శ్రీవారి దర్శనం పేరుతో మోసం

ABN , First Publish Date - 2021-08-03T07:17:13+05:30 IST

శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా వేసి అధిక మొత్తాలను దండుకుంటున్న నిందితుడిని ఈస్ట్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు.

శ్రీవారి దర్శనం పేరుతో మోసం
నిందితుడిని చూపుతూ వివరాలు వెల్లడిస్తున్న ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి

చెన్నైకి చెందిన నిందితుడిని అరెస్ట్‌చేసిన ఈస్ట్‌ పోలీసులు


తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 2: శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా వేసి అధిక మొత్తాలను దండుకుంటున్న నిందితుడిని ఈస్ట్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన మేరకు.. చైన్నై భారతీనగర్‌కు చెందిన దివాకర్‌ పార్థసారధి.. ‘రేవతి పద్మావతి’ పేరిట ట్రావెల్స్‌ నిర్వహిస్తున్నాడు. ప్యాకేజీ రూపంలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశాడు. ఒక భక్తుడికి శ్రీవారి దర్శనం కల్పించేందుకుగాను రూ. 2500 తీసుకునేవాడు. దీనిని గమనించిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ముందుగా దివాకర్‌ను సంప్రదించారు. భక్తుల్లాగా మాట్లాడి దర్శనం టికెట్ల కోసం అడిగారు. ఒకరికి రూ.5 వేల చొప్పున దివాకర్‌ డిమాండ్‌ చేశాడు. ఇతడి మోసాన్ని రూఢి చేసుకున్న విజిలెన్స్‌ అధికారులు తిరుపతి ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రకాష్‌కుమార్‌ చెన్నై వెళ్లి దివాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దివాకర్‌పై కేసు నమోదుచేసినట్టు సీఐ వెల్లడించారు.

Updated Date - 2021-08-03T07:17:13+05:30 IST