సెకనుకు నాలుగు ‘ఓలా’ అమ్మకాలు...

ABN , First Publish Date - 2021-09-16T22:11:23+05:30 IST

నిన్నటి(సెప్టెంబరు 15)నుంచి ప్రారంభమైన ఓలా స్కూటర్ అమ్మకాలు అదరగొడుతున్నాయి.

సెకనుకు నాలుగు ‘ఓలా’ అమ్మకాలు...

హైదరాబాద్ : నిన్నటి(సెప్టెంబరు 15)నుంచి ప్రారంభమైన ఓలా స్కూటర్ అమ్మకాలు అదరగొడుతున్నాయి. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లలో విడుదలైంది. ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో వేరియంట్ల  విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి. కేవలం 24 గంటల్లో రూ. 600 కోట్ల విలువైన స్కూటర్లను విక్రయించినట్లు ఓలా తెలిపింది. ప్రతి సెకనుకు నాలుగు స్కూటర్లు అమ్ముడుపోయినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న బుకింగ్‌లు మరోమారు ప్రారంభమయ్యాయి. ఓలా యాప్‌లో ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.


ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు తమ స్లాట్‌లను బుక్‌ చేసుకున్నారని సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా ఓలా చైర్మన్‌, గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భవేష్‌ అగర్వాల్‌ బ్లాగ్‌లో ఓ పోస్టు చేశారు. కేవలం 24 గంటల్లో రూ. 600 కోట్లకుపైగా విలువైన స్కూటర్లను విక్రయించామని, వినియోగదారుల స్పందన అంచనాలకు మించి ఉందని పేర్కొన్నారు. కాగా విద్యుత్తు వాహనాల బుకింగ్‌లోనూ సరికొత్త రికార్డ్‌లను ఓలా నెలకొల్పింది. కేవలం రూ. 499ల తో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందించడంతో... విడుదలైన రోజే దాదాపు వెయ్యి నగరాల్లో లక్ష ఫ్రీ బుకింగ్‌లతో రికార్డు నెలకొల్పినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 

Updated Date - 2021-09-16T22:11:23+05:30 IST