Abn logo
Mar 23 2020 @ 10:21AM

కార్ల తయారీ కర్మాగారాల్లో ఇక వెంటిలేటర్ల తయారీ

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కార్ల తయారీ ప్లాంట్లలో వెంటిలేటర్లను తయారు చేయాలని నిర్ణయించారు.  స్పోర్ట్సు యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన ఉత్పాదక కర్మాగారాల్లో కరోనా వైరస్ రోగుల కోసం వెంటిలేటర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫెరారీ, ఫియట్ సహా ఇతర కార్ల తయారీదారులు కూడా వెంటిలేటర్ల తయారీ ప్రయత్నాలు చేస్తున్నారు.తమ కార్ల తయారీ ప్లాంటులో వెంటిలేటర్ల తయారీని వెంటనే ప్రారంభిస్తామని గ్రూప్ కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.


దేశంలో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రభావం కార్ల తయారీ పరిశ్రమపై పడింది. కరోనా వైరస్ ప్రభావంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో మారుతీ నుంచి హుందాయ్ దాకా దేశంలోని పలు కార్ల కంపెనీలను మూసివేశారు. దేశంలోని మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, మెర్సెడెస్ బెంజ్, ఫియట్ క్రిసెలేర్ ఆటోమొబైల్స్, హుందాయ్ మోటార్ కో తదితర కంపెనీల్లో కార్ల ఉత్పత్తిని నిలిపివేశాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో యూరప్, యూఎస్, కెనడా, మెక్సికో దేశాల్లో గత వారం కార్ల తయారీ కంపెనీలను మూసివేశారు.


 దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ హర్యానా రాష్ట్రంలోని కర్మాగారాన్ని మూసివేసింది. మారుతీ కార్ల కర్మాగారాన్ని ఎప్పటివరకు మూసిఉంచుతామో ప్రభుత్వ నిర్ణయం బట్టి ఉంటుందని జపాన్ సుజుకీ మోటారు కార్పొరేషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు వెలుగుచూడటంతో పూణేలోని కార్ల తయారీ ఫ్యాక్టరీలను మార్చి 31వతేదీ వరకు మూసివేశారు. మహీంద్ర కార్ల తయారీ ప్లాంటును సోమవారం నుంచి మూసివేసింది. పూణే నగరంలోని మెర్సెడెస్ బెంజ్, ఫియట్, బజాజ్ ఆటో ప్లాంట్లను మార్చి 31వతేదీ వరకు మూసివేశారు. తమ ఉద్యోగులకు జీతాలు కోత విధించకుండా చెల్లిస్తామని ఫియట్ ప్రకటించింది. హీరో మోటార్ కార్పొరేషన్ లిమిటెడ్, సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా, టాటా మోటార్స్ ప్లాంట్లను కూడా మూసివేశారు. 

Advertisement
Advertisement
Advertisement