ఎఫ్‌పీ షాపులు బంద్‌

ABN , First Publish Date - 2021-05-11T06:23:25+05:30 IST

డీలర్లే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అధికారుల ఒత్తిడికి వ్యతిరేకం గా జిల్లాలో సోమవారం ఎఫ్‌ పీ షాపుల బంద్‌ పాటించారు. ఎఫ్‌పీ షాపు డీలర్ల సంఘం నిర్ణ యం మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని ఎఫ్‌పీ షాపులను డీలర్లు మూసివేసి, నిరసన వ్యక్తం చేశారు.

ఎఫ్‌పీ షాపులు బంద్‌

నిలిచిపోయిన ఉచిత బియ్యం పంపిణీ

అనంతపురం వ్యవసాయం, మే 10:  డీలర్లే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అధికారుల ఒత్తిడికి వ్యతిరేకం గా జిల్లాలో సోమవారం ఎఫ్‌ పీ షాపుల బంద్‌ పాటించారు. ఎఫ్‌పీ షాపు డీలర్ల సంఘం నిర్ణ యం మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని ఎఫ్‌పీ షాపులను డీలర్లు మూసివేసి, నిరసన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో డీలర్లు స్వచ్ఛందంగా బంద్‌ పాటించగా... మరికొన్ని చోట్ల ఆయా మండలాల సంఘం నాయకుల సూచనల మేరకు మరికొందరు డీలర్లు షాపులు మూసివేశారు. ఎఫ్‌పీ షాపు డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలనాగిరెడ్డి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి బాధ్యతను  మినీ ట్రక్కుల యజమానులకు(ఎండీయూ) ప్రభుత్వం అప్పగించిందన్నారు. ఎండీయూలు సమ్మెలో ఉన్నారనీ, మరికొందరు రాజీనామాలు చేశారన్న కారణాలతో డీలర్లే వీఆర్వో, వీఆర్‌ఏ అథెంటికేషనతో సరుకులు పంపిణీ చేయాలని అఽధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డీలర్లతో సరుకులు పంపిణీ చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. లేదంటే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరింత ఉధృతంగా నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.


ఆగిన ఉచిత బియ్యం పంపిణీ

మే, జూన మాసాల్లో కార్డులోని ఒక్కో సభ్యుడికి 10 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈనెలారంభం నుంచి మినీ ట్రక్కుల యజమానులు సమ్మెలోకి వెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల, జూన మాసాల్లో సరఫరా చేసే ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి అదనపు కోటాకు తమకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ మినీ ట్రక్కుల యజమానులు సమ్మె చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 3 వేల దాకా ఎఫ్‌పీ షాపుల్లో 11.19  లక్షల బియ్యం కార్డులున్నాయి. జిల్ల్లాకు ప్రతి నెలా 20 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయిస్తున్నారు. ఇందులో పీడీఎస్‌ పంపిణీతోపాటు మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్‌ పథకాలకు పంపిణీ చేస్తున్నారు. ఉచిత బియ్యం పంపిణీ నేపథ్యంలో జిల్లాకు మే నెలలో అదనంగా 18646 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయించారు. ఇంటి వద్దకే  సరుకుల పంపిణీ కోసం జిల్లాకు 754 మినీ ట్రక్కులు కేటాయించారు. కొన్ని నెలలుగా 180 ట్రక్కుల యజమానులు రాజీనామా చేశారు. మినీ ట్రక్కుల యజమానులు సమ్మె చేస్తున్నా కొన్ని ప్రాంతాల్లో అధికారుల ఒత్తిడి నేపథ్యంలో కొందరు ఎండీయూలు క్షేత్ర స్థాయిలో ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వీఆర్వో, వీఆర్‌ఏ అథెంటికేషనతో డీలర్లతోనే బలవంతంగా పంపిణీ చేయిస్తున్నారు. ఇందుకు నిరసనగా సోమవారం షాపులు బంద్‌ చేయడంతో ఉచిత బియ్యం పంపిణీ నిలిచిపోయింది. క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి కార్దుదారులకు ఉచిత బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఉచిత బియ్యానికి కార్డుదారులు దూరమయ్యే దుస్థితి తప్పదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు పౌరసరఫరాల ఉన్నతాధికారులు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే.

Updated Date - 2021-05-11T06:23:25+05:30 IST