నాలుగో రోజూనష్టాలే..

ABN , First Publish Date - 2020-08-04T06:15:47+05:30 IST

కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం, చాలా కంపెనీల షేర్లు గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతుండటంతో ఈక్విటీ మదుపర్లు ముందుజాగ్రత్త పడుతున్నారు

నాలుగో రోజూనష్టాలే..

  • సెన్సెక్స్‌ 667 పాయింట్లు డౌన్‌ 
  • 11,000 దిగువకు నిఫ్టీ 

ముంబై: కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం, చాలా కంపెనీల షేర్లు గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతుండటంతో ఈక్విటీ మదుపర్లు ముందుజాగ్రత్త పడుతున్నారు. దాంతో స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ నష్టాలు చవిచూశాయి. ఆర్‌ఐఎల్‌, బ్యాంకింగ్‌ షేర్లలో ట్రేడర్లు సోమవారం భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. రూపా యి పతనం, జూలైలో తయారీ రంగ పనితీరు మళ్లీ తగ్గడమూ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 667.29 పాయింట్లు కోల్పోయి 36,939.60 వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) ప్రామాణిక సూచీ నిఫ్టీ మళ్లీ 11,000 దిగువ స్థాయికి పడిపోయింది.  సోమ వారం నాటి ట్రేడింగ్‌లో 181.85 పాయింట్లు నష్టపోయి 10,891.60 వద్దకు జారుకుంది. గడిచిన నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,553.35 పాయింట్లు, నిఫ్టీ 408.95 పాయింట్లు క్షీణించాయి. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 24 నష్టాలు చవిచూశాయి. కేవలం 6 సంస్థల షేర్లే లాభపడ్డాయి.  


రూ.56,500 దాటిన పసిడి 

బంగారం ధరలు ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్నాయి. రోజుకో ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని చేరుకుంటున్నాయి. హైదరాబాద్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర సోమవారం రూ.56,510కి పెరిగింది. 22 క్యారెట్ల రేటు రూ.51,700-51,800 మధ్య ట్రేడైంది. కిలో వెండి రూ.65,400కి చేరుకుంది. ఢిల్లీ మార్కెట్లోనూ 24 క్యారెట్ల గోల్ట్‌ మరో రూ.185 పెరిగి రూ.54,678కి, కేజీ సిల్వర్‌ రూ.1,672 పెరుగుదలతో రూ.66,742కు ఎగబాకాయి.


ఇక ముంబైలో మేలిమి బంగారం రూ.53,976, కిలో వెండి రూ.64,770 ధర పలికాయి. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం ఇందుకు కారణమైందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 1,984 డాలర్లు, సిల్వర్‌ 24.40 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. 

Updated Date - 2020-08-04T06:15:47+05:30 IST