Abn logo
Jan 21 2021 @ 01:20AM

స్నేహతత్వమే భారత దౌత్యసూత్రం

కొవిడ్‌ నేపథ్యంలో చాలా ముఖ్యమైన విషయాలు అనేక దేశాల్లో మరుగున పడ్డాయి. ఇంతకు మునుపు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా భారతదేశంలో విదేశాంగ వ్యవహారాలు ప్రాముఖ్యాన్ని కోల్పోలేదన్నది నిర్వివాదాంశం. ఇప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం విదేశాంగ సమస్యల మీద సరియైన దృక్పథంతోనే వ్యవహరిస్తున్నదని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ చైనా, పాకిస్థాన్‌ సంబంధాలు మరింత బలపడ్డాయని, అవి మన దేశానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని నిన్న గాక మొన్న మన సైనికాధికారులు చెప్పడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన అంశంగా భావించక తప్పదు. 


అమెరికాలో జరిగిన ఎన్నికలు ప్రపంచ రాజకీయ చిత్రపటాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. యూరప్‌ దేశాలు అమెరికాలోని రాజకీయ అస్థిరతను గమనించి చైనాకు దగ్గరవుతున్న సూచనలు బహిర్గతమవుతున్నాయి. పెట్టుబడుల విషయంలో కొన్ని ఆర్థిక ఒడంబడికలకు సైతం సిద్ధపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అంతర్జాతీయంగా దూరంగా పెట్టబడిన దేశం కానే కాదు. ‘ఐరన్‌ వాల్‌’ దానంతట అదే విచ్ఛిన్నమవుతున్నది. ఆర్థికంగా బలపడిన దేశాలు రెండు చేతులా చైనాను కావిలించుకొనే ప్రయత్నంలో ఉండడం ఈ నూతన సంవత్సరం మొదట్లో కనిపిస్తున్న గణనీయమైన మార్పు అని చెప్పక తప్పదు.


లడక్‌ తూర్పు భాగాన జరిగిన సంఘటనల వల్ల మన దేశం చైనాతో ఇబ్బందుల ఇరకాటంలో పడిన మాట వాస్తవం. నేపాల్‌ లాంటి దేశం కూడా నిన్న మొన్నటి వరకు దౌత్యపరంగా మనతో అంటీముట్టనట్టుగా వ్యవహరించడం చికాకు కలిగించే అంశమే. అయితే ఆ దేశం కొవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా విషయంలో మనతో స్నేహసంబంధాలను మెరుగుపరచుకొనే దిశలో కదిలిరావటం శుభపరిణామంగా భావించాలి. 


కొన్ని సందర్భాల్లో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో, బలమైన దేశంగా నైతిక విలువలకు ట్రేడ్‌మార్క్‌గా వెలిగిపోయింది. సమదూరం పాటిస్తూ, బలహీన స్థాయిలో ఉన్న దేశాలకు ఆసరాగా నిలిచే ఆదర్శ దేశంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అన్నది ప్రశ్నార్థకమే. దానిని స్వయంకృతాపరాధమని భావించటం సమంజసం కాదు. అంతర్జాతీయంగా అనేక మార్పుల వల్ల ఆ పరిస్థితి సంభవించి ఉండవచ్చు. 


అలీన దేశంగా ఉన్నప్పుడు కూటమి కట్టిన దేశాలు కూడా మనకు దగ్గర కావడానికి ప్రయత్నించాయన్నది ఒకనాటి మాట. చైనా మన భూభాగాన్ని కొంతమేర ఆక్రమించుకుని కయ్యానికి కాలుదువ్వినప్పుడు అమెరికా ఒక్కటే కాదు, కమ్యూనిస్టు దేశమైన రష్యా సైతం గుట్టుగా సహాయమందించడానికి సిద్ధపడడం దౌత్యపరమైన విజయంగానే చెప్పుకోవచ్చు. పాకిస్థాన్‌తో మన సంబంధాలు దెబ్బతిన్నప్పుడు ఇస్లాం దేశాలు జాగ్రత్తగా వ్యవహరిస్తూ సమదూరం పాటించడానికి, మనకు దూరం కాకుండా ఉండడానికే ప్రయత్నించాయి. అభివృద్ధిపరంగా మన దేశం సాధించిన విజయాలు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో బలపడిన తీరు, రాజకీయ స్థిరత్వం అప్పుడు మనకు కలిసివచ్చాయి. 


ప్రస్తుతం మన దేశానికి సార్క్‌ కూటమి దేశాలతోను, అలీన వ్యవస్థలోని దేశాలతోను దూరం ఏర్పడింది. అది కావాలని చేసుకున్నది కాదు కానీ, పరిస్థితులు అలా పరిణమించాయని, ముఖ్యంగా దౌత్య విషయాల్లో అమెరికా వైపు మొగ్గు చూపుతున్నామనే అభిప్రాయాన్ని ప్రపంచదేశాల్లో  కలిగేటట్లుగా మనదేశం వ్యవహరించిందని నిపుణుల ఆలోచన. అంతేకాదు అనేక అంతర్జాతీయ వ్యవస్థలు, ముఖ్యంగా ఆర్‌ఐసి (రష్యా, ఇండియా, చైనా) ఆర్‌సిఇపి (రీజనల్‌ కాంప్రహెన్సివ్‌ ఎక్‌నామిక్‌ పార్టనర్‌షిప్‌) కూడా మనదేశంతో సఖ్యత పాటిస్తున్న దాఖలాలు కనపడడం లేదు. 


