ప్లాస్మాథెరపీ నుంచి ఐవర్‌మెక్టిన్ దాకా కరోనా చికిత్సలో ఇంత గందరగోళమేంటి..?

ABN , First Publish Date - 2021-06-08T18:20:36+05:30 IST

ప్రపంచం వ్యాప్తంగా కోట్లాదిమంది జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. దీన్ని నియంత్రించడానికి ప్రపంచ దేశాలు నానా ప్రయత్నాలూ చేస్తున్నాయి.

ప్లాస్మాథెరపీ నుంచి ఐవర్‌మెక్టిన్ దాకా కరోనా చికిత్సలో ఇంత గందరగోళమేంటి..?

ప్రపంచం వ్యాప్తంగా కోట్లాదిమంది జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. దీన్ని నియంత్రించడానికి ప్రపంచ దేశాలు నానా ప్రయత్నాలూ చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా ఉనికి ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ మహమ్మారి సోకిన వారికి రకరకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కాలక్రమేణా వాటిలో కొన్ని ప్రభావం కోల్పోవడమో, లేక వివాదాస్పదంగా మారడం వల్లనో వాటిని కరోనా చికిత్సల జాబితా నుంచి తొలగిస్తూ వచ్చారు. తాజాగా కొవిడ్‌ సాధారణ/స్వల్ప లక్షణాలున్న వారికి ఇస్తున్న చికిత్సలోంచి ఐవర్‌మెక్టిన్‌, హైడ్రాక్సీక్లోరోక్వీన్‌(హెచ్‌సీక్యూ), ఫావిపిరవిర్‌ ఔషధాలను కేంద్రం తొలగించింది. మధ్యస్థ, పరిస్థితి తీవ్రంగా ఉన్న రోగులకు కూడా అవసరమైతే తప్ప సీటీ స్కాన్‌కు సిఫారసు చేయొద్దని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసె్‌స(డీజీహెచ్‌ఎస్‌) విడుదల చేసిన తాజా మార్గదర్శకాల్లో సూచించింది. వీరికి జ్వరానికి యాంటీపైరెటిక్‌, జలుబు, దగ్గు లక్షణాలకు యాంటీటస్సివ్‌ ఔషధాలే ఇవ్వాలని సూచించింది. కొవిడ్‌ చికిత్సకు అనవసర టెస్టులనూ తగ్గించాలని పేర్కొంది.


కరోనా వచ్చిన తొలినాళ్లలో హెచ్ఐవీ ఔషధాలతో కరోనాను తగ్గించామని కొన్ని దేశాలు ప్రకటించిన విషయం గుర్తుంది కదా. ఆ తర్వాత ప్రపంచం మొత్తం గుర్తించిన చికిత్సా విధానం ప్లాస్మా థెరపీ. కరోనా సోకి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి దాంతో కరోనా రోగులకు చికిత్స చేసే ఈ విధానం ఉపయోగిస్తున్నట్లు ఈ మధ్య ఏమైనా వార్తలు విన్నారా? లేదు కదా. ఎందుకంటే దీన్ని కరోనా చికిత్సల జాబితా నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తొలగించింది. ఇలా ప్లాస్మా థెరపీ ఒక్కటే కాదు. మనదేశంలో నిన్న మొన్నటి వరకూ విపరీతమైన డిమాండ్ ఎదుర్కొన్న రెమ్‌డెసివిర్‌ను కూడా కరోనా చికిత్సల జాబితా నుంచి డబ్ల్యూహెచ్‌వో తీసేసింది. ఇవి కరోనా చికిత్సకు ఏ విధంగానూ ఉపయోగపడవని పేర్కొంది. ఇంతకుముందు కరోనా సోకగానే ఈ చికిత్సల కోసమే ప్రయత్నించిన ప్రజలకు ప్రస్తుత పరిస్థితులు అయోమయంలో పడేశాయి. మొదట్లో తీవ్రమైన ప్రచారానికి నోచుకుని, ఆ తర్వాత చాలా వరకు చికిత్సలను తొలగిస్తూ వచ్చారు. ఇంతకీ ఆ చికిత్సలేంటో, ఎందుకు తొలగించాల్సి వచ్చిందో ఓ లుక్కేయండి. 


