అక్రమానికి అందలం

ABN , First Publish Date - 2021-09-09T06:00:40+05:30 IST

అక్రమానికి అందలం

అక్రమానికి అందలం

పామాయిల్‌ మొక్కల పంపిణీలో ఓ అధికారి చేతివాటం

లెక్కతేలని రూ.50లక్షల విలువైన మొక్కలు

సర్వీస్‌ రిజిస్టర్‌లో రిమార్క్‌ రాసిన అప్పటి ఎండీ

రూ.40లక్షల రికవరీకి చైర్మన్‌ సిఫారసు 

అయినా అడ్డదారిలో ఉద్యోగోన్నతి

ఆయిల్‌ఫెడ్‌లో వెలుగుచూస్తున్న సిత్రాలు

అశ్వారావుపేట, సెప్టెంబరు 8: వేలాది మంది పామాయిల్‌ రైతుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఆయిల్‌ఫెడ్‌లో అక్రమార్కులను అడ్డదారిలో అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయిల్‌ఫెడ్‌ వ్యవహారాలపై నిత్యం ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉండగా.. తాజాగా రైతులంతా విస్తుపోయే సంఘటన ఒకటి జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.50 లక్షల విలువైన పామాయిల్‌ మొక్కలను మాయం చేసి చేతివాటాన్ని ప్రదర్శించిన ఓ అధికారికి ఏకంగా ఉద్యోగోన్నతి కల్పించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం అశ్వారావుపేట ఆయిల్‌ఫెడ్‌ డివిజన్‌ కార్యాలయంలో పనిచేసిన ఓ అధికారి సుమారు రూ.80లక్షల విలువైన ఆయిల్‌పామ్‌ మొక్కలను అక్రమ మార్గంలో అమ్మేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు నర్సరీలో కూలీల పనికి సంబంధించిన మస్టర్లు, చెల్లింపులకు పొంతన లేకుండా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అవన్నీ కలసి సుమారు రూ.కోటి మేర సదరు అధికారి అక్రమాలకు పాల్పడినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో ఆయిల్‌ఫెడ్‌ ఎండీ, చైర్మన్‌, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్‌కు పిలిపించి గట్టిగా నిలదీయటంతో సంబంధిత అధికారి లెక్క చెప్పకుండా విసురుగా రికార్డులు

వదిలేసి వెళ్లిపోయినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ఎండీ అతడిని ఆ విధులనుంచి తప్పించి అశ్వారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీ 

మేనేజర్‌గా పనిచేస్తున్న బాలకృష్ణకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగించారు. ఇన్‌చార్జ్‌గా వచ్చిన అధికారికూడా రిజిస్టర్‌లో తేడాలున్న మొక్కల నిల్వతో సంబంధం లేకుండా కేవలం 5వేల మొక్కలతోనే బాధ్యతలు అప్పగిస్తేనే బాధ్యతలు తీసుకుంటాననే షరతుతో బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్లో అధికారులందరూ కలిసి సుమారు రూ.40లక్షలను ఆ అధికారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై ఆయిల్‌ఫెడ్‌కు సిపారసు చేసినట్లు ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల 

రామకృష్ణారెడ్డి కూడా అనేక  విలేకరుల సమావేశాల్లో వెల్లడించారు. అప్పటి ఎండీ కూడా సంబంధిత అధికారి సర్వీస్‌ రిజిస్టర్‌లో రిమార్క్‌ రాయడమే కాకుండా, అతడికి ఉద్యోగోన్నతి ఇవ్వడానికి నిరాకరించినట్టు సమాచారం. 

అడ్డదారిలో ఉద్యోగోన్నతి 

ఆ తరువాత కాలంలో సదరు అధికారి కాజేసిన సొమ్మును రికవరీ చేయలేదు. ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. అంతేకాకుండా తదనంతర పరిణామాల్లో అతడికి ఉద్యోగోన్నతి కూడా కల్పించినట్టు తెలు స్తోంది. ప్రస్తుత ఎండీ కూడా అతడికి ఉద్యోగోన్నతి కల్పించడానికి అంగీకరించకపోవడంతో విచారణ కోసం వేసిన కమిటీ ద్వారా క్లీన్‌చిట్‌ ఇచ్చి, ఆ నివేదిక ఆధారంగా సదరు అధికారికి ఉద్యోగోన్నతి కల్పించినట్టు తెలుస్తోంది. స్వయంగా ఎండీ రాసిని రిమార్కులు, చైర్మన్‌ చేసిన సిపారసులన్నీ బుట్టదాఖలు చేసిమరీ ఉద్యోగోన్నతి కల్పించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రైతుల అనుమానాలకు మరింత ఊతం ఇచ్చింది.

విచారణ జరుగుతోంది 

రామకృష్ణారెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ 

ఆయిల్‌ఫెడ్‌ డివిజన్‌ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై విచారణ కొనసాగుతోంది. గతంలోనే అతడిపై చర్యల్లో భాగంగా బదిలీ చేశాం, సొమ్ము రికవరీకి ఆదేశించాం. అవినీతికి ఆస్కారం లేకుండా ఆయిల్‌ఫెడ్‌ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తోంది. 

Updated Date - 2021-09-09T06:00:40+05:30 IST