Abn logo
Nov 28 2020 @ 00:42AM

అడ్డగోలుగా అర్చక ఆర్థిక సాయం!

అధికార పార్టీ నేతల ప్రమేయం

   అర్హులకు అన్యాయం

   అనర్హులకు పెద్దపీట


అనంతపురం టౌన్‌, నవంబరు 27: దేవదాయ ధర్మాదాయశాఖలో ఏం జరుగుతోంది? అర్చకులక రావాల్సిన ఆర్థికసాయం ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? పేద అర్చకులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థికసాయం అడ్డగోలుగా అడ్డదారుల్లో వెళ్తోంది. దేవదాయ ధర్మాదాయ శాఖలో కొందరి తీరు సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్న చందంగా మారింది. కరోనా విపత్కర పరిస్థితులనుంచి అర్చక, పురోహితులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన అర్చక ఆర్థిక సాయాన్ని పలు ప్రాంతాల్లో అధికారపార్టీకి చెందిన నాయకులు తమ జేబుల్లోకి వేసుకుని అర్చకులకు మొండిచేయి చూపారు. మరికొన్ని ప్రాంతాల్లో అన్ని అర్హతలున్నప్పటికీ అధికారులు చేసిన నిర్లక్ష్యం కారణంగా అర్చకులు తమకు అందాల్సిన ఆర్థిక సాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మరికొన్నిచోట్ల ఆలయాలు ఉన్నాయా, లేదా? పూజలు జరుగుతున్నాయా? లేదా? అన్న ఆలోచన కూడా చేయకుండా అనర్హులకు సైతం అర్చక ఆర్థిక సాయాన్ని అందించేశారు.  జిల్లావ్యాప్తంగా దాదాపు 6వేల మందికి పైగా అర్చక పురోహితులున్నారు. వీరిలో 2400 మంది వరకూ దేవదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అర్చకవృత్తిలో కొనసాగుతున్నారు. వీరిలో రూ.10వేలకు పైగా వేతనాలు అందుతున్నవారు దాదాపు 400 మంది ఉండగా మిగిలినవారంతా రూ.10వేల లోపు వేతనాలతో పనిచేస్తున్నవారున్నారు. దేవదాయ ధర్మాదాయశాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చకులతోపాటు ప్రైవేట్‌ ఆలయాల అర్చకులకూ రూ.10వేలలోపు వేతనాలు ఉన్న వారందరికీ ఖాతాలో రూ.5వేలు జమచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మండలాల వారీగా దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారులకు అర్చకుల వివరాల సేకరణ బాధ్యతలను అప్పగించారు ఆ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌. కార్యనిర్వహణాధికారులు పంపిన జాబితా మేరకు దేవదాయశాఖ అధికారులు జాబితాలోని 4,461 మంది ఖాతాల్లో ఒకొకరికి రూ.5వేలు చొప్పున మొత్తం రూ.2.23కోట్లను జమ చేశారు. అయితే అధికారులు చేసిన తప్పిదాల కారణంగా జాబితాలో అనర్హులకు సైతం చోటు దక్కగా, మరికొన్ని ప్రాంతాల్లో అర్హతలున్న అర్చకులకూ ఆర్థికసాయం అందలేదని పలువురు అర్చకులు వాపోతున్నారు. 


అధికార పార్టీ నేతల ప్రమేయం..? 

అర్చకుల వివరాల సేకరణలో స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కూడేరు మండల కన్వీనర్‌గా ఉన్న బి.పి.రాజశేఖర్‌, ఆయన సతీమణి జ్యోతి అర్చక ఆర్థికసాయాన్ని పొందారు. ఇదే మండలంలోని కొర్రకోడు గ్రామంలో రాచెర్లప్పస్వామి ఆలయంలోని విగ్రహాలను 4 సంవత్సరాల క్రితం తాటిచెర్లకు తీసుకెళ్లి, నాటినుంచి ఇప్పటికీ తాటిచెర్లలోనే పూజలు నిర్వహిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా కొర్రకోడులోని ఆలయంలో పూజలు జరగడం లేదు. అయితే కొర్రకోడులోనే రాచెర్లప్పస్వామి ఆలయ పురోహితుడిగా దరఖాస్తు చేసుకున్న ఆర్‌.రాజశేఖర్‌ అనే వ్యక్తికి ఆర్థికసాయం జమఅయింది. అదేవిధంగా రాములమ్మ కట్ట అనే పంచాయతీ స్థలాన్ని దేవాలయంగా చూపుతూ నారాయణస్వామి అనే వ్యక్తి ఆర్థికసాయం పొందాడు. కొన్ని సంవత్సరాల క్రితం వంకలో మునిగిపోయిన లక్ష్మమ్మ దేవాలయానికి సంబంధించి జ్యోతి అనే మహిళ ఖాతాల్లోకి ఆర్థికసాయం జమఅయింది. 


అసలైన అర్చకుల గగ్గోలు

దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారులు చేసిన తప్పిదాల వల్ల ఆర్థికసాయం అందని అర్చకులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 6వేల మంది అర్చక పురోహితులుండగా 4,461 మందికి మాత్రమే అర్చక ఆర్థికసాయం వారి ఖాతాల్లోకి జమ అయింది. అయితే జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ దేవదాయశాఖాధికారులు అర్చకుల బ్యాంకు ఖాతా నెంబర్లు, ఐఎ్‌ఫఎ్‌ససి కోడ్‌లు తప్పుగా నమోదు చేయడంవల్ల జిల్లావ్యాప్తంగా దాదాపు 800 మందికి ఆర్థిక సాయం జమ కాలేదు. దీంతో వారు దేవదాయశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 


అర్హతలున్నా ఆర్థికసాయం అందలేదు

    - కుమారస్వామి, పూజారి, కొర్రకోడు.

30 సంవత్సరాలుగా అర్చకత్వం కొనసాగుతున్నాను. కరోనా కాలంలో ఆలయం మూతపడింది. సకాలంలో వేతనాలు కూడా అందలేదు. ఇ లాంటి సమయంలో రాష్ట్ర ప్ర భుత్వం కరోనా ఆర్థిక సాయం కోసం మండల కన్వీనర్‌ రాజశేఖర్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. అయితే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆర్థిక సాయం అందలేదు. 

   


ఫిర్యాదు చేసిన దక్కని ఫలితం

   - కృష్ణకుమార్‌, తపోవనం.

నాలుగు సంవత్సరాలుగా మార్కండేయస్వామి దేవాలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నా. ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకోగా జాబితాలో బ్యాంకు ఖాతా నెంబరును అధికారులు తప్పుగా నమోదు చేశారు. దీంతో ఆర్థికసాయం అందకుండా పోయింది. దేవదాయశాఖ కార్యాలయానికి వెళ్లి ఆర్థికసాయం మంజూరు చేయాలని అధికారులకు విన్నవించుకున్నాం. 

                     


విచారణ చేపడతాం

 - రామాంజనేయులు, సహాయ కమిషనర్‌.

అర్చకుల వివరాల సేకరణ బాధ్యతను కార్యనిర్వహణాధికారులకు అప్పగించగా, వారు అర్చక సంఘాల సహకారంతో వివరాలను సేకరించారు. ఎక్కడైనా తప్పిదాలు జరిగుంటే వా టిపై విచారణ జరిపి, నివేదికను రాష్ట్ర అధికారులకు పంపుతాం. అనర్హులకు ఆర్థికసాయం అందింటే, ఆ సొమ్ము వెనక్కు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.

   

Advertisement
Advertisement
Advertisement