రైతుకు ఆగ్రహం వస్తే అధికార
పార్టీ సర్వనాశనమే: శరద్ పవార్
ముంబై, జనవరి 25: సాగు చట్టాలతో రైతుల్లో తీవ్రమైన అభద్రతా భావాన్ని కేంద్రం నింపిందని ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ వ్యవసాయమంత్రి శరద్ పవార్ విమర్శించారు. ‘‘రాజ్యాంగాన్ని కాలరాసి ఎలాంటి చట్టాలైనా చేయవచ్చు. కానీ రైతు లు, సామాన్యులకు ఆగ్రహం వస్తే, వారు ఉద్యమి స్తే మీ పతనం తప్పదు. చేసిన చట్టాలను మీరు వెనక్కి తీసుకున్నా తీసుకోకపోయినా ఆ చట్టాలను, అదే క్రమంలో అధికార పార్టీని సర్వనాశనం చేసే దాకా విశ్రమించరు’’ అని హెచ్చరించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా ముంబైలో వేలాది మంది రైతులు సోమవారంనాడు ఆజాద్ మైదాన్‌లో ధర్నా చేశారు. అనంతరం జరిగిన సభలో కేంద్రం తీరును పవార్ తీవ్రంగా నిరసించారు.
ఇదంతా డ్రామా : ఫడణవీస్
రైతుల ఆందోళనను అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పక్షాలు డ్రామాలాడుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ విమర్శించారు. ముంబైలో జరిగిన రైతుల ధర్నా ఓ పబ్లిసిటీ స్టంట్ అని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అధవలే అన్నారు.