నాలుగు నెలలు ముహూర్తాల్లేవ్‌

ABN , First Publish Date - 2021-01-09T05:30:00+05:30 IST

కరోనా కారణంగా గత ఏడాది వివాహాలు తగ్గాయి. ఇప్పుడిప్పుడే కొవిడ్‌ ప్రభావం తగ్గడం, వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వస్తుండటంతో వివాహాది శుభకార్యాలు నిశ్చింతగా చేసుకోవచ్చనుకున్నా మంచి ముహూర్తాలు లేవు.

నాలుగు నెలలు ముహూర్తాల్లేవ్‌

నేటితో ముగియనున్న పెళ్లిళ్ల సీజన్‌

మూడు మాసాలు వరుసగా గురు, శుక్ర మౌఢ్యమి

ఈ ఏడాది ముహూర్తాలు తక్కువే అంటున్న పండితులు

మోత్కూరు, జనవరి 9: కరోనా కారణంగా గత ఏడాది వివాహాలు తగ్గాయి. ఇప్పుడిప్పుడే కొవిడ్‌ ప్రభావం తగ్గడం, వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వస్తుండటంతో వివాహాది శుభకార్యాలు నిశ్చింతగా చేసుకోవచ్చనుకున్నా మంచి ముహూర్తాలు లేవు. ఈ ఏడాది ప్రారంభ మాసం జనవరి నుంచే వరుసగా గురు, శుక్ర మౌఢ్యమిలు రావడంతో నాలుగు మాసాలు శుభముహూర్తాలకు బ్రేక్‌ పడింది. కొన్ని పంచాంగాల ప్రకారం ఈ నెల 8 వరకే శుభముహూర్తాలు ఉండగా, మరికొన్ని పంచాంగాల్లో ఈ నెల 10తో శుభమూహూర్తాలు ఆఖరవుతున్నాయి. మళ్లీ మే 6వ తేదీ తరువాతే వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాదంతా బలమైన ముహూర్తాలు తక్కువేనని పండితులు చెబుతున్నారు. దీంతో పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నవారు నెలల తరబడి శుభముహూర్తాలు లేక నిరుత్సాహ పడుతున్నారు.

గతంలో ఒక ఏడాదిలో గురు, శుక్ర మౌఢ్యమి వచ్చినా రెండింటి మధ్య కొంత సమయం(గ్యాప్‌) ఉండేది. దీంతో శుభకార్యాలకు ముహూర్తాలు ఉండేవి. అయితే ఈ ఏడాది గురు, శుక్ర మౌఢ్యమి (మూఢాలు) ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వరకు గురు మౌఢ్యమి, ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్‌ 19వ తేదీ వరకు శుక్ర మౌఢ్యమి ఉంది. ఏప్రిల్‌ 13న ఉగాది, 21న శ్రీరామనవమి. శ్రీరామనవమి తర్వాత పెళ్లిళ్లు చేసే అవకాశం ఉన్నా మే 6 వరకు మంచి ముహూర్తాలు లేవు. మే 6న ముహూర్తం ఉన్నా బలమైన ముహూర్తాలు మే 14 తర్వాతే అంటున్నారు పండితులు. ఉన్న కొన్ని ముహూర్తాలు కూడా వధూవరుల పేర్ల మీద బలంగా ఉంటాయా లేదా అన్నది కూడా చూస్తారు. దీంతో నాలుగు మాసాలపైనే ముహూర్తాలు లేకుండాపోతున్నాయి. మూఢాల్లో వివాహాలేగాక ఉపనయనం, గృహనిర్మాణ పూజ, గృహప్రవేశాలాంటి శుభకార్యాలు చేయరు. శ్రీరామనవమి తర్వాత నుంచి ఉపనయనం, గృహనిర్మాణ పూజ, గృహప్రవేశాల్లాంటి కార్యాలకు మాత్రం ముహూర్తాలు ఉన్నాయి.


జూన్‌లో జేష్ఠ్య, జూలైలో ఆషాడ మాసాలు

వివాహాలకు మే 6 నుంచి మూహూర్తాలు ఉన్నా, జూన్‌ 11 నుంచి జేష్ఠ్య మాసం ప్రారంభమవుతుంది. జేష్ఠ్య మాసంలో జేష్ఠ్యులకు వివాహాలు చేయడానికి ఇష్టపడరు. జూలై 11 నుంచి ఆషాడ మాసం ప్రారంభమవుతుంది. ఆషాడంలో వివాహాలు ఉండవు.


ముహూర్తాలు లేకపోవడంతో ఇబ్బంది

గత ఏడాది కరోనా కారణంగా వివాహాలు జరగక ఫంక్షన్‌హాళ్లు మూత పడ్డాయి. పురోహితులు, బాజాభజంత్రీలు, పందిరి డెకరేషన్‌, వంట, క్యాటరింగ్‌, ఫొటో వీడియో గ్రాఫర్లు పనిలేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే పెళ్లిళ్లు జరుగుతూ ఉపాధి దొరుకుతుండగా, ఈ ఏడాది మూడు మాసాలు గురు, శుక్ర మౌఢ్యమి, ఆ తర్వాత జేష్ఠ్య, ఆషాడ మాసాల కారణంగా వారు ఉపాధి కోల్పోనున్నారు. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ ఏడాది ముహూర్తాలు తక్కువే : పారునంది వెంకటరమణ, పురోహితుడు, మోత్కూరు

ఈ ఏడాది గురు, శుక్ర మౌఢ్యమీలు వెంటవెంట రావడంతో పాటు బలమైన ముహూర్తాలు కూడా తక్కువగానే ఉన్నాయి. గత యేడాది కరోనాతో, ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువగా లేకపోవడంతో పౌరోహిత్యంపైనే ఆధార పడిన పురోహితులు, బాజాభజంత్రీల వారు, పెళ్లిపందిళ్ల వారు, వంటలవారు, ఫొటో, వీడియో గ్రాఫర్లు, పెండ్లి పత్రికలు ముద్రించేవారు, రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి తదితర పనివారలకు పనిదొరకక ఇబ్బందే.

Updated Date - 2021-01-09T05:30:00+05:30 IST