ఎన్‌కౌంటర్లలో నలుగురు నక్సల్స్‌ మృతి

ABN , First Publish Date - 2022-01-19T07:54:21+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు.

ఎన్‌కౌంటర్లలో నలుగురు నక్సల్స్‌ మృతి

  • ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో ముగ్గురు
  • సుకుమా జిల్లాలో ఎదురు కాల్పుల్లో మరొకరు
  • మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు
  • తెలంగాణ గ్రేహౌండ్స్‌ జవానుకు గాయాలు
  • నా సోదరుడి మృతదేహాన్ని అప్పగించండి..
  • మావోయిస్టు బుచ్చన్న సోదరుడి విజ్ఞప్తి



వెంకటాపురం(నూగూరు), చర్ల, హనుమకొండ క్రైమ్‌, రేగొండ, జనవరి 18: ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఛతీ్‌సగఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో ములుగు జిల్లాలోని సరిహద్దు గ్రామం పెనుగోలుకు సమీపంలో 50 మంది దాకా మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం అందుకున్న తెలంగాణ గ్రేహౌండ్స్‌ బలగాలు ఇటువైపు నుంచి.. ఛత్తీస్‌గఢ్‌ డీఆర్జీ బలగాలు మరోవైపు నుంచి మంగళవారం తెల్లవారు జామున కూంబింగ్‌ చేపట్టాయి. ఉదయం 7 గంటల సమయంలో నక్సల్స్‌ కాల్పులకు దిగడంతో.. బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.


ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని, వీరిలో ఒక మహిళ ఉన్నారని బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ వివరించారు. మృతులను వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి మడగం సింగి అలియాస్‌ శాంత, ఇల్లెందు-నర్సంపేట ఏరియా కమిటీ సభ్యుడు కొమ్ముల నరేశ్‌ అలియాస్‌ బుచ్చన్న(32)గా గుర్తించగా.. మరో నక్సల్‌ వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలిలో ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్సాస్‌ రైఫిల్‌, సింగిల్‌ బోర్‌ తుపాకీలను స్వాధీనం చేసుకున్నామని.. 10 రాకెట్‌ లాంచర్లు, ఇతర సామగ్రిని సీజ్‌ చేశామని ఐజీ తెలిపారు. ఇక్కడ మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ మధు ఛాతీ భాగంలో కుడివైపు, చేతికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన హెలికాప్టర్‌ ద్వారా వరంగల్‌కు.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. మరో ఘటనలో.. సుకుమా జిల్లాలో కూంబింగ్‌లో ఉండగా.. ఉదయం 6.45 సమయంలో డీఆర్జీ బలగాలపై నక్సల్స్‌ కాల్పులు జరిపారని సుకుమా ఎస్పీ సునీల్‌శర్మ వెల్లడించారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మున్నీ మరణించారని, ఆమె తలపై రూ.5లక్షల రివార్డు ఉందని తెలిపారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో ఆ ప్రాంతంలో 40 మంది దాకా నక్సల్స్‌ ఉన్నారని వెల్లడించారు.


భూపాలపల్లికి చెందిన బుచ్చన్న

బుచ్చన్న స్వస్థలం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జగ్గయ్యపేట. మూడోతరగతి వరకు చదివిన బుచ్చన్న ఆ తర్వాత గొర్లను కాచేందుకు వెళ్లేవాడు. ఆ క్రమంలో తన పదహారో ఏట(1998లో) నక్సలిజం వైపు ఆకర్షితుడై దళంలో చేరాడు. 2011లో పోలీసులకు లొంగిపోయి, తాపీ పనిచేసుకున్నా.. 2014 నుంచి తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. తమ సోదరుడిని కడసారి చూసుకునేందుకు మృతదేహాన్ని అప్పగించాలని బుచ్చన్న అన్న నరేశ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - 2022-01-19T07:54:21+05:30 IST