ఆ రోజు ధోనీని తిట్టడం తప్పే..

ABN , First Publish Date - 2020-04-06T09:31:16+05:30 IST

భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఎంఎస్‌ ధోనీ కచ్చితంగా ముందుంటాడు. జట్టుకు రెండు ప్రపంచక్‌పలు అందించిన నాయకుడు అతను. కానీ ...

ఆ రోజు ధోనీని తిట్టడం తప్పే..

నెహ్రా పశ్చాత్తాపం

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఎంఎస్‌ ధోనీ కచ్చితంగా ముందుంటాడు. జట్టుకు రెండు ప్రపంచక్‌పలు అందించిన నాయకుడు అతను. కానీ జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో అతడూ అందరిలాంటి ఆటగాడే.. వచ్చీ రావడంతోనే బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌ కీపర్‌గా ధోనీ అద్భుతాలేమీ సృష్టించలేదు. ఈక్రమంలో అతను పలు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. టీమిండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా నుంచి కూడా తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడడంతో పాటు తిట్లు కూడా తినాల్సి వచ్చింది. పాక్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో క్యాచ్‌ మిస్‌ చేసినందుకు నెహ్రా అతడిని కోపగించుకునే వీడియో ఒకటి యూట్యూబ్‌లో ఎక్కువగా చక్కర్లు కొడుతుంటుంది. అయితే ఆ సంఘటనను నెహ్రానే స్వయంగా పంచుకోవడంతో పాటు అప్పటి ప్రవర్తనపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ధోనీ అరంగేట్రం చేసిన ఏడాదికి 2005లో పాకిస్థాన్‌ జట్టు భారత్‌ పర్యటనకు వచ్చింది. అహ్మదాబాద్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో నాలుగో ఓవర్‌ను నెహ్రా వేయగా క్రీజులో అఫ్రీది ఉన్నాడు. ఆఫ్‌ స్టంప్‌ ఆవల వేసిన బంతిని అతడు స్లిప్‌లో ఆడగా ధోనీ, ద్రావిడ్‌ మధ్యలో నుంచి వెళ్లింది. ఎవరూ క్యాచ్‌ పట్టుకోలేదు. అంతే కోపాన్ని నియంత్రించుకోలేని నెహ్రా.. ధోనీని దూషించడంతో పాటు ద్రావిడ్‌పైనా విసుక్కున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని నెహ్రా పంచుకున్నాడు. ‘చాలా మంది ఆ వీడియో విశాఖపట్నం మ్యాచ్‌ది అనుకుంటారు. కానీ అహ్మదాబాద్‌లో నాలుగో వన్డే అది. పాక్‌తో మ్యాచ్‌ అనగానే ఉండే ఒత్తిడికి తోడు అఫ్రీది అప్పటికే సిక్సర్‌ బాదాడు. ఆ తర్వాత బంతికే వచ్చిన అవకాశాన్ని మిస్‌ చేయడం కోపాన్ని తెప్పించింది. ఆరోజు నేను అలా చేయడం తప్పే. మ్యాచ్‌ తర్వాత ధోనీ, ద్రావిడ్‌ నాతో బాగానే ఉన్నారు’ అని నెహ్రా తెలిపాడు.


టెస్టు ఆడమని చెప్పినా..

కెరీర్‌లో ఎక్కువగా గాయాలతో సహవాసం చేసిన నెహ్రా 19 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించాడు. అయితే 2011 నుంచి 2016 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోయినా ఆ తర్వాత ఏడాది పాటు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కీలక పేసర్‌గా సత్తా చాటాడు. చివరి టెస్టును 2004లో ఆడాడు. ఆ తర్వాత అతడికి చాన్స్‌ రాలేదని అంతా అనుకున్నారు. కానీ ధోనీ మాత్రం అతడిని టెస్టు మ్యాచ్‌ ఆడాలని కోరినా సున్నితంగా తిరస్కరించాడట. ‘2005-2009లో కూడా నాకు గ్యాప్‌ వచ్చింది. ఆ సమయంలో భారత క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. నా పునరాగమనంలో  కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు. అప్పట్లో మా ఇద్దరికీ పెద్దగా మాటలు లేవు. 2009లో అతను టెస్టు ఆఫర్‌ ఇచ్చినా నేను అంగీకరించలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఆ నిర్ణయంపై పశ్చాత్తాప పడాల్సి వస్తోంది’ అని నెహ్రా నాటి సంగతిని గుర్తుచేసుకున్నాడు. 

Updated Date - 2020-04-06T09:31:16+05:30 IST