ఫ్రాన్స్ లక్ష్యం 20వేల మంది భారత విద్యార్థులు..

ABN , First Publish Date - 2021-04-14T15:11:29+05:30 IST

2025 నాటికి తమ దేశంలో 20వేల మంది భారతీయ విద్యార్థులు ఉండాలనేదే తమ లక్ష్యమని భారత్‌లో పర్యటిస్తున్న ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ వైవ్స్ లే డ్రియాన్ అన్నారు.

ఫ్రాన్స్ లక్ష్యం 20వేల మంది భారత విద్యార్థులు..

న్యూఢిల్లీ: 2025 నాటికి తమ దేశంలో 20వేల మంది భారతీయ విద్యార్థులు ఉండాలనేదే తమ లక్ష్యమని భారత్‌లో పర్యటిస్తున్న ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ వైవ్స్ లే డ్రియాన్ అన్నారు. 2019లో 10వేల మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుతున్నారని ఈ సందర్భంగా ఫ్రెంచ్ ఎంబసీ అధికారులు వెల్లడించారు. "2025 నాటికి ఫ్రాన్స్‌లో 20వేల మంది భారత విద్యార్థులు ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామనే నమ్మకం ఉంది. మా విద్యార్థులకు దాదాపు సమానంగా భారత విద్యార్థులు ఉండాలనేది మా ఆలోచన." అని మంత్రి లే డ్రియాన్ తెలిపారు. ఫ్రాన్స్‌కు ఉన్నత విద్యా కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించడంలో ఎల్లప్పుడూ తమ పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. మంగళవారం ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య విద్యార్థుల చైతన్యాన్ని పెంచడానికి ప్రతిష్టాత్మక ఫ్రాన్స్ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ నుండి 15 మంది రాయబారులను ఎంపిక చేసినట్లు తెలియజేశారు. ఈ సమావేశానికి వచ్చే ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో పలు విషయాలపై చర్చించినట్లు లే డ్రియాన్ పేర్కొన్నారు. కాగా, ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన మంత్రి లే డ్రియాన్ ఇప్పటికే  విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు. అలాగే ప్రధాని మోదీతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు.    

Updated Date - 2021-04-14T15:11:29+05:30 IST