Abn logo
May 5 2021 @ 00:09AM

కొవిడ్‌ పరీక్ష కేంద్రంపై తరచూ దాడులు

దుబ్బ అర్బన్‌ పీహెచ్‌సీ పరిధిలో రెండుసార్లు దాడి

భయబ్రాంతులకు గురవుతున్న వైద్య సిబ్బంది

నిజామాబాద్‌ రూరల్‌, మే 4: కొవిడ్‌ సమయంలో వైద్య సిబ్బంది ప్రాణభయంతో భయం భయంగా డ్యూటీ చేస్తున్నా రు. నిత్యం వందల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులునిర్వహిస్తున్నా.. కొన్ని చోట్ల ఆకతాయిల నుంచి తిప్పలు తప్పడం లేదు. కొవిడ్‌ పరీక్షలకు వచ్చిన వారందరికీ చేయాలంటూ కొందరు ఆందోళనకు దిగుతున్నారు. గతంలో ఒక్కరోజు దాదాపు వంద మందికి పరీక్షలు చేశారు. ప్రస్తుతం కిట్‌ల కొరత కారణంగా రోజుకు 40 నుంచి 50 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. దాంతో ఉదయం నుంచి లైన్‌లో నిల్చున్నా తమకు పరీక్షలు చేయకపోవడంతో కొందరి ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఎంతసేపు లైన్‌లో నిలబడాలని ఆవేశానికి లోనవుతున్నారు. ఎవరినీ ఏమీ అనలేక కొవిడ్‌ పరీక్షల్లో సహాయం చేస్తున్న ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్సులపై కొందరు తమ ప్రతాపం చూపుతున్నారు. నగరంలోని దుబ్బ అర్బన్‌ పీహెచ్‌సీ పరిధిలో స్థానిక అరబిందో పాఠశాల సమీపంలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్న ఆశ కార్యకర్తపై స్థానిక యువకుడు అందరికీ టెస్టులు ఎందుకు చేయడం లేదని బూతులు తిడుతూ గొడవకు దిగాడు. బండరాయి ఆమెపైకి విసరడంతో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దాంతో భయాందోళనకు గురైన సిబ్బంది కొవిడ్‌ పరీక్షలు నిలిపివేశారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడవకముందే సోమవారం అదే కేంద్రం వద్ద 40 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయడానికి ఆశ కార్యకర్తలు పేర్లు నమోదు చేస్తుండగా 23వ నెంబర్‌ టోకెన్‌ తీసుకున్న యువకుడు కేవలం 40 మందికి చేయడం ఏమిటని, అందరికీ చేయాలని సిబ్బందితో గొడవకు దిగాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. అసభ్యపదజాలంతో దూషించడంతో వారు కూడా గట్టిగా మాట్లాడటంతో వివాదం పెద్దదయింది. ఆయనకు మరో ముగ్గురు తోడవడంతో వైద్య సిబ్బందిపైకి రాళ్లు రువ్వారు. దాంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఆ తర్వాత సెంటర్‌లోపలికి దూసుకువచ్చి నానా హంగామా సృష్టించారు. సెంటర్‌ డోర్‌ను కాలుతో తన్నడంతో అది ఊడి కిందపడింది. దాంతో వైద్య సిబ్బంది భయభ్రాంతులకు గురై సెంటర్‌లోని ఓ మూల దాక్కున్నారు. చివరికి పరీక్షలు ముగించి పీహెచ్‌సీకి వెళ్లి మెడికల్‌ ఆఫీసర్‌, సూపర్‌వైజర్‌కు తెలిపారు. కొవిడ్‌ సెంటర్‌ల వద్ద పోలీసు సిబ్బందికి డ్యూటీలు వేసినా వారు అక్కడ విధులు నిర్వహించడం లేదు. దాంతో స్థానికులు ఉద్రేకాలకు లోవనవుతున్నారు. దాడులకు పాల్పడుతున్నారు. ఒకవైపు కొవిడ్‌ భయంతో భయంభయంగా డ్యూటీలు చేస్తుంటే మరోపక్క ఆకతాయిలతో ఏరోజు ఏం జరుగుతుందోనని భయమేస్తోందని వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తెల్లారి కొవిడ్‌ సెంటర్‌లో డ్యూటీ చేయాలంటేనే భయంతో వణుకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని వైద్య సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. రెండుసార్లు వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డ ఆకతాయిలను 3వ పట్టణ పోలీసులు ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదు, కనీసం విచారణ జరపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Advertisement
Advertisement