ఉప్పొంగిన వాగు.. కొట్టుకుపోయిన కారు

ABN , First Publish Date - 2020-07-11T09:27:50+05:30 IST

గురువారం రాత్రి కురిసిన వర్షంతో పాటు ఎగువ నుంచి వచ్చిన వాన నీటితో ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం చిన్నబీరవల్లి గ్రామశివారులోని వాగు

ఉప్పొంగిన వాగు.. కొట్టుకుపోయిన కారు

క్షేమంగా బయటపడిన నలుగురు 

ఒడ్డుకు చేర్చిన బాటసారులు

బోనకల్‌ మండలం చిన్నబీరవల్లిలో ఘటన


బోనకల్‌, జూలై 10: గురువారం రాత్రి కురిసిన వర్షంతో పాటు ఎగువ నుంచి వచ్చిన వాన నీటితో ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం చిన్నబీరవల్లి గ్రామశివారులోని వాగు ఉప్పొంగింది. ఈ వాగుపై తక్కువ ఎత్తులో వంతెన ఉండటంతో నీరు దానిపై నుంచి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మధిర నుంచి ఖమ్మం వైపునకు కారులోవెళుతున్న నలుగురు ఆ ప్రవాహ ఉధృతిని అంచనా వేయలేకపోయారు. ప్రవాహం తక్కువగాగానే ఉందని భావించి అవతలికి దాటేందుకు ప్రయత్నించారు. కొంతదూరం వెళ్లిన తర్వాత వారి కారు కొట్టుకుపోతుండగా అందులోని వారు డోర్లు తీసి నీటిలోకి దూకారు.


ఇందులో ఇద్దరు ఒడ్డుకు చేరగా మరో ఇద్దరు కొట్టుకుపోతుండగా అదే సమయంలో అక్కడ ఉన్న రజక సంక్షేమ సంఘ జిల్లా డైరెక్టర్‌ తమ్మారపు బ్రహ్మయ్య, మత్స్యకారుడు అశోక్‌ ఈదుకుంటూ వెళ్లి వారిద్దరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కారు వాగులో ఉన్న తుమ్మచెట్టుకు తగిలి నిలిచిపోయింది. వాగు నీరు రోడ్డుపై పది అడుగుల ఎత్తు మేరకు రావడంతో రాకపోకలు నిలిచి పోయాయి. కారులో ఉన్న వారిలో ఒకరిది వైరా మండలం బ్రాహ్మణపల్లి కాగా ఇద్దరిది మధిర, మరొకరిది చింతకాని మండలం వందనం గ్రామంగా తెలిసింది. కారులోని వారు డోర్లు తీసుకుని బయటకు దూకడం, అంతలోనే ఇద్దరిని స్థానికులు కాపాడటంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. 


నీటి ప్రవహంలో కొట్టుకు పోతుంటే ఒడ్డుకు చేర్చా..తమ్మారపు బ్రహ్మాయ్య, గోవిందాపురం

నేను బ్రాహ్మణపల్లి నుంచి వస్తుండగా కారు వాగులో కొట్టుకుపోవడాన్ని చూసి ఆగా. ఇద్దరు నీటి ప్రవహంలో కొట్టుకుపోతుండగా రక్షించేందుకు నీటిలో దూకా. మధిరకు చెందిన వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చా. చిన్నతనం నుంచి వాగులు, వరద విషయంలో అనుభవం ఉండటంతో ఇది సాధ్యమైంది. నాతో ఉన్న మరో మత్స్యకారుడు కూడా నీటిలో దూకి మరొకరిని సురక్షితంగా చేర్చాడు. ప్రమాదం నుంచి వారిని కాపాడటం నాకు ఆనందంగా ఉంది. 

Updated Date - 2020-07-11T09:27:50+05:30 IST