అన్నదాతల అరిగోస

ABN , First Publish Date - 2020-11-23T05:10:58+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడంలో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అధిక వర్షాలకు తెగుళ్లు సోకడం, దిగుబడులు తగ్గిపోవడం, ధర కూడా నామమాత్రంగానే ఉండడంతో పెట్టిన పెట్టుబడులైనా వస్తాయా అని రైతులు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.

అన్నదాతల అరిగోస
కరకగూడెంలో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలు చేస్తున్న రైతులు

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కరవు

రోజుల కొద్దీ పడిగాపులు

వాతావరణంలో మార్పులతో రైతుల వెన్నులో వణుకు

కన్నెత్తి చూడని అధికారులు

 కరకగూడెం, నవంబరు 22: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడంలో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అధిక వర్షాలకు తెగుళ్లు సోకడం, దిగుబడులు తగ్గిపోవడం, ధర కూడా నామమాత్రంగానే ఉండడంతో పెట్టిన పెట్టుబడులైనా వస్తాయా అని రైతులు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ‘ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుంది. దళారులను నమ్మి మోసపోవదు. రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని’ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతు న్నారు. కానీ క్షేత్రస్థాయిలో అవేవీ ఆచరణకు నోచుకోవడం లేదు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా నామమాత్రంగానే ఉన్నాయని రైతులు ఆరోపిసున్నారు. మండలంలోని జీసీసీ పీఏసీఎస్‌ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. విద్యుత్‌ కోతల కారణంగా ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు పనిచేయడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో కల్లాల్లో ధాన్యం నిలిచిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. వేళాపాలా లేకుండా విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో ధాన్యాన్ని తూర్పార పట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో వైపు మబ్బులు క మ్ముకుంటుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ సూచనతో..

వానాకాలంలో సన్నరకాలు మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం సూచించింది. వ్యవసాయ అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. రైతులూ కూడా సన్నరకాలనే విస్తారంగా సాగు చేశారు. ఈఏడు మెండుగా వర్షాలు కురవడంతో జిల్లాలో రికార్డు స్థాయిలో వరి సాగయింది. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉంది. పంట ఏపుగా పెరుగుతుండటంతో రైతులు కూడా సంతోషపడ్డారు. కానీ సెప్టెంబరు నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల పినపాక, భద్రాచలం నియోజ కవర్గాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట తుడిచి పెట్టుకుపోయింది. ఉన్న ఆ కాస్త పంటన్నా ఆదుకుంటుందని ఆనుకుం టుండగా పులిమీద పుట్రలా తెగుళ్లు వరిపై ముప్పేట దాడి చేశాయి. దోమ, పేనుబంక ఆశించడంతో దిగుబడి తగ్గింది.

రికార్డుస్థాయిలో వరి సాగు

జిల్లాలో 1,66,630 ఎకరాల్లో రైతులు వరి పంటను రైతులు సాగు చేశారు. ఇందులో నియోజకవర్గంలోని మణుగూరు డివిజన్‌లో రైతులు 55,727 ఎకరాలలో వరి పంటను సాగు చేశారు. ఇందులో 50 శాతం రైతులు సన్నరకాలే సాగు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం సూచించకముందు జిల్లాలో సన్న రకాల సాగు శాతం పదికి లోపే ఉండేది. నియోజ కవర్గంలో అశ్వాపురం తుమ్మల చెరువు, కరకగూడెం పెదవాగు పరివాహకం, పినపాకలో గోదావరి పరివా హకంలో మాత్రమే సన్న రకాలే సాగయ్యేవి. మిగతా ప్రాం తాల్లో దొడ్డు రకం వరి సాగయ్యేది. ప్రభుత్వం సూచించిన తర్వాత రైతులు సన్నరకాలు సాగు చేశారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో భూములన్నీ చౌడు రకానికి చెందినవి. వీటిల్లో ఇప్పటికీ చౌడు అధికంగా ఉంది. రైతు లకు తెలియక, అధికారులు అవగాహన కల్పించ పోవ డంతో అందులోనే వరి సాగు చేస్తున్నారు. వాటిట్లో దొడ్డు రకాలు మాత్రం ఒక మోస్తరు దిగుబడిని ఇస్తున్నాయి. కా నీ సర్కారు సన్నాలు సాగు చేయాలని చెప్పడంతో నిండా మునిగారు.

భారీ వర్షాలతో పంటకు నష్టం

ఈఏడు సన్నరకాలు సాగుచేయడం, విస్తారంగా వర్షాలు కురవడంతో పంటలో ఎదుగుదల నిలిచిపోయింది. తెగుళ్లు కూడా ముప్పేట దాడి చేశాయి. రైతులు పురుగుల మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్క కరకగూడెంనే ఒక్కో ఎకరా నికి పురుగులమందుల పిచికారీకి రైతులు రూ. పది నుంచి రూ. ఇరవై వేల వరకు ఖర్చు చేశారంటే పరి స్థితిని అర్థం చేసుకోవచ్చు. 

Updated Date - 2020-11-23T05:10:58+05:30 IST