నలుగురు నక్సల్స్‌ చనిపోయారు

ABN , First Publish Date - 2021-04-07T09:24:51+05:30 IST

ఛత్తీస్గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా తెర్రం వద్ద పోలీసులు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో.

నలుగురు నక్సల్స్‌ చనిపోయారు

  • వెల్లడించిన మావోయిస్టు పార్టీ
  • కోబ్రా కమాండో తమ వద్దే ఉన్నట్లు ప్రకటన
  • మధ్యవర్తుల ద్వారా అప్పగిస్తామని వెల్లడి
  • అమర జవాన్ల నుంచి తీసుకున్న..
  • 14 తుపాకులు, 2వేల తూటాల ఫొటోలు

హైదరాబాద్‌/ చర్ల/ ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా తెర్రం వద్ద పోలీసులు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో.. తమ వారు నలుగురు చనిపోయారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ పేరుతో మంగళవారం హిందీలో పత్రికాప్రకటన విడుదల చేసింది. మృతులను  నూపే సురేశ్‌, ఒడీ సన్నీ, కోవాసీ బద్రూ, పద్మ లఖ్మాగా వెల్లడించింది. సన్నీ అనే మహిళా మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకోలేకపోయామని పేర్కొంది. మిగతా ముగ్గురికి అంతిమ సంస్కారాలు నిర్వహించామని వివరించింది. ‘‘సమాధాన్‌-ప్రహార్‌ సైనిక అభియాన్‌కు వ్యతిరేకంగా ఈ నెల 3న ప్రజా గెరిల్లాలు దాడిచేశాయి. మావైపున ప్రాణనష్టం 4గా ఉంది. పోలీసులు మాకు శత్రువులు కాదు. చనిపోయిన పోలీసులకు మా నివాళులు. మా వద్ద బందీగా ఉన్న కోబ్రా కమాండోను విడుదల చేస్తాం. అయితే.. మధ్యవర్తుల ద్వారా వారిని విడుదల చేస్తాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. చనిపోయిన జవాన్ల వద్ద నుంచి 14 తుపాకులు, 2 వేలకు పైగా తూటాలు, నైట్‌ విజన్‌ బైనాక్యూలర్లు, హ్యాండ్‌ గ్రనేడ్లు, వాకీటాకీలు, సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఆ మేరకు ఫొటోలను మీడియాకు విడుదల చేసింది. పోలీసులు ‘ఆపరేషన్‌ హిడ్మా’ను ప్రారంభించడానికి ముందు జీరగూడెంలో మాడ్వీ సుక్కాలాల్‌ అనే గ్రామస్థుడిని కాల్చి చంపిందని, అతను మిలీషియా వీరుడని పేర్కొంది. గత ఏడాది నవంబరు నుంచి 150 మందికి పైగా అమాయకులను పోలీసులు హత్యచేశారని తెలిపింది.


చర్చలకు సిద్ధమే!

చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ప్రభుత్వానికే చిత్తశుద్ధిలేదని విమర్శించింది. చర్చలకు సానుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. బలగాలతో దాడులు చేస్తున్నందుకే కొండగాం, నారాయణపూర్‌, బీజాపూర్‌ జిల్లాల్లో జరిగిన ప్రతిదాడులలో పోలీసులు చనిపోవాల్సి వచ్చిందని వివరించింది. ఆ మరణాలకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. ప్రజలను, వనరులను కాపాడుకునేందుకే ప్రతిదాడులు చేస్తున్నట్లు తెలిపింది.

Updated Date - 2021-04-07T09:24:51+05:30 IST