సబలెంకా అవుట్‌

ABN , First Publish Date - 2021-06-05T06:08:22+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో దూసుకుపోతున్నాడు. మరో సునాయాస విజయంతో మూడో రౌండ్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ అర్యానా సబలెంకా మూడో రౌండ్‌లో ఓటమి చవిచూడగా, మాజీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ విక్టోరియా అజరెంకా ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి రొలాండ్‌

సబలెంకా అవుట్‌

నడాల్‌ మరో అడుగు

ప్రీక్వార్టర్స్‌లో సెరెనా, అజరెంకా

జ్వెరేవ్‌, మెద్వెదేవ్‌ కూడా

ఫ్రెంచ్‌ ఓపెన్‌ 


పారిస్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో దూసుకుపోతున్నాడు. మరో సునాయాస విజయంతో మూడో రౌండ్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ అర్యానా సబలెంకా మూడో రౌండ్‌లో ఓటమి చవిచూడగా, మాజీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ విక్టోరియా అజరెంకా ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి రొలాండ్‌ గారో్‌సలో ప్రీక్వార్టర్స్‌కు చేరింది. ఏడో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ కూడా మూడో రౌండ్‌ గెలుపుతో ముందంజ వేసింది. అలాగే పురుషుల్లో రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌, ఆరోసీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌, 12వ సీడ్‌ కరెనో బుస్టా, జపాన్‌ స్టార్‌ కీ నిషికోరి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. 


విక్టరీ 102: స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ 35వ బర్త్‌డేను స్పెషల్‌గా జరుపుకొన్నాడు. శుక్రవారం జరిగిన రెండోరౌండ్‌లో స్థానిక ఆటగాడు రిచర్డ్‌ గాస్కెట్‌ను 6-0, 7-5, 6-2 స్కోరుతో చిత్తుచేసిన మూడో సీడ్‌ నడాల్‌..అతడిపై తన ఆధిక్యాన్ని 17-0కి పెంచుకున్నాడు. అలాగే ఓపెన్‌ ఎరాలో ఓ ప్రత్యర్థిపై 17-0 రికార్డు కలిగిన బోర్గ్‌, జొకోవిచ్‌, ఫెడరర్‌, ఇవాన్‌ లెండిల్‌ సరసన నడాల్‌ చేరాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నడాల్‌కు ఈ విజయం 102వది కావడం విశేషం. 


అర్యానాకు అనస్టాసియా షాక్‌: మహిళల సింగిల్స్‌లో మూడోసీడ్‌ అర్యానా సబలెంకా (బెలారస్‌) మూడో రౌండ్‌లో ఓటమితో టోర్నీనుంచి నిష్క్రమించింది. రష్యాకు చెందిన 31వ సీడ్‌ అనస్టాసియా ప్లవ్యుచెన్కోవా 6-4, 2-6, 6-0తో అర్యానాకు షాకిచ్చింది. వెటరన్‌ సెరెనా విలియమ్స్‌ 6-4, 6-4తో డానిల్‌ కొలిన్స్‌ (అమెరికా)పై వరుస సెట్లలో నెగ్గి  ప్రీక్వార్టర్స్‌కు చేరింది. మరో మూడో రౌండ్‌ మ్యాచ్‌లో 13వ సీడ్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌) 6-2, 6-2తో మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై అలవోకగా నెగ్గింది. 2013 తర్వాత  ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అజరెంకా తొలిసారి ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. 21వ సీడ్‌ రిబాకినా (కజకిస్థాన్‌) 6-1, 6-4తో వెస్నినా (రష్యా)పై, జిడాన్సెక్‌ (స్లొవేనియా) 0-6, 7-6 (5), 6-2తో సినియకోవా (చెక్‌రిపబ్లిక్‌)పై నెగ్గి నాలుగో రౌండ్‌ చేరారు.


పురుషుల మూడో రౌండ్‌లో మెద్వెదేవ్‌ (రష్యా) 6-4, 6-2, 6-4తో ఒపెల్కా (అమెరికా)ను, జ్వెరేవ్‌ (జర్మనీ) 6-2, 7-5, 6-2తో లాస్లో డెరె (సెర్బియా)ను, 12వ సీడ్‌ బుస్టా (స్పెయిన్‌) 5-4, 6-4,  6-2తో స్టీవ్‌ జాన్సన్‌ (అమెరికా)ను, 22వ సీడ్‌ క్రిస్టియన్‌ గారిన్‌ (చిలీ) 6-1, 5-7, 6-2, 6-2తో మార్కోస్‌ గిరాన్‌ (అమెరికా)ను ఓడించారు. జపాన్‌ ఆటగాడు కీ నిషికోరి కూడా నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టాడు. హెన్రీ లాక్‌సోనెన్‌ (స్విట్జర్లాండ్‌)తో మ్యాచ్‌లో నిషికోరి 7-5, 0-0తో ఉన్న దశలో ప్రత్యర్థి కాలి గాయంతో తప్పుకొన్నాడు. 15వ సీడ్‌ కాస్పెర్‌ రడ్‌ (నార్వే) 6-7 (7), 6-2, 6-7 (8), 6-0, 5-7తో ఫోకినా (స్పెయిన్‌)చేతిలో,  27వ సీడ్‌ ఫాగ్నిని (ఇటలీ) 4-6, 1-6, 3-6తో డెల్బోనిస్‌ (అర్జెంటీనా) చేతిలో ఓడారు. 

Updated Date - 2021-06-05T06:08:22+05:30 IST