Abn logo
Oct 1 2021 @ 00:00AM

నాలుగు రకాల సంసారాలు

మానవుల మధ్య బంధాలను, అనుబంధాలను ముడివేసే మొదటి వ్యవస్థ కుటుంబం. ఈ కుటుంబ సంబంధాలే మానవ సంబంధాలుగా మారుతాయి. బలీయం అవుతాయి. కుటుంబానికి మూలం భార్యాభర్తల అనుబంధం. వారి భుజం మీదే మానవ సమాజ నైతిక సౌధం నిలబడి ఉంటుంది. భవిష్యత్‌ సమాజ నిర్మాతలైన పిల్లలను తీర్చిదిద్దాల్సింది వారే. వారి తరువాతే మరెవరైనా! రెండు విభిన్న ప్రాంతాలవారు, విభిన్న నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవారు దంపతులుగా జీవితాన్ని ప్రారంభించడం వివాహ వ్యవస్థలోని అతి గొప్ప విషయం. అంతేకాదు... కొన్ని చోట్ల భిన్న మనస్తత్వాలు, విభిన్న మత దృక్పథాలు ఉన్నవారు కూడా ఒకే కుటుంబంలోకి వస్తారు. కొన్ని సందర్భాల్లో వారి అలవాట్లు, ఆచారాలు, దృక్పథాల మధ్య పొసగక ఇబ్బందులు పడతారు. అలాంటి సమయంలో వారికి తగిన విధంగా నచ్చజెప్పి, సర్దుబాటు కలిగించడమే విజ్ఞులు చేసే పని. 


బౌద్ధంలో విశాఖమాత కుటుంబం ఇలా ఇబ్బందులు పడింది. విశాఖకు చిన్నప్పటి నుంచి బుద్ధుడి బోధల పట్ల అమితమైన అభిమానం ఉండేది. పైగా ఆమెకు దానగుణం చాలా ఎక్కువ. ఆమెకు వివాహమై, అత్తవారింటికి వచ్చి చూస్తే... అక్కడ పూర్తిగా వ్యతిరేక వాతావరణం. అందులో ఆమె ఇమడలేకపోయింది. తట్టుకోలేకపోయింది. బుద్ధుడు ఆమెకు సర్దిచెప్పాడు. ఆమె శాంతం వహించి,, తెలివిగా భర్తను, అత్తమామలను తన దారికి తెచ్చుకుంది. వారందరినీ ధార్మిక మార్గంలో నడిపించింది. ఆమె మామ పేరు మిగారుడు. అతను పరమ కోపి, పిసినిగొట్టు. చివరకు అతను తన కోడలి ఔదార్యాన్ని అర్థం చేసుకున్నాడు. ‘‘ఆమె నా కోడలు కాదు, నా తల్లి’’ అన్నాడు. అందుకే విశాఖకు ‘మిగారమాత’ అని పేరు.


అలాగే, అనాథ పిండికుడి కథలోకి వస్తే, అతను మహాదాత. కానీ. ఆయన భార్యలలో ఒకరు దానాలకు పూర్తి వ్యతిరేకి. చివరకు అతను భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. బుద్ధుడికి ఈ విషయం తెలిసింది. ‘‘నువ్వు చేసింది తప్పు’’ అని ఆయన చెప్పడంతో, అనాథ పిండికుడు తన భార్యను క్షమాపణలు కోరాడు. ఆమెను తిరిగి ఇంటికి తెచ్చుకున్నాడు. ఆమె ఆ తరువాత నెమ్మదిగా భర్తకు తగిన భార్యగా రాణించింది.


తన అత్తింటివారు బుద్ధ పూజ చేయడం లేదనే కోపంతో కాపురాన్ని కాలదన్నుకోవడానికి సిద్ధపడిన సుజాత అనే యువతకు బుద్ధుడు గొప్ప ప్రబోధం చేశాడు. సుజాత ఆలోచన తప్పు అని నచ్చజెప్పి, ఆమె కాపురాన్ని కాపాడాడు. 


‘కుటుంబంలో భార్య ఎలా ఉండాలి? భర్త ఎలా ఉండాలి? ఎవరి బాధ్యత ఏమిటి?’ అనే సందేశాలు బౌద్ధంలో ఉన్నాయి. ‘సంసారాలు ప్రధానంగా నాలుగు రకాలు’ అని బుద్ధుడు చెప్పాడు. ‘‘దివ్యులు, దుష్టులు అనే రెండు రకాల భార్యాభర్తలున్నారు. అబద్ధాలు ఆడడం, కోపంతో కసరడం, కామ దురాచారాన్ని కలిగి ఉండడం, తాగుడు, జూదం లాంటి దుర్వ్యసనాలు ఉన్న భర్తను ‘దుష్ట భర్త’ అంటాం. ఇవే లక్షణాలు భార్యలో కూడా ఉంటే ఆమె ‘దుష్ట భార్య’. ఇలాంటి దుష్ట భర్త, దుష్ట బార్య కలిసి కాపురం చేస్తే... అది ‘దుష్ట సంసారం’ అవుతుంది. అలాంటి జంట సమాజానికి ఎంతో చేటు. అలాకాకుండా, మంచి లక్షణాలు ఉన్న భర్తకు దుష్ట లక్షణాలు ఉన్న భార్య దొరికితే... దివ్య భర్త, దుష్ట భార్యల సంసారం అవుతుంది. భార్యకు మంచి గుణాలు ఉండి, భర్త దుర్గుణాలతో ఉంటే... అది దివ్య భార్య, దుష్ట భర్తల సంసారం అవుతుంది. 


ఇక, మంచి భర్త, మంచి భార్య కలిసి ఉంటారు. వారు పంచశీల పాటిస్తారు. శీలవర్తనను కోల్పోరు. దాతృత్వం కలిగి ఉంటారు. ధర్మమార్గంలో నడుస్తారు.  కష్ట సుఖాలు కలిసి పంచుకుంటారు. కలహాలకు దూరంగా ఉంటారు. వారిది ‘దివ్య సంసారం’ అవుతుంది. ఇలా నాలుగు రకాల సంసారాలు ఉంటాయి. మొదటిదైన ‘దుష్ట సంసారం’ ఆ దంపతులకే కాదు... ఇరుగు పొరుగు వారికి, సమాజానికి ఎంతో చేటు. ఆ తరువాతి రెండు రకాల సంసారాలూ కలహాల కుంపట్లుగా రగులుతూనే ఉంటాయి. ఇక, నాలుగవదైన ‘దివ్య సంసారం’ వల్ల ఆ దంపతులకే కాదు, నలుగురికీ మేలు జరుగుతుంది. వారికోసం నిలబడడానికి ఓ నలుగురు ఉంటారు. ఇటువంటి ‘దివ్య సంసారం’ సర్వదా శ్రేయోదాయకం’’ అనేది బుద్ధుడి సందేశం.


 బొర్రా గోవర్ధన్‌