బతికుండగానే చంపేశారు.. చనిపోయిన జాబితాలో ఆసరా లబ్ధిదారులు

ABN , First Publish Date - 2020-05-22T18:51:44+05:30 IST

జిల్లాలోని తొమ్మిది మంది ఆసరా లబ్ధిదారులు బతికుండగానే చనిపోయినవారి జాబితాలో చేర్చి ఆసరా పింఛన్‌ను రద్దు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ జంపాల ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బతికుండగానే చంపేశారు.. చనిపోయిన జాబితాలో ఆసరా లబ్ధిదారులు

అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు


మహబూబాబాద్‌(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తొమ్మిది మంది ఆసరా లబ్ధిదారులు బతికుండగానే చనిపోయినవారి జాబితాలో చేర్చి ఆసరా పింఛన్‌ను రద్దు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ జంపాల ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గురువారం ఫిర్యాదు చేశారు. ఆ ప్రతులు, వివరాలను మహబూబాబాద్‌లో విలేకరులకు అందజేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 


గార్ల మండలం జీవంజిపల్లికి చెందిన మాచర్ల వెంకటాచలం తండ్రి బాలయ్య, డోర్నకల్‌ మండలం బోడ్రాయితండాకు చెందిన తేజావత్‌ సాలి భర్త బాల్య, బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన బనోత్‌ సక్రు తండ్రి సక్రు, కురవి మండలం గుండ్రాతిమడుగుకు చెందిన బసవ నారాయణ తండ్రి తిరుపతయ్య, మరిపెడ మండలం గుండెపుడికి చెందిన గుండగాని వెంకన్న తండ్రి రోశయ్య, ఎడ్జెర్లకు చెందిన నలమాస పుల్లయ్య, తండ్రి నర్సయ్య, చిన్నగూడూరు మండలం మంగొలితండాకు చెందిన బానోత్‌ ద్వాలి, భర్త రాంసింగ్‌, నెల్లికుదురు మండ లం రాజులకొత్తపల్లికి చెందిన కొండా రామయ్య తండ్రి నర్సయ్య, గూడూరు మండలం సీతానాగారానికి చెందిన గుండగాని సత్తయ్య తండ్రి చంద్రయ్య.. ఇలా తొమ్మిది మంది ఆసరా పింఛన్‌ లబ్ధిదారుల పేర్లను స్థానికంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బతికుండగానే చనిపోయిన వారి జాబితాలో చేర్చారు.


జనవరి 2020 నుంచి వారికి ఆసరా పింఛన్‌ను రద్దు చేశారు. బాధితుల్లో దివ్యాంగులు, వయోవృద్ధులు, భర్త చనిపోయిన వారు ఉన్నారని, వారు ఐదు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికి వారికి న్యాయం జరగలేదని విశ్వ తెలిపా రు. లాక్‌డౌన్‌ సమయంలో పింఛన్‌ ఆగిపోవడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తున్నదని వాపోయారు. దీనికి స్థానిక అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుపుతూ.. ప్రస్తుతం వీరి ఫైలు సెర్ప్‌ రాష్ట్ర కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు విశ్వ తెలిపారు.

Updated Date - 2020-05-22T18:51:44+05:30 IST