Jun 18 2021 @ 01:52AM

తెరవెనుక నుంచి తెరపైకి

ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. ఇలా నటించాలంటూ తామే నటించి చూపించేవారు కొందరైతే, సీన్‌ వివరంగా చెప్పేసి ఆర్టిస్టులు చేసే దాంట్లో తనకి నచ్చింది తీసుకొనే దర్శకులు మరికొందరు. 

ఏ ఆర్టిస్ట్‌ అయినా తన పాత్ర బాగా వస్తోందా లేదా అని మాత్రమే చూసుకుంటాడు. మిగిలిన పాత్రల సంగతి అతనికి అనవసరం. వీలైతే అవతలి ఆర్టిస్ట్‌ను డామినేట్‌ చేయాలని చూస్తుంటాడు.

కానీ దర్శకుడికి అన్ని పాత్రలూ ముఖ్యమే. ఏ పాత్ర ఎలా చేస్తే సినిమా ఆసక్తికరంగా ఉంటుందో చూసుకోవాల్సిన బాధ్యత అతనిదే. ఇలా సినిమాలోని అన్ని పాత్రలనూ డీల్‌ చేసే దర్శకుడు తనే ఓ వేషం వేసి కెమెరా ముందుకు వస్తే..? చూడడానికి రంజుగా ఉంటుంది కదూ. ఆర్టిస్టులుగా కూడా సత్తా చాటుకొంటున్న దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం.


జాన్‌ మహేంద్రన్‌ కాసినో

1999లో వచ్చిన ‘ప్రేమించేది ఎందుకమ్మా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు జాన్‌ మహేంద్రన్‌. ఆ తర్వాత  2002లో  వచ్చిన ‘నీతో’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనంతరం తమిళ చిత్రరంగానికి వెళ్లి   డైరెక్టర్‌గా సెటిలయిన జాన్‌ మహేంద్రన్‌ ప్రస్తుతం ‘కాసినో’ అనే చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. ఈ చిత్రంలో కథానాయిక వాణీభోజన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. 


సెల్వ రాఘవన్‌ యాక్షన్‌

తెలుగులో విక్టరీ వెంకటేశ్‌తో ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ సహా తమిళంలో ఎన్నో ఘన విజయాలను అందుకున్న దర్శకుడు సెల్వ రాఘవన్‌ నటుడిగా తన లోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్‌ అయిన ఆయన నటుడిగా కెమెరా ముందుకు వస్తున్నారు.  అరుణ్‌ మాతేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాని కాయిదమ్‌’ చిత్రంతో ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఓవైపు దర్శకుడిగా తన సినిమాల కోసం సమయం కేటాయిస్తూనే ఈ చిత్రంలో  మాస్‌ రోల్‌  కోసం సన్నద్ధమయ్యారు సెల్వ రాఘవన్‌. ‘సాని కాయిదమ్‌’లో ప్రధాన పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్‌ డీ గ్లామర్‌గా కనిపించనున్నారు. 


వెండితెరపై తనదైన ముద్ర

దర్శకుడిగా తెరవెనుకే కాదు నటుడిగా తెరపైనా తన సత్తా చాటుతున్నారు దర్శకుడు గౌతమ్‌ మీనన్‌.ప్రేమకథలైనా, యాక ్షన్‌ చిత్రాలైన ప్రేక్షకులను అబ్బురపరిచేలా తెరకెక్కించడంలో గౌతమ్‌ మీనన్‌ స్టైలే వేరు.  తమిళంలో తను తెరకెక్కించిన చిత్రాలను స్వయంగా రీమేక్‌ చేసి పరభాషల్లోనూ పెద్ద హిట్‌లు అందుకున్నారు.

వెంకటేష్‌ నటించిన ‘ఘర్షణ’, నాగచైతన్య, సమంతల ‘ఏం మాయ చేశావే’ చిత్రాలు మచ్చుకు కొన్ని. 


‘కుట్టి స్టోరీ’ అనే తమిళ ఆంథాలజీ చిత్రంలో ‘ఎతిర్‌పార మూతం’ భాగానికి, మణిరత్నం నిర్మిస్తున్న ‘నవరస’ వెబ్‌సిరీ్‌సలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగానికి గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ద్రువ నచ్చత్రమ్‌’, ‘జోషువా ఇమై పోల్‌ కాక్కా’చిత్రాలకు దర్శకత్వం వహి స్తున్నారు. దర్శకత్వంతో బిజీగా ఉన్నా నటుడిగానూ కొనసాగుతున్నారు. గతేడాది వచ్చిన వెబ్‌సిరీస్‌ ‘పావ కథైగళ్‌’లో ఆకట్టుకున్నారు. ‘రుద్రతాండవం’ అనే తమిళ చిత్రంలో కీలకపాత్రలో నటి స్తున్నారు. శింబు కథానాయకుడిగా నటిస్తున్న ‘పాత్తు తల’ చిత్రంలో గౌతమ్‌ మీనన్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి!


