సర్కార్‌ వారి మాయ!

ABN , First Publish Date - 2020-12-02T06:13:56+05:30 IST

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం చేపట్టిన..

సర్కార్‌ వారి మాయ!
కశింకోట మండలం తేగాడలో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన అసైన్డ్‌ భూమి

ఇళ్ల స్థలాలకు భూసేకరణలో నిబంధనలకు తూట్లు

రైతులకు నష్టపరిహారం చెల్లింపులో దగా

కశింకోట మండలంలో 9.82 ఎకరాలు జిరాయితీ, 15.84 ఎకరాలు అసైన్డు భూమి సేకరణ

ఒక్క రైతుకు కూడా 2013 చట్టం ప్రకారం అందని పరిహారం

రిజిస్ట్రేషన్‌ విలువకు రెండున్నర రెట్లు అదనంగా చెల్లించాలని నిబంధన

ఆ లెక్కన రైతులకు అందాల్సింది రూ.16.72 కోట్లు

ప్రభుత్వం చెల్లించింది రూ.11.4 కోట్లే!

31 శాతానికిపైగా ఎగనామం

రెవెన్యూ అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కు

ఫార్మాలిటీస్‌ పేరుతో నిర్వాసితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు 


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణలో అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోంది. భూములు కోల్పోయిన వారికి అందజేసిన పరిహారాన్ని బట్టి నిర్వాసితుల నుంచి కనిష్ఠంగా రూ.5 వేలు, గరిష్ఠంగా రూ.లక్ష దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు భూసేకరణ చట్టం-2013 ప్రకారం ఆయా రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు.


నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూమి అందుబాటులో లేని గ్రామాల్లో అసైన్డ్‌ భూములు, జిరాయితీ భూములను అధికారులు సేకరించారు. భూ సేకరణ చట్టం-2013 ప్రకారం భూములు ఇచ్చిన రైతులకు అక్కడి ప్రభుత్వ ధర (రిజిస్ట్రేషన్‌ విలువ)కు రెండున్నర రెట్లు పరిహారంగా ఇవ్వాలి. ఉదాహరణకు ఒక సర్వే నంబర్‌లో ఎకరా భూమి రిజిస్ర్టేషన్‌ విలువ రూ.10 లక్షలు వుందనుకుంటే...ప్రభుత్వం రూ.35 లక్షలు ఇవ్వాలి. కానీ కశింకోట మండలంలో అలా జరగలేదు. జిరాయితీతోపాటు పేదలు సాగు చేసుకుంటున్న భూములను సేకరించిన అధికారులు...ఒక్క రైతుకు కూడా భూసేకరణ చట్టం-2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ మండలంలో కశింకోటలో 9.82 ఎకరాలు జిరాయితీ, అడ్డాం, చింతలపాలెం, తేగాడ, నూతనగుంటపాలెం, ఈశ్వరపల్లి చౌడువాడ (కన్నూరుపాలెం) గ్రామాల్లో 15.84 ఎకరాలు అసైన్డ్‌ భూములను ప్రభుత్వం సేకరించింది. జిరాయితీ భూములకు రిజిస్ట్రేషన్‌ విలువకు రెండున్నర  రెట్లు కలుపుకుంటే రూ.8.59 కోట్లు చెల్లించాలి. కానీ ఆయా రైతులకు రూ.6.48 కోట్లు మాత్రమే అందాయి. ఇక అసైన్డ్‌ భూములకు ఆయా ప్రాంతాల్లో వున్న రిజిస్ర్టేషన్‌ విలువకు రెండున్నర రెట్లు కలుపుకుంటే మొత్తం రూ.8.15 కోట్ల వరకు సాగుదారులకు అందాలి. కానీ రూ.4.92 కోట్లు మాత్రమే అందాయి. మొత్తంగా చూస్తే రూ.16.72 కోట్లకుగాను ఆయా భూనిర్వాసితులకు (జిరాయితీ, అసైన్డ్‌ కలిపి) రూ.11.4 కోట్లు మాత్రమే అందాయి. రూ.5.31 కోట్ల మేర ప్రభుత్వం ఎగవేసినట్టు అవగతం అవుతున్నది. కాగా రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పి ఇటు రెవెన్యూ అధికారులు, ఇటు వైసీపీ నాయకులు ‘ఫార్మాలిటీస్‌’ పేరుతో కొంత మొత్తాన్ని నొక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూములు కోల్పోయిన రైతులకు భూసేకరణ చట్టం-2013పై అవగాహన లేకపోవడాన్ని అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు తమకు అనుకూలంగా మలచుకున్నట్టు తెలిసింది. రైతులు..‘ప్రభుత్వం భూమి తీసుకొని డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఎంతో కొంత వచ్చింది!’’ అని అంటున్నారే తప్ప, అసలు సంగతి బయటకు చెప్పడం లేదు.


