కోర్టును మోసం చేసిన కేసులో నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2021-03-03T06:38:17+05:30 IST

నకిలీ డాక్యుమెంట్లతో కోర్టును మోసం చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ రవినాయక్‌ తెలిపారు.

కోర్టును మోసం చేసిన కేసులో నలుగురి అరెస్టు

భాకరాపేట, మార్చి 2: నకిలీ డాక్యుమెంట్లతో కోర్టును మోసం చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ రవినాయక్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిప టి.చట్టేవారిపాళెం రెవెన్యూ గ్రామం లెక్క దాఖలు సర్వే నెంబరు 1433/1లోని అసెన్డ్‌మెంటు భూమిలో 1.72 ఎకరాలకు 1997లో చిట్టెమ్మకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఇటీవల భాకరాపేటకు చెందిన సుబ్బరామిరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, యోగనాథరెడ్డి, రెడ్డిసుబ్రహ్మణ్యం తమ అనుచరులతో వచ్చి ఆ భూమిని విక్రయించాలని కోరారు. అనంతరం ఆ భూమిలో అక్రమంగా ప్రవేశించి మామిడి చెట్లు తొలగించారు. అంతటితో ఆగకుండా నరసమ్మ అనే మహిళ పేరుపై ఈ భూమికి నకిలీ పాసుపుస్తకం తయారు చేయించారు. ఈ పుస్తకం ఆధారంగా పీలేరు అదనపు సివిల్‌ జడ్జి కోర్టులో ఇంజెక్షన్‌ తీసుకొచ్చారు. దాంతో చిట్టెమ్మ వెంటనే చిన్నగొట్టిగల్లు రెవెన్యూ అఽధికారులను సంప్రదించి.. సమాచార హక్కు చట్టం కింద తన భూమికి సంబంధించిన వివరాలు కోరారు. తమ రికార్డుల్లో చిట్టెమ్మ పేరుపైనే భూమి ఉందని తెలపడంతో బాధితురాలు భాకరాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టడంతో నకిలీ పాసుపుస్తకం తయారీ, చెట్లను తొలగించడం అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సుబ్బరామిరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, యోగనాథరెడ్డి, రెడ్డిసుబ్రహ్మణ్యంలను అరెస్టు చేసి, పీలేరు కోర్టుకు తరలించామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Updated Date - 2021-03-03T06:38:17+05:30 IST