Advertisement
Advertisement
Abn logo
Advertisement

థీమ్‌కు షాక్‌

  • తొలిరోజే సంచలనం 
  • కెర్బర్‌ అవుట్‌ 
  • సాకా, క్విటోవా ముందంజ 

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలిరోజే పెను సంచలనం. రొలాండ్‌ గారోస్‌లో రెండుసార్లు ఫైనలిస్ట్‌ డొమినిక్‌ థీమ్‌కు పరాజయం. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో స్పెయిన్‌కు  చెందిన అన్‌సీడెడ్‌ పాబ్లో అద్భుత ప్రదర్శనతో థీమ్‌కు షాకిచ్చాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో పాబ్లో 4-6, 5-7 6-3, 6-4, 6-4 స్కోరుతో నాలుగో సీడ్‌ థీమ్‌ (ఆస్ట్రియాకు)ను కంగుతినిపించాడు.  

మహిళల విభాగంలో జపాన్‌కు చెందిన రెండోసీడ్‌ నవోమి ఒసాకా, మూడోసీడ్‌ సబలెంకా, 11వ సీడ్‌ పెట్రా క్విటోవా శుభారంభం చేయగా.. మూడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత ఏంజెలికా కెర్బర్‌కు ఆరంభ రౌండ్లోనే చుక్కెదురైంది. తొలి రౌండ్‌లో ఒసాకా 6-4, 7-6 (4)తో వరుస సెట్లలో 63వ సీడ్‌ పాట్రీసియా చార్టియర్‌ (రుమేనియా)పై సునాయాసంగా గెలుపొం దింది. ఈ విజయం గ్రాంస్లామ్‌ల్లో నవోమికి వరుసగా 15వది కావడం విశేషం. రెండో రౌండ్‌లో రుమేనియాకే చెందిన అనా బోగ్డన్‌తో ఒసాకా తలపడుతుంది. మొదటి రౌండ్‌లో బోగ్డన్‌ 6-1, 6-3తో లక్కీ లూజర్‌ ఎలిసాబెతా కొకియారెటో (ఇటలీ)ని ఓడించింది. బెలారస్‌కు చెందిన అర్యానా సబలెంకా 6-4, 6-3తో కొంజు (క్రొయేషియా)పై సునాయాసంగా నెగ్గి రెండో రౌండ్‌లో ప్రవేశించింది. మరోవైపు క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-7 (3), 7-6 (5), 6-1తో మినెన్‌ (బెల్జియం)పై కష్టపడి గెలుపొందింది.  26వ సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ) 2-6, 4-6తో కలినానా (ఉక్రెయిన్‌) చేతిలో ఓడి తొలిరౌండ్‌లోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్‌లో 11వ సీడ్‌ బౌటిస్టా అగట్‌ (స్పెయిన్‌) 6-4, 6-4, 6-2తో సహచరుడు విలేలా మార్టినేజ్‌పై, 12వ సీడ్‌ కరెనో బుస్టా (స్పెయిన్‌) 6-3, 6-4, 6-3తో గోంబోస్‌ (స్లొవేకియా)పై, 23 సీడ్‌ కచనోవ్‌ (రష్యా) 6-1, 6-2, 6-3తో వెస్టి (చెక్‌ రిపబ్లిక్‌)పై, 27వ సీడ్‌ ఫాగ్నిని (ఇటలీ) 6-4, 6-1, 6-4తో బరెరె (ఫ్రాన్స్‌)పై నెగ్గి రెండో రౌండ్‌లో ప్రవేశించారు.. 16వ సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6-2, 6-4, 5-7, 0-3తో ఉన్న దశలో గిరోన్‌ (అమెరికా)కు వాకోవర్‌ ఇచ్చాడు. 25వ సీడ్‌ ఇవాన్స్‌ (బ్రిటన్‌) 6-1, 3-6, 3-6, 4-6తో కెక్‌మనోవిక్‌ (సెర్బియా) చేతిలో కంగుతిన్నాడు. నిషికోరి (జపాన్‌) 6-4, 6-7 (4), 6-3, 4-6, 6-4తో గియానెసి (ఇటలీ)పై చెమటోడ్చి నెగ్గి రౌండ్‌రౌండ్‌ చేరాడు. 
నవోమికి జరిమానా

మీడియా సమావేశానికి రాకపోతే బహిష్కరణ తప్పదన్న నిర్వాహకులు

తొలి రౌండ్‌ మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశానికి హాజరుకాని జపాన్‌ స్టార్‌ నవోమి ఒసాకాపై ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిర్వాహకులు రూ. 11 లక్షలు జరిమానా విధించారు. అంతేకాదు..ఆమె నిర్ణయం మార్చుకోకుంటే ఫ్రెంచ్‌ ఓపెన్‌నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. విలేకరులు సంధించే ప్రశ్నలు ఆటగాళ్ల మానసికస్థితిపై ప్రభావం చూపుతాయన్న 23 ఏళ్ల ఒసాకా.. మ్యాచ్‌లకు ముందు, తర్వాత మీడియా  సమావేశాలకు హాజరు కానని టోర్నీకి ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. 


Advertisement
Advertisement