ఏ గ్రామంలో ఎంత భూమి/నష్టపరిహారం...

కశింకోటలోని సర్వే నంబర్లు 85లో 1.37 ఎకరాలు, 82, 87ల్లో 3.45 ఎకరాలు, సర్వే నంబర్లు 93/1, 145/6, 145/7, 147/1లో ఐదు ఎకరాలు...మొత్తం 9.82 ఎకరాల జిరాయితీ భూమిని సేకరించారు. ఆయా సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం ఎకరా రూ.25 లక్షలు ఉంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.87.5 లక్షలు చెల్లించాలి. కానీ రూ.66 లక్షల చొప్పున చెల్లించారు. ఎకరాకు రూ.21.5 లక్షల చొప్పున రైతులు నష్టపోయారు. 


చింతలపాలెం సర్వే నంబరు 163లోని పలు సబ్‌డివిజన్లలో 54 మంది లబ్ధిదారుల నుంచి 7.15 ఎకరాల అసైన్డు భూమిని సేకరించారు. రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం ఎకరా రూ.14 లక్షలు ఉంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం లబ్ధిదారులకు ఎకరాకు రూ.49 లక్షల చొప్పున చెల్లించాలి. ప్రభుత్వం రూ.25.98 లక్షల చొప్పున చెల్లించింది. అంటే ఎకరాకు రూ.23.02 లక్షల మేర రైతులు కోల్పోయారు.


తేగాడ సర్వే నంబరు 103లోని పలు సబ్‌డివిజన్లలో 2.25 ఎకరాల అసైన్డు భూమి సేకరించారు. రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం ఎకరా రూ.10 లక్షలు ఉంది. సాగుదారులకు రూ.35 లక్షల చొప్పున చెల్లించాలి. కానీ ప్రభుత్వం రూ.27.53 లక్షల చొప్పున చెల్లించింది. ఎకరాకు రూ.7.47 లక్షల చొప్పున రైతులు నష్టపోయారు. నూతనగుంటపాలెం సర్వే నంబర్లు 343/2, 343/4, 343/5లో 3.78 ఎకరాల అసైన్డ్‌ భూమి సేకరించారు. రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం ఎకరా రూ.22 లక్షలు. సాగుదారులకు రూ.77 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. కానీ రూ.49.57 లక్షల చొప్పునే అందాయి. ఎకరాకు రూ.27.43 లక్షల చొప్పున నష్టపోయారు.


అడ్డాం సర్వే నంబరు 183/4లో 1.18 ఎకరాల అసైన్డ్‌ భూమి సేకరించారు. రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం ఎకరా రూ.10 లక్షలు. భూ నిర్వాసితులకు రూ.35 లక్షల వంతున చెల్లించాలి. ప్రభుత్వం రూ.21.64 లక్షలు మాత్రమే ఇచ్చింది.  రైతులు ఎకరాకు రూ.13.36 లక్షల చొప్పున నష్టపోయారు. ఈశ్వరపల్లి చౌడువాడ (కన్నూరుపాలెం) సర్వే నంబరు 237/1లో 1.48 ఎకరాల అసైన్డుభూమి సేకరించారు. రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం ఎకరా రూ.10 లక్షలు. ఈ ప్రకారం రైతులకు రూ.35 లక్షల వంతున చెల్లించాలి. ప్రభుత్వం రూ.21.64 లక్షల చొప్పున చెల్లించింది. రైతులు ఎకరాకు రూ.13.36 లక్షల మేర నష్టపోయారు.


ఎంత పరిహారం దక్కాలో మాకు అవగాహన లేదు: నెలిముక నిర్మల, అసైన్డు భూమి సాగుదారు, తేగాడ

నాకు తేగాడ దత్తాత్రేయ గుడి ఎదురుగా రోడ్డుపక్కన ఎకరా భూమి ఉంది. చాలా ఏళ్ల నుంచి ఈ భూమిని సాగుచేసుకుంటూ జీవనో పాధి పొందుతున్నాం. ఇళ్ల స్థలాల కోసం భూమిని తీసేసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు. అసైన్డ్‌ భూమి కావడంతో అభ్యంతరం చెప్పలేదు. ఎకరాకి రూ.21.65 లక్షలు ఇచ్చారు. ఎంత పరిహారం అందుతుందో మాకు అవగాహన లేదు.



Updated Date - 2020-12-02T06:13:56+05:30 IST