కరోనా సాకుతో తప్పించుకుంటే..నాలుగేళ్ల నిషేధం!

ABN , First Publish Date - 2020-06-07T09:06:22+05:30 IST

దేశంలోని ప్రతీ అథ్లెట్‌ టోర్నీలున్నా, లేకున్నా డోపింగ్‌ పరీక్షలకు హాజరవడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం ఆయా సమయాల్లో డోప్‌ నియంత్రణ అధికారు...

కరోనా సాకుతో తప్పించుకుంటే..నాలుగేళ్ల నిషేధం!

  డోపింగ్‌ టెస్టులపై అథ్లెట్లకు నాడా హెచ్చరిక

  గ్లోవ్స్‌, మాస్క్‌ ధరించడం తప్పనిసరని ఆదేశం


న్యూఢిల్లీ: దేశంలోని ప్రతీ అథ్లెట్‌ టోర్నీలున్నా, లేకున్నా డోపింగ్‌ పరీక్షలకు హాజరవడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం ఆయా సమయాల్లో డోప్‌ నియంత్రణ అధికారు (డీసీఓ)లకు తమ శాంపిళ్లను అందించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావాన్ని సాకుగా చూపుతూ ఉద్దేశపూర్వకంగా టెస్టుల నుంచి తప్పించుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జాతీయ డోపింగ్‌ వ్యతిరేక ఏజెన్సీ (నాడా) హెచ్చరించింది. ఇలాంటి వారిని నాలుగేళ్ల వరకు నిషేధిస్తామని స్పష్టం చేసింది. ‘ఒకవేళ్ల ఏ అథ్లెట్‌ అయినా కావాలని తప్పుడు సమాచారమిచ్చి టెస్టులను తప్పించుకుంటే డోపింగ్‌ నిరోధక చట్ట అతిక్రమణ కింద నాలుగేళ్ల వరకు నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని నాడా ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మరోవైపు త్వరలోనే జాతీయ శిక్షణ శిబిరాలను ఆరంభించాలనే ఆలోచన ఉండడంతో టోక్యో ఒలింపిక్స్‌ ప్రాబబుల్స్‌తో పాటు ప్రముఖ ఆటగాళ్ల శాంపిళ్లను నాడా సేకరించాలనుకుంటోంది. అయితే ఈ సమయంలో అందరూ గైడ్‌లైన్స్‌ను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రతీ అథ్లెట్‌ చేతికి గ్లోవ్స్‌, ఫేస్‌ మాస్క్‌ ధరించడంతో పాటు శాంపిల్‌తో కూడిన ప్లాస్టిక్‌ కంటైనర్‌ను అందించేటప్పుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించింది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే శిక్ష తప్పదని సూచించింది. 

డీసీఓలదే ఆ బాధ్యత: దేశంలోని స్టార్‌ ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని డోప్‌ నియంత్రణ అధికారు (డీసీఓ)లకు కూడా నాడా పలు సూచనలు చేసింది. ఆటగాళ్ల నుంచి శాంపిళ్లను సేకరించడానికి ముందే స్వయంగా తమకు కరోనా లక్షణాలు లేవని వీరంతా ప్రకటించుకోవాల్సి ఉంటుంది. అలాగే క్వారంటైన్‌లో ఉన్నవారితో పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారితోనూ ఎలాంటి కాంటాక్ట్‌లో లేమని, కొవిడ్‌-19 రోగులకు చికిత్స చేస్తున్న ఆరోగ్య అధికారులతోనూ ఎలాంటి సంబంధాలు లేవని నిరూపించుకోవాలి. ఈ స్వయం ప్రకటన ఆధారంగానే డీసీఓలను శాంపిళ్ల సేకరణ కోసం నాడా నియమిస్తుంది. అలాగే 60 ఏళ్లకు పైబడి, ఇతరత్రా జబ్బులున్న వారిని ఈ విధులకు దూరంగా ఉంచాలని నిర్ణయించారు. నాడాకు చెందిన సీనియర్‌ సైంటిఫిక్‌ అధికారి దగ్గర డీసీవోలంతా కొవిడ్‌-19 పరీక్షలు చేసుకున్నాకే శాంపిళ్ల సేకరణకు వెళ్లనున్నారు. 

నో బ్లడ్‌ శాంపిల్స్‌: ప్రస్తుతానికైతే ఒలింపిక్స్‌ ప్రాబబుల్స్‌తో పాటు అన్ని క్రీడల్లోనూ స్టార్‌ ఆటగాళ్లకు నాడా డోపింగ్‌ టెస్టులు చేయనుంది. దీంట్లో భాగంగా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు, వెయిట్‌లిఫ్టర్లకు ఈనెలలోనే పటియాలలోని ఎన్‌ఐఎ్‌స సెంటర్‌లో టెస్టులకు హాజరుకావాల్సి ఉంది. ఆ తర్వాత బెంగళూరులోని సాయ్‌ సెంటర్‌లో ఉన్న పురుషుల, మహిళల హాకీ ఆటగాళ్లను పరీక్షిస్తారు. అలాగే ఇప్పుడెలాగూ పోటీలు లేవు కాబట్టి స్వయంగా ఆటగాళ్ల ఇంటికే డీసీఓలను పంపి శాంపిళ్లను సేకరించాలనే ఆలోచనలోనూ నాడా ఉంది. మరోవైపు టెస్టుల కోసం క్రీడాకారుల రక్త నమూనాలను సేకరించకూడదని నాడా ఏజెన్సీ భావిస్తోంది. ఎందుకంటే వీటిని పరీక్షించే జాతీయ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ (ఎన్‌డీటీఎల్‌)పై ‘వాడా’ నిషేధం కొనసాగుతోంది. దీంతో 36 గంటల్లోగా వీటిని విదేశాల్లోని ల్యాబ్‌లకు పంపాల్సి ఉన్నా.. అంతర్జాతీయ ప్రయాణాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అదీగాకుండా ఖతార్‌, బెల్జియంలోని ల్యాబ్‌లకు పంపేంత ఆర్థిక స్థోమత కూడా ప్రస్తుతానికి నాడాకు లేదు.

Updated Date - 2020-06-07T09:06:22+05:30 IST