ఫుల్‌ ప్రాక్టీస్‌..

ABN , First Publish Date - 2020-12-13T10:06:27+05:30 IST

ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న వామప్‌ మ్యాచ్‌లో రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం చూపారు. తొలి ఇన్నింగ్స్‌కు పూర్తి భిన్నంగా సాగిన వీరి జోరుకు సిడ్నీ మైదానంలో పరుగుల వరద పారింది.

ఫుల్‌ ప్రాక్టీస్‌..

ఆకట్టుకున్న మయాంక్‌, గిల్‌ 

భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌ 386/4


సిడ్నీ: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న వామప్‌ మ్యాచ్‌లో రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం చూపారు. తొలి ఇన్నింగ్స్‌కు పూర్తి భిన్నంగా సాగిన వీరి జోరుకు సిడ్నీ మైదానంలో పరుగుల వరద పారింది. తెలుగు కుర్రాడు హనుమ విహారి (194 బంతుల్లో 13 ఫోర్లతో 104 బ్యాటింగ్‌) నిలకడైన ఆటతో శతకం పూర్తి చేయగా.. ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రిషభ్‌ పంత్‌ (73 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 బ్యాటింగ్‌) అచ్చు టీ20 తరహాలో బ్యాట్‌ ఝుళిపించాడు. చివరి సెషన్‌లో బరిలోకి దిగినప్పటికీ అతను ఆఖరి బంతికి శతకాన్ని అందుకోవడం విశేషం. ఫలితంగా శనివారం రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లకు 386 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (65), మయాంక్‌ అగర్వాల్‌ (61) అర్ధసెంచరీలతో రాణించారు. స్టెకెటీకి రెండు వికెట్లు దక్కాయి. భారత్‌ ‘ఎ’ 472 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా.. ఆటకు ఆదివారం చివరి రోజు.


మయాంక్‌, గిల్‌ అర్ధసెంచరీలు: రెండో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ పృథ్వీ షా (3) వికెట్‌ను భారత్‌ కోల్పోయింది. కానీ మరో ఓపెనర్‌ మయాంక్‌, గిల్‌ మధ్య చక్కటి భాగస్వామ్యం ఏర్పడింది. రెండో వికెట్‌కు ఈ జోడీ 104 పరుగులు అందించింది. ఫీల్డర్ల మధ్య ఖాళీలను వినియోగించుకుంటూ డ్రైవ్‌ షాట్లతో ఆకట్టుకున్న గిల్‌ 49 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 25వ ఓవర్‌లో గిల్‌ను స్పిన్నర్‌ స్వెప్సన్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత అర్ధసెంచరీ పూర్తి చేసిన మయాంక్‌ కాసేపటికే వెనుదిరిగాడు. విహారితో కలిసి అతడు మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. ఈ దశలో విహారితో పాటు కెప్టెన్‌ అజింక్యా రహానె (38) జట్టు స్కోరును పెంచే బాధ్యత తీసుకున్నాడు. విహారి ఓపిగ్గా ఆడినా రహానె ఆరంభంలో దూకుడు కనబరిచాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 78 పరుగులు జత చేశారు.


పంత్‌ ఫటాఫట్‌: చివరి సెషన్‌లో రహానె నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన పంత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఎదురుదాడికి దిగాడు. అటు స్వెప్సన్‌ బౌలింగ్‌లో విహారి వరుస ఫోర్లతో పరుగులు రాబట్టాడు. 188 బంతుల్లో విహారి సెంచరీ పూర్తి చేయగా.. అటు పంత్‌ మైదానం నలువైపులా బౌండరీలతో హోరెత్తించాడు. రెండోరోజు ఆట ముగిసేందుకు ఆఖరి ఓవర్‌ మాత్రమే మిగిలి ఉండగా.. పంత్‌ సెంచరీకి 19 పరుగులు అవసరమయ్యాయి. వైల్డర్‌మత్‌ వేసిన ఈ ఓవర్‌లో తొలి బంతిని వదిలేసిన పంత్‌.. ఆ తర్వాత వరుసగా 4,4,6,4,4 బాది 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఐదో వికెట్‌కు అజేయంగా 147 పరుగులు నమోదయ్యాయి.


సంక్షిప్త స్కోర్లు

భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: 194 ఆలౌట్‌. 

ఆసీస్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: 108 ఆలౌట్‌.

భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌: 90 ఓవర్లలో 386/4 (విహారి 104 బ్యాటింగ్‌, పంత్‌ 103 బ్యాటింగ్‌, గిల్‌ 65, మయాంక్‌ 61, స్టెకెటీ 2/54).

Updated Date - 2020-12-13T10:06:27+05:30 IST