ఇండియానా పోలిస్ కాల్పుల్లో నలుగురు భారతీయ అమెరికన్ల మృతి !

ABN , First Publish Date - 2021-04-17T15:10:15+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని ఇండియానా పోలిస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ‘ఫెడెక్స్‌’ కొరియర్‌ సంస్థలో గురువారం జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల్లో నలుగురు భారతీయ అమెరికన్లు ఉన్నట్లు తాజాగా పోలీసులు వెల్లడించారు. నలుగురు కూడా సిక్కులేనని అధికారులు తెలిపారు.

ఇండియానా పోలిస్ కాల్పుల్లో నలుగురు భారతీయ అమెరికన్ల మృతి !

ఇండియానా పోలిస్‌: అగ్రరాజ్యం అమెరికాలోని ఇండియానా పోలిస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ‘ఫెడెక్స్‌’ కొరియర్‌ సంస్థలో గురువారం జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల్లో నలుగురు భారతీయ అమెరికన్లు ఉన్నట్లు తాజాగా పోలీసులు వెల్లడించారు. నలుగురు కూడా సిక్కులేనని అధికారులు తెలిపారు. మృతులను అమర్జీత్ జోహల్(66), జస్వీందర్ కౌర్(64), జస్వీందర్ సింగ్(68), అమర్జీత్ స్కోహన్(48)గా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో(అమెరికా కాలమానం ప్రకారం) ఓ సాయుధుడు ‘ఫెడెక్స్‌’ కొరియర్‌ సంస్థలోకి చోరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ మారణకాండలో 8 మంది అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు.


గాయపడిన వారిలో భారతీయ యువతి ఉన్నారు. ఆమె కారులో కూర్చొని ఉండగా ఆగంతకుడు కాల్పులు జరిపాడు. దాంతో ఆమె భుజంలో బుల్లెట్‌ దిగింది. ఈ ఘటన అనంతరం తనను తాను కాల్చుకుని దుండగుడు కూడా మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులకు తెగబడిన సాయుధుడిని ఇండియానాకు చెందిన బ్రాండన్ స్కాట్​ హోల్​(19)గా అధికారులు గుర్తించారు. గత నాలుగు నెలల వ్యవధిలో ఇండియానా రాష్ట్రంలో కాల్పులు చోటు చేసుకోవడం ఇది మూడోసారి.


ఇక ఈ సంస్థలో పనిచేసేవారిలో 90 శాతం మంది భారతీయ అమెరికన్లు ఉండగా, వీరిలో ఎక్కువ శాతం మంది సిక్కు కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చికాగాలోని భారత కాన్సులేట్ జనరల్​.. సిక్కు నేతలు, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరపుతున్నారని మంత్రి తెలిపారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 


Updated Date - 2021-04-17T15:10:15+05:30 IST