Advertisement
Advertisement
Abn logo
Advertisement

మ్యాట్రిమోనిలో పరిచయం.. Whatsappలో చాటింగ్.. అనుకోకుండా లండన్ నుంచి ఫోన్ కాల్.. చివరికి...!

  • పెళ్లి చేసుకుంటానంటూ మోసం
  • యువతి నుంచి రూ. 93,250 కాజేసిన కేటుగాడు

హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : వివాహ పరిచయ వేదిక వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌ సృష్టించాడు. పెళ్లి చేసుకున్న తర్వాత లండన్‌లో వైద్యుడిగా పనిచేస్తానని చెప్పి నగరానికి చెందిన ఓ యువతిని నమ్మించి మోసం చేశాడు ఓ కేటుగాడు. లండన్‌ నుంచి విలువైన వస్తువులు, నగదు పార్శిల్‌ పంపించానని, ఢిల్లీలో కస్టమ్స్‌ వారు పట్టుకున్నారని పలు దఫాలుగా ఆమె నుంచి రూ. 93,250 కాజేశాడు. ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ కాలనీకి చెందిన లిల్లీ బాలసాని(28)ప్రైవేట్‌ ఉద్యోగిని.

కొద్ది రోజుల క్రితం క్రిస్టియన్‌ మ్యాట్రిమోని డాట్‌కామ్‌ అనే వెబ్‌సైట్‌లో ఆంథోని సి వర్మ అనే వ్యక్తి ప్రొఫైల్‌ చూసింది. ప్రొఫైల్‌ నచ్చడంతో ఆమె అతడితో వాట్సా్‌ప్‌లో చాటింగ్‌ చేసింది. తనకు పెళ్లి కాలేదని, లండన్‌లో ఓ వైద్య కళాశాలలో డాక్టర్‌ కోర్సు చదువుతున్నానని, పూర్తయిన తర్వాత ఇండియా వచ్చి వివాహం చేసుకుంటానని, తిరిగి లండన్‌ వెళ్లి వైద్యుడిగా పనిచేస్తానని చెప్పాడు. అతడు తన ఫొటోలు కాకుండా మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు వాట్సా్‌ప్‌లో పెట్టాడు. ఓ రోజు అతడు ఆమెకు మెసేజ్‌ పెట్టాడు. ఇంటి చిరునామా చెబితే పార్శిల్‌ పంపిస్తానన్నాడు. ఆమె చిరునామా, వివరాలు అతడికి పంపించింది. తర్వాత ఆమె మెయిల్‌కు పార్శిల్‌ ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ విభాగం వద్ద ఉంది, పన్ను కడితే రిలీజ్‌ చేస్తారని మెసేజ్‌ చేశాడు.

అక్కడ రహీం దెబ్రామా అనే వ్యక్తి సహాయం చేస్తాడన్నాడు. కొద్దిసేపటి తర్వాత రహీం ఆమెకు ఫోన్‌ చేశాడు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి మాట్లాడుతున్నానని, మీకు పార్శిల్‌ వచ్చింది.. పన్ను కట్టాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఆమె ఈనెల 12న ఆనంద్‌నగర్‌ ఎస్‌బీఐలో చంద్రలీల ఖాతా నుంచి రూ. 68,500  ఒకసారి, రెండోసారి రూ. 4,750, మాసబ్‌ట్యాంక్‌ యాక్సిస్‌ బ్యాంక్‌లో ఎల్‌. బాలసాని ఖాతా నుంచి రూ. 20 వేలు రహీం చెప్పిన ఖాతాకు పంపించింది. రహీం మరలా ఫోన్‌ చేసి మరో లక్ష రూపాయలు పంపితేనే నగదు, వస్తువులతో ఉన్న పార్శిల్‌ కస్టమ్స్‌ క్లియరెన్స్‌ వచ్చి బయటకు వస్తుందని చెప్పాడు. అనుమానం వచ్చిన ఆమె మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయం అయిన ఆంథోని సి వర్మ ప్రొఫైల్‌ క్షుణ్ణంగా తనిఖీ చేయగా నకిలీదని తేలింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement