భయపెడుతున్న బ్లాక్‌ ఫంగస్‌

ABN , First Publish Date - 2021-05-18T06:36:24+05:30 IST

తాజాగా కొవిడ్‌ బాధితులను భయపెడుతున్న బ్లాక్‌ ఫంగస్‌ జిల్లాలోకీ ప్రవేశించినట్లు ప్రచారం జరుగుతోంది.ప్రభుత్వ అధికారులు మాత్రం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెబుతున్నారు.

భయపెడుతున్న బ్లాక్‌ ఫంగస్‌

ప్రైవేట్‌ వైద్యుల వద్దకు పలువురు బాధితులు


మందులు లేక పక్కరాష్ట్రాలకు వెళుతున్న రోగులు


జిల్లాలో ఒక్క కేసు కూడా లేదంటున్న అధికారులు


తిరుపతి, మే 17 (ఆంధ్రజ్యోతి) : తాజాగా కొవిడ్‌ బాధితులను భయపెడుతున్న బ్లాక్‌ ఫంగస్‌ జిల్లాలోకీ ప్రవేశించినట్లు ప్రచారం జరుగుతోంది.ప్రభుత్వ అధికారులు మాత్రం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెబుతున్నారు. అయితే బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు అవసరమైన ఇంజక్షన్ల కోసం పలువురు మెడికల్‌ షాపుల చుట్టూ తిరుగుతుండడాన్ని బట్టి గుట్టుచప్పుడు కాకుండా ఇది జిల్లాలోకి అడుగుపెట్టేసిందని అన్పిస్తోంది.  తిరుపతిలోని అనేక మందుల షాపుల వద్దకు వారం రోజులుగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధికి వినియోగించే ‘యాంఫోటెరిసిన్‌-బి’ ఇంజక్షన్ల కోసం బాఽధితుల బంధువులు వైద్యుల చీటీలు పట్టుకుని తిరుగుతున్నారు. అయితే ఈ మందులు అందుబాటులో లేకపోవడంతో ఆర్థిక స్తోమత ఉన్నవారు చెన్నైకి వెళుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బ్లాక్‌ ఫంగస్‌ తీవ్రత పెరిగితే అవసరమైనన్ని మందులు జిల్లాలో అందుబాటులో లేవు.  వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాత్రం 1600 ‘యాంఫోటెరిసిన్‌-బి’ ఇంజక్షన్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, ఎవరూ భయపడవద్దని ప్రకటించారు. అయితే వైద్య నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి ఇవి 16 మంది బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు కూడా సరిపోవు. బ్లాక్‌ఫంగస్‌ జిల్లాలో ఉందంటే భయపడతారనే ఉద్దేశంతో దాచిపెట్టకుండా ప్రజల్ని అప్రమత్తం చేసి, అవసరమైన మందులు తక్షణం అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నించాల్సి ఉంది. 

 



స్విమ్స్‌లో బ్లాక్‌ఫంగస్‌ అవకాశం లేదు


బ్లాక్‌ ఫంగస్‌ కొత్తది కాదు, అంటువ్యాధి అంతకన్నా కాదు. రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా తగ్గిపోయిన క్యాన్సర్‌, హెచ్‌ఐవీ వంటి వ్యాధులున్న కొందరిలో ఇది కన్పిస్తుంటుంది. తాజాగా కొవిడ్‌ రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ కనబడుతోంది. కరోనా వైరస్‌ ప్రత్యుత్పత్తి జరిగే తొలివారంలో అనవసరంగా స్టెరాయిడ్‌ వాడేస్తే రోగనిరోధక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. కన్ను, ముక్కు, మెదడు, ఊపిరితిత్తులు బ్లాక్‌ ఫంగస్‌ వల్ల దెబ్బతినే అవకాశం ఉంది. స్విమ్స్‌ పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రిలో ‘రికవరీ’ అనే ట్రైల్‌ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటిస్తున్నాం. అందువలన మా దగ్గర స్టెరాయిడ్స్‌ వలన బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశం తక్కువ. 

-డాక్టర్‌ అల్లాడి మోహన్‌, మెడిసిన్‌ విభాగాధిపతి, స్విమ్స్‌


 



రోజుకు ఒకరిద్దరు వస్తున్నారు


గతంలో ఏడాదికి ఒకటి, రెండు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వచ్చేవి. ప్రస్తుతం రోజుకు ఒకరిద్దరు బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో చికిత్స కోసం మావద్దకు వస్తున్నారు. వీరికి అవసరమైన ‘యాంఫోటెరిసిన్‌-బి’ ఇంజక్షన్లు, ఫోసోకొనజోల్‌ మాత్రలు మార్కెట్లో దొరకడం లేదు. అందువల్ల చెన్నై, బెంగుళూరుకు రెఫర్‌ చేస్తున్నాం.  ఫంగస్‌ ముక్కు లోపల సైనస్‌ నుంచి మొదలై కంటికి, మెదడుకు వెళుతుంది. వ్యాధిని గుర్తించిన వెంటనే మెడికేషన్‌ ఇస్తూ, సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది.  ఆక్సిజన్‌ సాయంతో కొవిడ్‌ చికిత్స చేసుకుని డిశ్చార్జ్‌ అయిన వారు రెండు, మూడు రోజుల్లో ఈఎన్టీ వైద్యుల్ని సంప్రదించాలి.

-డాక్టర్‌ మనోజ్‌కుమార్‌, ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులు



ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌ కారణం


బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగా గుర్తిస్తే ఏ మాత్రం ప్రమాదకారి కాదు. ఫంగస్‌ లక్షణాలు బయటపడిన తరువాత వైద్యులను సంప్రదిస్తే వాడాల్సిన మందులు, చేయాల్సిన ఆపరేషన్‌ ఖరీదు, రిస్క్‌తో కూడుకున్నది. స్టెరాయిడ్స్‌ను విచ్చలవిడిగా వినియోగించడంతో పాటు ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌ వినియోగించడం వలన బ్లాక్‌ ఫంగస్‌ సోకుతోంది. 

-డాక్టర్‌ రాజ్‌ యశ్వంత్‌, కంటి వైద్య నిపుణులు 

Updated Date - 2021-05-18T06:36:24+05:30 IST