రోజంతా జడివాన.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

ABN , First Publish Date - 2020-08-14T14:49:49+05:30 IST

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోజంతా జడివాన కురిసింది. గురువారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది.

రోజంతా జడివాన.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

పెరుగుతున్న కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు ఉధృతి

ప్రమాదకర స్థితిలో తాత్కాలిక వంతెన 

నీట మునుగుతున్న పంటలు 

ముసురుతో చిత్తడిగా మారుతున్న రోడ్లు 


వికారాబాద్‌/కొడంగల్‌(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోజంతా జడివాన కురిసింది. గురువారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ల్లో ముసురు నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగింది. వికారాబాద్‌ నియోజకవర్గంలోని బంట్వారంలో అత్యధికంగా 5.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా, నవాబుపేటలో 4.4 మి.మీ, వికారాబాద్‌లో 3.4మి.మీ, మర్పల్లి 3.2 మి.మీ, ధారూరు 2.2 మి.మీ ల వర్షపాతంగా నమోదైంది.


ప్రమాదకర స్థితిలో తాత్కాలిక వంతెన 

ధారూరు మండలంలోని రుద్రారం-నాగసమందర్‌ గ్రామాల మధ్యన రోడ్డుపై ఉన్న తాత్కాలిక వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుంది. కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు నుంచి వరదనీరు పోటెత్తితే తాత్కాలిక వంతెన కొట్టుకుపోవటం ఖాయమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు నుంచి రోజురోజుకూ వరద ప్రవాహ ఉధృతి క్రమంగా పెరుగుతోంది. భారీ వర్షం కురిస్తే అలుగు నీరు పెరిగితే తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయే అవకాశాలున్నాయి. 


నీట మునుగుతున్న పంటలు

మండలాల్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి పంటలు నీట మునుగుతున్నాయి. మూడేళ్లుగా సరైన వర్షాలు లేక కాస్తో కూస్తో పండిన పంటలు, ఈ సంవత్సరం కరోనా వ్యాప్తితో అన్ని రంగాలు మూత పడగా, ఒక్క వ్యవసాయ రంగంపైనే దృష్టి సారించారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా కురు స్తున్న వర్షాలతో కలుపు మొక్కలు తీసేందుకు కూడా సమయం దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొడంగల్‌లో పంట పొలాల్లో నీరు చేరడంతో పత్తి, కంది, పెసర పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.  


రోజంతా ముసురు వర్షం..

ధారూరు మండంలోని అన్ని గ్రామాల్లో బుధవారం రాత్రి నుంచి ముసురువర్షం కురుస్తూ గురువారం కూడా కొనసాగింది. నవాబుపేట మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఉదయం నుంచి ముసురు వర్షం కురవడంతో రైతులు, పశువుల కాపరులు ఇండ్లలోనే ఉండిపోయారు. బంట్వారం, మోమిన్‌పేట, మర్పల్లి మండలాల్లో సైతం అదే పరిస్థితి నెలకొంది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో పాదచారులకు ఇబ్బందులు తప్పలేదు. పరిగి సబ్‌ డివిజన్‌లో పరిగి, పూడూరు, కులకచర్ల, దోమ మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ వర్షం కురిసింది. లక్నాపూర్‌ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతున్నది. పరిగిలో 3.8 మీ.మీ, దోమలో 3.0, కులకచర్లలో 4.40 మీ.మీ, పూడూరులో 2.6 మీ.మీ వర్షం కురిసింది. 


అంతర్గత రోడ్లు చిత్తడి

ఆమనగల్లు/ఇబ్రహీంపట్నం/చేవెళ్ల: ఆమనగల్లులో కాలనీలు, అంతర్గత రోడ్లు వర్షం నీటితో చిత్తడిగా మారాయి. ఇబ్రహీంపట్నంలో పెళ్లిళ్లకు ముసురు వానతో ఇబ్బందులు తప్పలేదు. యాచారం, నందివనపర్తిలో గ్రామాల్లో అంతర్గత రహదారులు బురదమయం అయ్యాయి. చేవెళ్లలో వర్షం ఎకదాటిగా కురిసింది. దీంతో పలు చోట్ల రోడ్లన్ని గుంతులమైయమై పోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. 


నాగారం, దమ్మాయిగూడల్లో చిరుజల్లులు

కీసర రూరల్‌: చిరుజల్లులతో నాగా రం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలు తడిసి ముద్దయ్యాయి. కాలనీల్లోని మట్టి రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. దీనికి తోడు చలి తోడవటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా విజృంభిస్తున్న వేళ వాతావరణం చల్లబడంతో వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-14T14:49:49+05:30 IST