పేదల సొంతింటి కల తీర్చండి

ABN , First Publish Date - 2020-09-12T06:03:27+05:30 IST

రాష్ట్రంలో పేదలకు పాతికలక్షల ఇళ్లను నిర్మించి ఇస్తామని మీరు చేసిన ఎన్నికల వాగ్దానంపై మొదటి ఏడాదిలో తొలి అడుగు కూడా పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు...

పేదల సొంతింటి కల తీర్చండి

పేదలకు సాయమందించే విషయంలో కులాలు, పార్టీలు చూడబోమని పదే పదే ప్రకటించే మీరు వారందరికీ మంజూరైన ఇళ్లను రాజకీయ కక్షతో రద్దు చేయడం దుర్మార్గం. మీరు పంపిణీ చేయాలనుకుంటున్న సుమారు 60వేల పైచిలుకు ఎకరాల భూముల సేకరణలో అంతులేని అవినీతి జరిగిందన్నది జగద్విదితం. ఆవ భూముల ధరలను అమాంతం పెంచేసి అధికార పార్టీ నేతలే కోట్ల రూపాయలు కొట్టేశారన్నది నిష్టుర సత్యం.


గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారికి,

రాష్ట్రంలో పేదలకు పాతికలక్షల ఇళ్లను నిర్మించి ఇస్తామని మీరు చేసిన ఎన్నికల వాగ్దానంపై మొదటి ఏడాదిలో తొలి అడుగు కూడా పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ప్రకటన కూడా కార్యరూపం దాల్చలేదు. పైగా పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న సర్కారు ప్రయత్నాలకు తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతోందని మీరు అభాండాలు వేస్తున్నారు.


చంద్రబాబు హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా పెద్ద సంఖ్యలో ఇళ్ళను మంజూరు చేయించుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన స్వంతనిధులతో ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద పదిలక్షల మంది పేదలకు పక్కా ఇళ్లను మంజూరు చేసింది. 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో మంజూరై వివిధ కారణాల వల్ల అర్ధంతరంగా ఆగిపోయిన 4,40,426 గృహాలకు అదనంగా 25 నుంచి 50 వేల రూపాయల దాకా ఆర్థిక సహాయాన్ని అందించి వాటిని పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులను ప్రోత్సహించింది. 2019 మార్చి నాటికి వాటిలో 2,17,375 ఇళ్లను పేదలు నిర్మించుకోగలిగారు. గత ప్రభుత్వపు ఇళ్ల పథకాన్ని తామెందుకు కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వం అనుకోలేదు. అందువల్లే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద మంజూరు చేసిన మొత్తం 20,96,331 ఇళ్ల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ సంస్థ చేపట్టింది. 2019 ఫిబ్రవరి నాటికే 7,76,456 ఇళ్లు పూర్తయ్యాయి. ఇవి కాకుండా నగరాల్లో, పట్టణాల్లో బహుళ అంతస్తుల భవనాల రూపంలో 5.24 లక్షల మంది పేద, మధ్య తరగతి వారి కోసం ఏపి టిడ్కో ద్వారా గృహాల నిర్మాణం చేపట్టాం. వీటిలో కూడా సగానికి పైగా ఇళ్లు పూర్తయ్యాయి.


