Abn logo
May 14 2021 @ 01:24AM

రెప్పపాటులో ఘోరం

  • నిద్రమత్తులో టిప్పర్‌ లారీని ఢీకొన్న కారు డ్రైవర్‌
  • శంకుస్థాపనకు వెళ్తుండగా ప్రమాదం
  • పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఘటన
  • రెండు కుటుంబాలకు చెందిన నలుగురి మృతి
  • మృతుల్లో ఐదు నెలల చిన్నారి
  • డ్రైవర్‌ సహా ఐదుగురికి తీవ్ర గాయాలు
  • ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వాహనం

పెద్దాపురం/తాళ్లరేవు/కరప/జీజీహెచ (కాకినాడ), మే 13: శుభకార్యానికి బయల్దేరిన వారు గమ్యానికి చేరకముందే అనంతలోకాలకు చేరిపోయారు. తెల్లవారుజామున సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళ్తున్న వారిని మృత్యువు కబళించింది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. వివరాలు ఇలా వున్నాయి... తాళ్లరేవుకు చెందిన మాతా కృష్ణ-లక్ష్మి దంపతులు కరప మండలం పెనుగుదురులో నివాసముంటున్నారు. వారి కుమారుడు శ్రీనివాసవర్మ రాజమహేంద్రవరంలో మైనింగ్‌ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడు దివాన్‌చెరువు సమీపంలో గృహ నిర్మాణం చేపట్టడానికి గురువారం శంకుస్థాపన ముహూర్తం పెట్టుకున్నాడు. ఈ శుభకార్యానికి పెనుగుదురులో ఉన్న తల్లిదండ్రులు కృష్ణ, లక్ష్మి, భార్య రామలక్ష్మి, కుమార్తె (5నెలలు), కాజులూరు మండలం గొల్లపాలేనికి చెందిన అక్క వనమాడి అరుణ (32), బావ ఈశ్వరరావు (36), తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలోని పెదవలసలకు చెందిన మామ అరదాడి స్వామి (50), అత్త బేబీ బయల్దేరారు. కరప మండలం పాతర్లగడ్డ గ్రామానికి చెందిన గ్రామ వలంటీర్‌ వింత జ్యోతికుమార్‌ (కారు డ్రైవర్‌) వీరందరినీ రాజమహేంద్రవరం తీసుకెళ్తున్నాడు. తెల్లవారుజామున 4.30-5 గంటల మధ్య పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని రుచి సోయా పరిశ్రమ సమీపంలోకి వచ్చేసరికి కారు డ్రైవరు నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ లారీని బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. నలుగురు ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందారు. క్రేన్‌, గడ్డపారలతో పోలీసులు, స్థానికులు సుమారు గంటకు పైగా శ్రమించి అతి కష్టం మీద మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు లాగారు. అరుణ, ఈశ్వరరావు, స్వామి, ఐదు నెలల చిన్నారి మృత్యువాతపడ్డారు. బేబీ, రామలక్ష్మి, కృష్ణ, లక్ష్మి,  జ్యోతికుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రాథమిక చికిత్స నిమిత్తం పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలిసిన వెంటనే సీఐ జయకుమార్‌, ఎస్‌ఐ ఎ.బాలాజీ సంఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. 

కాగా ఈ ఘటనతో తాళ్లరేవు మండలం పెదవలసల, కరప మండలం పెనుగుదురు, కాజులూరు మండలం గొల్లపాలెంల్లో విషాదఛాయలు అలముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు.  ఈశ్వరరావు, అరుణ మృతితో వారి కుమారుడు అవినాష్‌,  కుమార్తె దేవిప్రియ అనాధలయ్యారు.

Advertisement