వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-10-17T04:40:26+05:30 IST

జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వారివారి కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. రెండుచోట్ల కార్లు ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. చీరాల వద్ద బైక్‌పై హైవే దాటుతున్న ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు.

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
దానం మృతదేహం

చీరాల వద్ద బైక్‌పై హైవే దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి

ఇరురువూ ఇంటర్‌ విద్యార్థులే

పెద్దదోర్నాలలో కారు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం

దర్శిలో నడిచి వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో మృత్యువాత

జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వారివారి కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. రెండుచోట్ల కార్లు ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. చీరాల వద్ద బైక్‌పై హైవే దాటుతున్న ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. 

చీరాలటౌన్‌, అక్టోబర్‌ 16 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చీరాల పరిధిలోని జాతీయరహదారిపై శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనపై టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలలోకి వెళితే... చీరాల మండల పరిధిలోని ఎన్‌టీఆర్‌ కాలనీకు చెందిన గొర్రెముచ్చు విల్సన్‌(16) ఇంటర్‌ మొదటి సంవత్సరం.. మునిసిపల్‌ పరిధిలోని మరియమ్మపేటకు చెందిన గడతోటి రవిచంద్ర(20) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరిరువురు స్నేహితులు. శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో బైక్‌పై రామాపురం రోడ్డులో నుంచి చీరాల వచ్చేందుకు మన్నవ అపార్ట్‌మెంట్‌ వద్ద 216 జాతీయ రహదారి దాటుతుండగా ఒంగోలు నుంచి బాపట్ల వైపు వెళ్తున్న గుర్తుతెలియని లారీ అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న టూటౌన్‌ సీఐ విజయకుమార్‌, ఎస్సై దంటు రత్నకుమారి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

కుటుంబాల నేపథ్యం....

రవిచంద్ర తండ్రి చాలాకాలం క్రితం మరణించగా తల్లి పట్టణంలోని ఓ ప్రయివేట్‌ వైద్యశాలలో పనిచేస్తూ ఒక్కగానొక్క కుమారుడిని కష్టపడి చదివిస్తుంది. కుమారుడు చేతికందేలోగా ఇలాంటి పరిస్థితి రావడంతో బోరున విలపించింది. విల్సన్‌ మాత్రం ముగ్గురు అన్నదమ్ములలో మధ్యలో వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండే కుమారుడు మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తండ్రి కుమార్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ చేస్తున్నారు.


రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పెద్దదోర్నాల, అక్టోబరు 16 : ఎదురెదురు ప్రయాణిస్తున్న కారు మోటార్‌సైకిల్‌ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక భారత్‌ పెట్రోలు బంక్‌ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో మండలంలోని చిన్నగుడిపాడు గ్రామానికి చెందిన పూర్ణకంటి దానం(45) మృతి చెందాడు. అందిన వివరాల మేరకు.. దానం బైకుపై చిన్నగుడిపాడు నుంచి దోర్నాలకు వస్తుండగా ఎదురుగా  కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దానం కిందపడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ హరిబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేశారు.దానం మృతి సమాచారం తెలుసుకున్న టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఏరియా వైద్యశాలలో మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


దర్శిలోనూ...

దర్శి, అక్టోబరు 16 : దర్శి పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగిరెడ్డి రాము ఆలియాస్‌ రాంబాబు(45) మృతి చెందాడు. రాంబాబు రోడ్డుపై నడిచి వెళ్తుండగా దర్శి నుంచి పొదిలి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-17T04:40:26+05:30 IST