Google news: గూగుల్‌కు 4.4 వేల కోట్లకు పైగా భారీ జరిమానా!

ABN , First Publish Date - 2021-07-13T23:22:29+05:30 IST

గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. ఫ్రాన్స్‌కు చెందిన కాంపిటిషన్ రెగ్యులేటర్ గూగుల్‌పై ఏకంగా 500 మిలియన్ యూరోల(దాదాపు రూ. 4451 కోట్లు) జరిమానా విధించింది.

Google news: గూగుల్‌కు 4.4 వేల కోట్లకు పైగా భారీ జరిమానా!

పారిస్: గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. ఫ్రాన్స్‌కు చెందిన కాంపిటిషన్ రెగ్యులేటర్ గూగుల్‌పై ఏకంగా 500 మిలియన్ యూరోల(దాదాపు రూ. 4451 కోట్లు) జరిమానా విధించింది. ఐరోపా సమాఖ్య కాపీరైట్ చట్టం ఉల్లంఘన కేసులో సంస్థపై ఫ్రాన్స్ ఇంతటి భారీ జరిమానా విధించింది. తమకు తగినంత పరిహారం చెల్లించకుండానే గూగుల్ తన సెర్చ్ ఫలితాల్లో వార్తలను చూపెడుతోందని, దీని వల్ల గూగుల్ సంస్థ ప్రాచుర్యం పెరిగినా తమకు ఎటువంటి లాభం చేకూరలేదని మీడియా సంస్థలు గతంలో ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటరీ సంస్థను ఆశ్రయించాయి. యాడ్లపై వచ్చే ఆదాయంలో అధిక భాగం గూగుల్‌కు వెళుతుండగా తాము నష్టపోతున్నామని పేర్కొన్నాయి. 


కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ న్యాయపోరాటంలో ఫలితం తాజాగా గూగుల్‌కు వ్యతిరేకంగా వచ్చింది. మీడియా కంపెనీలకు ఇచ్చే పరిహారంపై గూగుల్ నిజాయతీగా చర్చలు జరపలేదని కాంపిటీషన్ రెగ్యులేటర్ ఈ సందర్భంగా పేర్కొంది. తాము ఇప్పటివరకూ విధించిన జరిమానాల్లో ఇదే అత్యధికమని కూడా వ్యాఖ్యానించింది. వార్తలను వినియోగించుకున్నందుకు మీడియా సంస్థలకు ఎంత మొత్తం ఇవ్వాలనే దానిపై ఓ ప్రతిపాదన ఇవ్వాలని, అలా జరగని పక్షంలో అదనపు జరిమానాగా రోజుకు 900,000 యూరోలు చెల్లించాలని కూడా స్పష్టం చేసింది. కాగా.. ఈ ఆదేశాలపై గూగుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘మీడియా సంస్థలతో చర్చల సందర్భంగా మేం అత్యంత నిజాయితీతో వ్యవహరించాం. గూగుల్‌లో వార్తల వినియోగానికి సంబంధించిన వాస్తవ పరిస్థితి, చర్చల సందర్భంగా తాము ప్రదర్శించిన నిబద్ధతకు ఈ తీర్పు తగినది కాదు’’ అని గూగుల్ ఓ ప్రకటన విడుదల చేసింది. 

Updated Date - 2021-07-13T23:22:29+05:30 IST