రకారం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్‌ పార్టీలు రకరకాల రేట్లకు వాక్సిన్‌ను కొనుక్కోవచ్చు. ఈ నిర్ణయంతో.. భారత ప్రభుత్వం తన బాధ్యతను వదులుకుని వ్యాక్సిన్‌ను సేకరించుకునే బాధ్యతను రాష్ట్రాలకు వదిలిపెట్టింది. అదే సమయంలో 18-45 మధ్య వయస్సున్న వారిని టీకాలు తీసుకునేందుకు అర్హులుగా ప్రకటించింది. ఏప్రిల్‌ 26 తర్వాతే కేంద్రం 11 కోట్ల డోసులకు మరో ఆర్డర్‌ను ఇచ్చింది. వ్యాక్సినేషన్‌ మూలంగానే మరణాలను తగ్గించగలం. అందుకే విదేశాల్లో ఉచిత వ్యాక్సినేషన్‌ అమలు చేస్తున్నారు. 


అందరికీ ఇవ్వలేం

ప్రస్తుతం టీకాలను సరఫరా చేస్తున్న రెండు కంపెనీలూ.. నెలకు 8.1 కోట్ల డోసులను మాత్రమే ఉత్పత్తి చేయగలవు. జూలై నాటికి.. నెలకు 12 కోట్ల డోసులను ఉత్పత్తి చే సేలా సామర్థ్యాన్ని పెంచుకుంటామని అవి హామీ ఇచ్చాయి. అందుకు భారత ప్రభుత్వం భారీ మొత్తం అడ్వాన్సుగా కూడా చెల్లించింది. ఈ స్థాయిలో అయితే మనం ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ ఇవ్వడం సాధ్యం కాదు. దేశంలో ఆక్సిజన్‌ పడకలు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడం అనేక మరణాలకు దారితీస్తున్న మాట వాస్తవమే. దీన్ని నివారించే కార్యాచరణ ప్రణాళిక కూడా లేదు. రెండో ప్రభంజనం ఇంత తీవ్రంగా ఉంటుందని ఎన్నడైనా అంచనా వేస్తే కదా వీటన్నిటిపై దృష్టి సారించేది?


ఎలా బయటపడతాం

ఈ ముప్పు నుంచి బయటపడడానికి ప్రజల్లో క్రమశిక్షణ అవసరం. అందరూ మాస్కులు ధరించేలా చూడాలి. జనం గుమిగూడేందుకు అనుమతించకూడదు, ఒక వివేకవంతమైన విధానాన్ని పాటించి వ్యాక్సినేషన్‌ను అమలు చేయాలి. మరణాల రేటు తగ్గించడం అత్యంత ముఖ్యం. ప్రజలు అత్యంత భయోత్పాతానికి గురయ్యారు. నాయకులు ఇప్పుడు ప్రజలకు కనపడాలి. బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడాలి. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడం తప్పనిసరి. రాత్రి కర్ఫ్యూ విధించడం వల్ల ఒరిగేదేమీ లేదు. అది పనికిమాలినది. వైర్‌సకు సరిహద్దుల్లేవు. అది ఎప్పుడైనా వ్యాపిస్తుంది. కనుక ప్రభుత్వం తన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి, తన శక్తియుక్తులను, వనరులను ఉపయోగించి వాక్సిన్‌ను సేకరించి అవసరమైన ప్రజలకు ఉచితంగా అందించాలి. భయకంపితులైన ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు ప్రభుత్వం చేయగలిగిన పని ఇదే.

Updated Date - 2021-05-08T08:53:43+05:30 IST