సునీల్‌ జోషికి సెలెక్షన్‌ పగ్గాలు

ABN , First Publish Date - 2020-03-05T09:56:20+05:30 IST

టీమిండియా మాజీ స్పిన్నర్‌, కర్ణాటకకు చెందిన సునీల్‌ బండాచార్య జోషి.. జాతీయ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. ఐదుగురు సభ్యుల సెలెక్షన్‌

సునీల్‌ జోషికి సెలెక్షన్‌ పగ్గాలు

భారత క్రికెట్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా టీమిండియా మాజీ ఆటగాడు సునీల్‌ జోషి ఎంపికయ్యాడు. ఎమ్మెస్కే ప్రసాద్‌ స్థానాన్ని జోషి భర్తీ చేయనున్నాడు. సెలెక్టర్‌గా గగన్‌ ఖోడా స్థానంలో హర్విందర్‌ను ఎంపిక చేశారు. దీంతో శివరామకృష్ణన్‌, వెంకటేష్‌ ప్రసాద్‌, రాజేష్‌ చౌహాన్‌కు నిరాశే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీ్‌సలో పాల్గొనే భారత జట్టును జోషి ప్యానెల్‌ ఎంపిక చేయనుంది. 


సెలెక్టర్‌గా హర్విందర్‌ 

 ఎంపిక చేసిన సీఏసీ


ముంబై: టీమిండియా మాజీ స్పిన్నర్‌, కర్ణాటకకు చెందిన సునీల్‌ బండాచార్య జోషి.. జాతీయ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. ఐదుగురు సభ్యుల సెలెక్షన్‌ ప్యానెల్‌లో మాజీ పేసర్‌ హర్విందర్‌ సింగ్‌కు కూడా చోటుదక్కింది. సెలెక్షన్‌ ప్యానెల్‌లో ఖాళీ అయిన రెండు స్థానాల భర్తీ కోసం బుధవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో మదన్‌లాల్‌, ఆర్పీ సింగ్‌, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) వీరిద్దరిని ఎంపిక చేసింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ (సౌత్‌ జోన్‌) స్థానాన్ని జోషి భర్తీ చేయనున్నాడు. చైర్మన్‌గా జోషిని కమిటీ సిఫారసు చేసిందని బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది తర్వాత సెలెక్షన్‌ ప్యానెల్‌ పనితీరును సీఏసీ సమీక్షించి.. తగిన సూచనలు చేయనుంది. సెంట్రల్‌ జోన్‌ నుంచి ఎంపికైన హర్విందర్‌.. ప్యానెల్‌లో గగన్‌ ఖోడా స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. జతిన్‌ పరంజపే (వెస్ట్‌), దేవంగ్‌ గాంధీ (ఈస్ట్‌), శరణ్‌దీప్‌ సింగ్‌ (నార్త్‌) పదవీ కాలం పూర్తయ్యే వరకు కొనసాగనున్నారు. సెలెక్టర్ల కోసం మొత్తం 40 దరఖాస్తులు అందగా.. ఇంటర్వ్యూ కోసం ఐదుగురు.. సునీల్‌ జోషి, హర్విందర్‌ సింగ్‌, వెంకటేష్‌ ప్రసాద్‌, రాజేష్‌ చౌహాన్‌, లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. అజిత్‌ అగార్కర్‌, నయన్‌ మోంగియా కూడా దరఖాస్తు చేసినా పక్కనబెట్టారు. మిగిలిన సెలెక్టర్ల పదవీ కాలం సెప్టెంబరుతో ముగియనుండడంతో అప్పుడు వీరిని పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది. సెలెక్టర్ల ఎంపికలో బీసీసీఐ జోన్‌ పాలసీకి స్పష్టంగా కట్టుబడింది. ప్రసాద్‌, ఖోడాలు 2015లో సెలెక్టర్లుగా ఎంపికయ్యారు. గత నవంబరులో వారి పదవీ కాలాన్ని పొడిగించారు. 49 ఏళ్ల సునీల్‌ జోషి 1996-2001 మధ్య 15 టెస్ట్‌లు, 69 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. 42 ఏళ్ల హర్విందర్‌ 1998-2001 మధ్య 3 టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడాడు.


ఆలోచనల్లో స్పష్టత ఉంది: సీఏసీ హెడ్‌ మదన్‌లాల్‌

అత్యుత్తమ వ్యక్తులనే ఎంపిక చేశాం. వారి ఆలోచనల్లో స్పష్టత ఉంది. ముక్కుసూటిగా వ్యవహరించే జోషి తత్వం మాకు నచ్చింది. మూడు ఫార్మాట్లలో అతడి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. ఎంపికలో బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. ఎటువంటి సూచనలూ చేయలేదు. 

Updated Date - 2020-03-05T09:56:20+05:30 IST