కేంద్రం పట్టణ గృహనిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో వివిధ జిల్లాల్లో గ్రామీణ నియోజకవర్గాలను కలుపుతూ 2018లో పలు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశాం. వాటి పరిధిలోని 120 నియోజకవర్గాలకు అదనంగా మరో 2,88,531 ఇళ్ళను పి.ఎం.ఏ.వై. (అర్బన్) కింద తెచ్చుకున్నాం. ఇంకో రెండున్నర లక్షల ఇళ్లకు డిపిఆర్‌లు సిద్ధం చేశాం. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం వాటిని మంజూరు చేసింది. ఇవన్నీ కార్యరూపం దాల్చితే సుమారు 30 లక్షల సామాన్య కుటుంబాలకు సొంత ఇంటి కల సాకారమవుతుంది. 2019 ఏప్రిల్ నాటికి గ్రామీణ, పట్టణ గృహనిర్మాణ పథకాల కింద దాదాపు తొమ్మిది లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మరో 20 లక్షల మందికి గృహవసతి కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే 2019లో వైసిపి అధికారంలోకి వచ్చాక పేదల గృహనిర్మాణం పూర్తిగా అగిపోయింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసుకున్న వారికి చెల్లించాల్సిన రూ.1500 కోట్ల బిల్లులు ఇంకా చెల్లించలేదు. 2019-–20 వార్షిక బడ్జెట్‌లో మీరు గృహనిర్మాణానికి రూ.3615 కోట్లు కేటాయించినా, కేవలం 472.77 కోట్లు ఖర్చు చేశారు. అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్న పేదలకు పెండింగ్ బిల్లులను విడుదల చేసి ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నాను. 


ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు తీసుకున్న తరువాత గత ఏడాది జూలైలో జరిగిన గృహనిర్మాణ సమీక్షలో గత ప్రభుత్వం మంజూరు చేసినన వాటిలో 4,36,907 ఇళ్లను రద్దు చేశారు. మేము అమలుచేసిన ఎన్‌టిఆర్ హౌసింగ్ స్కీం స్థానంలో తెచ్చిన వైఎస్‌ఆర్ గృహనిర్మాణ పథకంలో కూడా ఇప్పటివరకు వారికి ఇళ్ళను మంజూరు చేయకపోవడం అన్యాయం. పేదలకు సాయమందించే విషయంలో కులాలు, పార్టీలు చూడబోమని పదేపదే ప్రకటించే మీరు వారందరికీ మంజూరైన ఇళ్లను రాజకీయ కక్షతో రద్దు చేయడం దుర్మార్గం. 


రాష్ట్రవ్యాప్తంగా మీరు పంపిణీ చేయాలనుకుంటున్న సుమారు 60వేల పైచిలుకు ఎకరాల భూముల సేకరణలో అంతులేని అవినీతి జరిగిందన్నది జగద్విదితం. మడ అడవుల భూములు పదిహేను అడుగుల నీటి మడుగులను తలపిస్తున్నాయి. ఆవ భూముల ధరలను అమాంతం పెంచేసి అధికార పార్టీ నేతలే కోట్ల రూపాయలు కొట్టేశారన్నది నిష్టుర సత్యం. దళితుల అసైన్డ్‌భూములు దౌర్జన్యంగా లాక్కోవడం వివాదస్పదమైంది. చాలాచోట్ల నివేశనా స్థలాలకు భూములు పోగొట్టుకున్న రైతులకిచ్చిన ధరలకన్నా అధిక మొత్తాలు అధికారపార్టీ ముసుగేసుకున్న దళారుల చేతుల్లోకి వెళ్ళాయి. వివిధ మార్గాల్లో అందిన సమాచారం ప్రకారం 353 చోట్ల ఇళ్ల స్థలాలకు భూసేకరణలో సుమారు రూ.3,700 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్క విశాఖ జిల్లాలోనే వందల కోట్ల ప్రజాధనం అక్రమార్కుల పాలైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్‌ భూములు పోగొట్టుకున్న దళితులు, ఇతరులలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండవచ్చు. అలాంటి వారితో ప్రభుత్వం చర్చించి ఉభయులకు ఉపయుక్తంగా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వాళ్లకు స్థలాలు రాకుండా తెలుగుదేశం వారు అడ్డుపడుతున్నారని మీ పార్టీ నాయకులు, మంత్రులు ప్రతిరోజూ సాగిస్తున్న దుష్ర్పచారం చాలదన్నట్లు ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో స్వయంగా మీరే ఆరోపించడం అత్యంత బాధాకరం, బాధ్యతారాహిత్యం.


