విదేశాల నుంచి వచ్చే వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2021-02-28T01:39:55+05:30 IST

ప్రవాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచితంగా కొవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయనున్నట్టు ఆరోగ్యశాఖమంత్రి ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిజిల్, దక్షి

విదేశాల నుంచి వచ్చే వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్!

తిరువనంతపురం: ప్రవాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచితంగా కొవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయనున్నట్టు ఆరోగ్యశాఖమంత్రి ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వైరస్‌లు బయటపడటం.. అవి ఇండియాలోకి కూడా వ్యాపించడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న ప్రయాణికులకు ఉద్దేశించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి ఈ నెల 23 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు వయసుతో సంబంధం లేకుండా ప్రయాణానికి 72 గంటల ముందుగా చేయించుకున్న కరోనా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్‌ను ఎయిర్ సువిధా పోర్టల్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్‌లో కరోనా లక్షణాలు లేకపోతేనే విమానం ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది. అంతేకాకుండా విదేశాల నుంచి భారత్ చేరుకున్న ప్రయాణికులు.. విమానం దిగిన వెంటనే సొంత ఖర్చుతో ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.



కాగా.. ఈ నిబంధనలు విదేశాల నుంచి వచ్చే వారికి ఇబ్బందికరంగా మారాయి. ప్రత్యేకించి.. భారత్‌కు చేరుకున్న తర్వాత కూడా సొంత ఖర్చుతో మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోవాలనే నిబంధన.. వారికి ఆర్థికంగా భారమైంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలు ప్రవాస భారతీయ సంఘాలు తమ గళాన్ని వినిపించాయి. ముఖ్యంగా యూఏఈలోని ప్రవాసులు కేంద్ర ప్రభుత్వం వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి స్వదేశానికి తిరిగి వస్తున్న తమకు ఇక్కడ మరోసారి పీసీఆర్ టెస్టు కోసం వెచ్చించడం తలకు మించిన భారంగా పరిణమిస్తుందని ప్రవాసులు వాపోయారు. కనుక స్వదేశానికి చేరుకున్న తర్వాత చేసే ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు ఖర్చులను ప్రభుత్వమే భరించాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో వారి వేదనను కేరళ ప్రభుత్వం అర్థం చేసుకుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచితంగా కొవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ ప్రకటించారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని షార్జాకు చెందిన ప్రవాసి బంధు వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యుడు స్వాగతిస్తూ.. సీఎం పినరయ్ విజయన్‌కు ధన్యావాదాలు తెలిపారు. అంతేకాండా.. కేరళను ఆదర్శంగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా విదేశీ ప్రయాణికుల కొవిడ్ పరీక్షల ఖర్చును భరించాలని కోరారు. 


Updated Date - 2021-02-28T01:39:55+05:30 IST