ప్లాస్మా థెరపీ

గతేడాది కరోనా సోకిన వారు చాలా మంది ప్లాస్మా థెరపీ కోసం ప్లాస్మా దానాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అది సమాజానికి తమ వంతు బాధ్యతగా భావించారు. ఇదంతా చేసింది కరోనాకు ప్లాస్మా థెరపీ మంచి చికిత్సా విధానం అమని ప్రపంచం మొత్తం నమ్మడమే. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్).. ఇటీవలే కరోనా చికిత్సకు సంబంధించిన క్లినికల్ మేనేజ్‌మెంట్ మార్గదర్శకాల నుంచి ప్లాస్మా థెరపీని తొలగించింది. ఐసీఎంఆర్-నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఫర్ కొవిడ్-19 సంస్థలు కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదని భావించి, ఓటింగ్ వేసి మరీ ఈ చికిత్సా విధానాన్ని తొలగించాయి.


హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ)

గతేడాది అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా భారతదేశం నుంచి అమెరికా హైడ్రాక్సీక్లోరోక్విన్ దిగుమతి చేసుకుంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే దీన్ని గేమ్ ఛేంజర్ అని కూడా అభివర్ణించారు. దీన్ని భారత్ తమకు చేసిన గొప్ప సాయంగా అగ్రరాజ్యం కొనియాడింది. ఎందుకంటే అప్పట్లో కరోనా చికిత్సలో ఈ హెచ్‌సీక్యూ అంతగా ఉపయోగిస్తున్నారు. ఇది ఉంటే కరోనా చికిత్స సగం సులభం అయిపోయినట్లే అని భావించారు. వ్యాక్సిన్ కూడా లేని ఆ రోజుల్లో ఇదే కరోనా పేషెంట్లకు సంజీవని అయ్యింది. మార్కెట్లలో ఈ మందు దొరకడం అసంభవంగా మారింది. అయితే ఆ తర్వాత కరోనా తీవ్రత విషమించిన పేషెంట్లపై ఇది ఎటువంటి ప్రభావమూ చూపడం లేదని వార్తలు వచ్చాయి. దీనికితోడు కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా వచ్చినట్లు తెలిసింది. దాంతో ప్రపంచం కరోనా చికిత్సలో హెచ్‌సీక్యూ వాడకాన్ని ఆపేసింది.


ఐవర్‌మెక్టిన్

పారాసైటిక్ ఇన్‌ఫెక్షన్లకు ఉపయోగించే ఈ ఔషధాన్ని కరోనా పేషెంట్లకు ప్రిస్క్రయిబ్ చేస్తున్నారు. మనదేశంలో చాలా రాష్ట్రాలు కూడా కరోనా చికిత్సలో దీన్ని ఒక భాగం చేశాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం దీని వాడకాన్ని సాధ్యమైనంతగా ఎవాయిడ్ చేయాలని సూచిస్తోంది. ఇటీవల భారత ప్రభుత్వం కరోనా చికిత్స కోసం విడుదల చేసిన రివైజ్డ్ ప్రొటోకాల్ జాబితాలో కూడా స్థానం సంపాదించింది. ‘‘ఒక కొత్త లక్షణంపై ఏ డ్రగ్ వాడుతున్నా సరైన జాగ్రత్తలు, దాని సామర్థ్యం చాలా ముఖ్యం. అందుకే క్లినికల్ ట్రయల్స్‌లో తప్పితే సాధారణ కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్ ఉపయోగించ వద్దనే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది’’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ప్రకటించారు.


ఫావిపిరవిర్‌:

కరోనా బారిన పడిన వాళ్లు పావిపిరవిర్ మెడిసిన్‌ను ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉన్నాయని మొదట్లో విపరీతంగా వార్తలు వచ్చాయి. ఈ మెడిసిన్‌ను తయారుచేసే గ్లెన్‌మార్క్ ఫార్మా సంస్థ కూడా కొవిడ్ 19ను నయం చేయడంలో ఫావిపిరవిర్ మెరుగైన ఫలితాలను ఇస్తోందని ప్రకటించుకుంది కూడా. డాక్టర్లు కూడా వీటిని రోగులకు వాడటం మొదలు పెట్టారు. అయితే దీని వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనీ, కరోనా రోగులకు ఈ మెడిసిన్ ఎంతమేరకు ఉపయోగపడుతోందన్న విషయంలో ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ చేయలేదని చెబుతూ దీన్ని కూడా కరోనా రోగులకు వాడొద్దంటూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.



Updated Date - 2021-06-08T18:20:36+05:30 IST