పట్టణ పేదలకు మీరిచ్చే స్థలాలు జనావాసాలకు దూరంగా ఉన్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి ఇవ్వదలచిన సెంటు స్థలంలో సౌకర్యవంతమైన ఇంటి నిర్మాణం సాధ్యపడదు. ప్రతిపాదిత ఇంటి నమూనాను పరిశీలించినా అదే స్పష్టమవుతుంది. తెలుగుదేశం హయాంలో ఇచ్చిన ఇళ్ళను లబ్ధిదారులు వారి అభిరుచులకు అనుగుణంగా నిర్మించుకున్నారు. మూసపద్ధతిలో ఇళ్లు నిర్మించుకోవాలనడం పేదల ఇష్టాలను కాలరాయడమే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ కాలనీలు, పిచ్చుకగూళ్లను తలపించే రాజీవ్ గృహకల్ప ఇళ్లు అనేకం నేటికీ నిర్మానుష్యంగా, నిరుపయోగంగా ఉండిపోయాయి. జగనన్న కాలనీలు కూడా భవిష్యత్తులో నిరర్ధక ఆస్తులుగా మిగలకుండా ఉండేందుకు, ఆచితూచి సముచిత నిర్ణయం తీసుకోవాన్నది నా సూచన.


రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న 30లక్షల ఇళ్లస్థలాలు కాకుండానే, ఇప్పటికే స్థలాలున్న సామాన్యులకు పక్కా ఇళ్లు మంజూరు చేస్తే కనీసం 15లక్షల మందికి వారి సొంతింటి కల నెరవేరుతుంది. ఈ స్థలాలు పల్లెల్లో, పట్టణాల్లో జనావాసాల మధ్యనే ఉంటాయి కనుక అవి నిరుపయోగంగా మారే అవకాశమే ఉండదు. ఏడాది కిందట మీరు రద్దు చేసిన 4.37 లక్షల ఇళ్ల మంజూరును పునరుద్ధరించడంతో పాటు, మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాలకు ఇప్పటిదాకా కేంద్రం మంజూరు చేసిన ఎనిమిదిలక్షల పైచిలుకు గృహాల నిర్మాణం ప్రారంభిస్తే, మొత్తం మీద పదిలక్షల ఇళ్ల పనులు మొదలవుతాయి. మేము అధికారంలో ఉన్నప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 10.86 లక్షల మంది లబ్ధిదారుల వివరాలను ఆవాస్ సాఫ్ట్ ద్వారా కేంద్రానికి సమర్పించాం. సదరు ప్రతిపాదనలను అమలు చేస్తే ఎన్నికల్లో మీరిచ్చిన పాతిక లక్షల గృహాల నిర్మాణ హామీని నెరవేర్చినట్లవుతుంది. మీ హామీ ప్రకారం ఏడాదికి అయిదు లక్షల గృహాలను నిర్మించాల్సి ఉంటుంది. రెండో ఏడాదిలో కూడా సదరు హామీని నెరవేర్చే యత్నం మొదలు కాలేదంటే అది మొగ్గ తొడిగి, ఫలితం దక్కాలంటే ప్రజలు మీకిచ్చిన పుణ్యకాలం సరిపోదు.


ముఖ్యమంత్రి గారూ! వీటన్నిటినీ దృష్ట్యా పేదల గృహ నిర్మాణంలో చిత్తశుద్ధి లేనిది ఎవరికి? ప్రభుత్వానికా? ప్రతిపక్షానికా? సత్యదూరమైన ప్రచారంతో సామాన్యుల సొంతింటి కలను ఇంకెంత కాలం నెరవేరకుండా చేస్తారు. ఇప్పటికైనా పక్కా ఇళ్లకు ప్రతిపక్ష తెలుగుదేశం అడ్డుపడుతోందంటూ మీరు, మీ బృందం సాగిస్తున్న పస లేని ప్రచారాన్ని పక్కన పెట్టి, పేదల జీవిత కాల స్వప్నమైన గృహనిర్మాణాల విషయంలో గట్టి మేలు తలపెడితే ప్రజలు హర్షిస్తారు!

భవదీయుడు

కాలవ శ్రీనివాసులు

మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు

Updated Date - 2020-09-12T06:03:27+05:30 IST