ఫైనల్లో కెనిన్ వర్సెస్ ‌ స్వియటెక్‌

ABN , First Publish Date - 2020-10-09T09:34:09+05:30 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత సోఫియా కెనిన్‌.. కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరుకొంది. సెమీ్‌సలో ఏడో సీడ్‌ పెట్రా...

ఫైనల్లో కెనిన్ వర్సెస్ ‌ స్వియటెక్‌

సెమీ్‌సలో క్విటోవా, పొడొరోస్కా ఓటమి

ఫ్రెంచ్‌ ఓపెన్‌


పారిస్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత సోఫియా కెనిన్‌.. కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరుకొంది. సెమీ్‌సలో ఏడో సీడ్‌ పెట్రా క్విటోవాను చిత్తు చేసింది. కాగా, పోలెండ్‌ టీనేజర్‌ ఈగా స్వియటెక్‌ గెలుపు జోరును కొనసాగిస్తోంది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి ఏకంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్స్‌లో మరో సంచలన తార నదియా పొడొరోస్కా (అర్జెంటీనా)పై స్వియటెక్‌ అద్భుత విజయం సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో నాలు గో సీడ్‌ కెనిన్‌తో స్వియటెక్‌ అమీతుమీ తేల్చుకోనుంది.

కెనిన్‌ హవా..: సీడెడ్ల మధ్య జరిగిన పోరులో అమెరికా ప్లేయర్‌ కెనిన్‌ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన సెమీస్‌లో కెనిన్‌ 6-4, 7-5తో ఏడో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై నెగ్గింది. తొలి సెట్‌ మూడో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన కెనిన్‌ 6-4తో సెట్‌ను తన ఖాతాలో వేసుకొంది. ఇక రెండో సెట్‌లో కెనిన్‌ 5-4తో ఉన్నప్పుడు.. ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన క్విటోవా 5-5తో సమం చేసింది. మ్యాచ్‌ను మలుపుతిప్పే అవకాశం చెక్‌ భామకు లభించినా.. సద్వినియోగం చేసుకోలేక పోయింది. వరుసగా రెండు గేమ్‌లు నెగ్గిన కెనిన్‌ 7-5తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొంది.  

కనీస పోటీలేదు..: అన్‌సీడెడ్‌ ప్లేయర్ల మధ్య జరిగిన మరో సెమీస్‌ మ్యాచ్‌లో స్వియటెక్‌ అదరగొట్టింది. 69 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల స్వియటెక్‌ 6-2, 6-1తో పొడొరోస్కాపై అలవోకగా నెగ్గింది. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగి ఊహించని విధంగా సెమీస్‌ చేరిన పొడొరోస్కా.. అదే తరహా ఆటను ప్రదర్శించలేక పోయింది. తొలి సెట్‌ రెండో గేమ్‌లోనే పొడొరోస్కా సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన స్వియటెక్‌ 2-0తో పైచేయి సాధించింది. ఆ తర్వాత ఇద్దరూ తమతమ సర్వీసులను నిలబెట్టుకోవడంతో ఈగా 5-2తో నిలిచింది. ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీ్‌సను మరోసారి బ్రేక్‌ చేసిన స్వియటెక్‌ 6-2తో సెట్‌ను కైవసం చేసుకొంది. రెండో సెట్‌లో రెండు సార్లు పొడొరోస్కా సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన పొలెండ్‌ క్రీడాకారిణి 4-0తో ముందంజ వేసింది. అయితే, ఐదో గేమ్‌లో ఈగా సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన నదియా 1-4తో మ్యాచ్‌లోకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ, తర్వాతి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీ్‌సను మరోసారి బ్రేక్‌ చేసిన స్వియటెక్‌ 5-1తో ముందంజ వేసింది. తర్వాతి గేమ్‌ను నెగ్గి 6-1తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. 


జొకో పోరాటం..

ఎడమ చేతి నొప్పి.. అప్పటికే ఒక సెట్‌ వెనుకబడ్డాడు.. అయినా సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించాడు. పదోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీ్‌సకు చేరిన జొకో.. ఫైనల్‌ బెర్త్‌ కోసం సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. బుధవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ జొకో 4-6, 6-2, 6-3, 6-4తో 17వ సీడ్‌ పాబ్లో కర్రెనో బుస్టా (స్పెయిన్‌)ను ఓడించాడు. 3 గంటల 13 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో శరీరం సహకరించకున్నా నొవాక్‌ మాత్రం స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో         ఆకట్టుకున్నాడు. 

Updated Date - 2020-10-09T09:34:09+05:30 IST