తెరపైకి దర్శక దిగ్గజం 

తెలుగులో టాప్‌ మోస్ట్‌ డైరెక్టర్‌  కె. రాఘవేంద్రరావు.  45 ఏళ్లకు పైగా ఉన్న తన  సినీ జీవితంలో ఆయన ఎన్నో  కమర్షియల్‌ హిట్స్‌ ప్రేక్షకులకు అందించారు. ఎంతో మంది నటీనటులను తీర్చిదిద్దారు. అయితే  శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించినా ఇన్నేళ్లలో ఎప్పుడూ ఆయన  నటుడిగా తెరపై కనిపించలేదు. కానీ త్వరలోనే ఆయన నటుడిగా కొత్త పాత్రలో వెండితెర  అరంగేట్రం చేయనున్నారని సమాచారం.  హీరోయిన్లను తన సినిమాలో ఎంతో అందంగా చూపించే రాఘవేంద్రుడు నటించబోయే చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఆయన సరసన నటిస్తారని టాక్‌. వెరీ ఇంట్రెస్టింగ్‌ కదూ. లెటజ్‌ సీ.


దర్శకత్వం నుంచి హీరోలుగా

నృత్య దర్శకులుగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇటు దర్శకత్వంలోనూ అటు హీరోలుగానూ రాణిస్తున్నారు రాఘవ లారెన్స్‌, ప్రభుదేవా. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో అగ్రహీరోలను డైరెక్ట్‌ చేసి విజయాలు అందుకున్నారు. ఓ వైపు దర్శకులుగా కొనసాగుతూనే కథానాయకులుగానూ మంచి విజయాలు అందుకుంటున్నారు. సల్మాన్‌ఖాన్‌ హీరోగా  ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘రాధే: ద మోస్ట్‌ వాంటెడ్‌ బాయ్‌’ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలైంది. తమిళంలో ‘యుంగు ముంగ్‌ సుంగ్‌’, ‘విక్రమ్‌’ ‘వూమై విషిగళ్‌’, ‘భగీరా’ చిత్రాల్లో ప్రభుదేవా నటిస్తున్నారు. దర్శకుడిగా, నటుడిగా రెండు పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు రాఘవ లారెన్స్‌. డ్యాన్సర్‌గా తిరుగులేదని నిరూపించుకున్న లారెన్స్‌ నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కించిన ‘మాస్‌’ చిత్రంతో ఘన విజయం అందుకున్నారు. గతేడాది ఏకంగా బాలీవుడ్‌ అగ్ర హీరో అక్షయ్‌ కుమార్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం ‘లక్ష్మీ’ చిత్రంతో దక్కించుకున్నారు. లారెన్స్‌ ప్రస్తుతం ‘రుద్రన్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. 


రెండు విభిన్న పాత్రల్లో

తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా, నటుడిగా సుపరిచితులు ఎస్‌.జె. సూర్య. ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టిందే నటుడిగా. కెరీర్‌ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేశారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి  తెలుగు, తమిళ భాషల్లో  బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ ఇచ్చారు. అనంతరం మళ్లీ  రూటు మార్చి హీరోగాను సక్సెస్‌ అయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన ప్రతీ చిత్రంలో చిన్న పాత్ర లోనైనా కనిపించడం  సూర్యకు అలవాటు . ప్రస్తుతం ఆయన తమిళంలో ఐదు చిత్రాల్లో నటిస్తున్నారు. శింబు కథానాయకుడిగా నటిస్తున్న ‘మానాడు’ చిత్రంలో మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. శివ కార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న ‘డాన్‌’ చిత్రంలో  కూడా ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. మరో మూడు చిత్రాలు సెట్స్‌ పై ఉన్నాయి.


తెరపై మెరిశారు

అయితే దర్శకులు నటులుగా మారడం ఇదే కొత్త కాదు. గతంలో తెలుగు అగ్రదర్శకులు పలువురు తమ చిత్రాల్లో తెరపై తళుక్కున మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీయార్‌ కథానాయకుడిగా నటించిన ‘టెంపర్‌’, మహేశ్‌ బాబు ‘బిజినెస్‌ మ్యాన్‌’ చిత్రాల్లో పూరీ జగన్నాథ్‌ కొన్ని క్షణాలు కనిపించారు. అలాగే చిరంజీవి ‘ఠాగూర్‌’ చిత్రంలో వి.వి. వినాయక్‌ కాలేజీ విద్యార్థి పాత్రలో మెప్పించారు. ‘బాహుబలి’ చిత్రంలో రాజమౌళి కొన్ని నిమిషాలు కనిపించి ఆకట్టుకున్నారు. ‘పెళ్లి చూపులు’ చిత్రంతో దర్శకుడిగా ఘన విజయాన్ని అందుకున్నారు తరుణ్‌భాస్కర్‌.  ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంతో  ఆయన హీరోగా మారారు. ‘మహానటి’, ‘ఫలక్‌నుమా దాస్‌’ తదితర చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు.


అతిథిగా...

దర్శకుడిగా చేసింది కొద్ది చిత్రాలే అయినా మంచి పేరు తెచ్చుకున్నారు విఘ్నశ్‌ శివన్‌. ఆయన నటుడిగా సినీ పరిశ్రమలో కెరీర్‌ను స్టార్ట్‌ చేసి దర్శకుడిగా నిలదొక్కుకున్నారు. ఇప్పుడు దర్శకత్వంతో పాటు చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నారు. అప్పుడప్పుడు తెరపై అతిథి పాత్రల్లో మెరుస్తున్నారు విఘ్నేశ్‌.