ఆసియా దేశాలు చాలాకాలం భారతదేశానికి వెన్నుదన్నులు సమకూర్చాయి. కానీ మన అతి నమ్మకం దౌత్య నిపుణుల వైఫల్యం వల్ల నేపాల్‌, శ్రీలంక, ఇరాన్‌, బంగ్లాదేశ్‌ వంటి చిరకాల మిత్రదేశాలు కూడా ఇప్పుడు దూరమవుతాయా అన్న భయం కలుగుతున్నది. చైనా కొవిడ్‌ సమస్యను అధిగమించి, భారతదేశం కంటే ఆర్థికంగా బలమైన దేశంగా ప్రకటించుకుంటోంది. మరోవైపు అనేకసార్లు ‘వాస్తవాధీన రేఖ’ నిబంధనలను అతిక్రమిస్తూ సైనికపరంగా కూడా బలంగా ఉన్నాననే సంకేతాలు దృఢంగా ఇస్తున్న ఈ తరుణంలో అమెరికా బలహీనపడటంతో మనకు నమ్మకస్తుడైన స్నేహితుడు లేకుండా పోయాడా అనే భయం కలుగుతున్నది. నిజానికి చాలా దేశాలు భయం వల్లో, ఆర్థిక వెసులుబాటు కోసమో చైనా వైపు మొగ్గుచూపుతున్నాయి. అమెరికా బలహీనం కావడం, రష్యా బలపడకపోవడం, పాకిస్థాన్‌ చైనాకు మరింత దగ్గరకావడం, ఆసియాలోని దేశాలు తటస్థ వైఖరి అవలంబించడం, పొరుగుదేశాలు ఇంతకు మునుపులా స్నేహభావంతో ఉండకపోవడం, మనదేశాన్ని దౌత్యపరంగా, విదేశీ వ్యవహారాల్లో బలహీనంగా చిత్రీకరిస్తున్న కారణాలుగా కనపడుతున్నాయి. 


ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మనదేశం ఇంకా బలంగా నిలబడి ఉండటానికి కారణం ప్రజాస్వామ్యం దృఢంగా వేళ్లూనుకుని ఉండడం వల్లనే. ఆ పునాదులను బలహీనపరచుకోకూడదు. దురదృష్టవశాత్తు రాజకీయపార్టీలు అంతర్గత కుమ్ములాటల మీదనే దృష్టిపెట్టి, తమను అనైతికంగానైనా సరే బలపరచుకోవడానికే అన్ని శక్తులూ ధారపోస్తున్నాయి. ఒక ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడిని అంతర్జాతీయ సమావేశంలో నాయకత్వం వహించడానికి పంపిన ఘనత మనదేశానిది. రాజకీయంగా సరిహద్దులు అంతర్గతమే. దేశం బయట అందరూ ఒకటే. ప్రస్తుతం ఆ సంకేతం పంపడం చాలా అవసరం. కుల, మత భేదాలను పెట్రేగిపోనివ్వకూడదు.


నాయకులు స్టేట్స్‌మెన్‌గా ఎదగాలి. ప్రజల బాగోగుల కోసం ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజలను భాగస్వాములుగా చేయడం మరచిపోయాయి. ఎన్నికల వరకే వారి పాత్రను పరిమితం చేశాయి. నిజానికి ఎన్నికల వరకే నాయకులు పరిమితం కావాలి. సుపరిపాలన అనేది చర్చల ద్వారా, అభిప్రాయాలను సామరస్య ధోరణిలో గౌరవించుకోవడం ద్వారా, మూలస్తంభాలైన, లెజిస్లేచర్‌, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్‌ను మరింతగా బలపరచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అప్పుడే రచ్చ గెలవడం సులువవుతుంది. అన్ని దేశాలు మనకు సమానమే. స్నేహాన్ని ఆయుధంగా మలచుకునే ప్రణాళికలు, రాజనీతిజ్ఞులు, దౌత్యవేత్తలు ఇప్పుడు మనకు ఎంతగానో అవసరం. పాత పద్ధతులు కొన్నిటిని స్వాగతించడంలో తప్పులేదు. మొదట ప్రాంతాలవారీగా స్నేహతత్వాన్ని అలవరచుకుందాం. తర్వాత దేశాలవారీగా స్నేహితులను దగ్గరకు తీసుకుందాం. శాశ్వతశత్రువులు ఎప్పుడూ ఉండరు. చిరకాలం నిలిచేది నిజాయితీతో నిండిన మిత్రత్వమే!

రావులపాటి సీతారాంరావు

Advertisement
Advertisement
Advertisement